Terrorist Attack : ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రదాడి.. నలుగురు జవాన్లు మృతి
Terrorist Attack : జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లా బిల్లవార్‌లోని మచేడి ప్రాంతంలో సైనిక వాహనంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో సోమవారం భారత ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు సైనికులు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. అయితే సైనికులు ఎదురుకాల్పులు మెుదలుపెట్టడంతో ఆ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు పరారు అయ్యారు. రోడ్డు మార్గంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది.
కుల్గామ్‌లో జరిగిన జంట ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన మరుసటి రోజు ఆర్మీ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఉగ్రవాదులు ప్లాన్ ప్రకారమే కథువాలో దాడి చేశారు. మెుదట కాన్వాయ్‌పై గ్రనేడ్ విసిరారు. వాహనం ఆగకపోవడంతో కాల్పులు చేశారు. బలగాలు ఎదురుకాల్పులు చేయడంతో ఉగ్రవాదులు దగ్గరలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. మరికొంతమందికి గాయాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. రెండు రోజుల్లో ఇది రెండోసారి. మరోవైపు కుల్గామ్ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఇందులో ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను మోడర్‌గామ్ ఎన్‌కౌంటర్ స్థలం నుండి స్వాధీనం చేసుకోగా, ఆదివారం చిన్నగాం సైట్ నుండి నాలుగు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు మరణించారు.
కుల్గామ్‌లో యాంటీ టెర్రర్ ఆపరేషన్స్‌లో మరణించిన ఇద్దరు సైనికులకు భారత సైన్యం నివాళులర్పించింది. జమ్మూ కాశ్మీర్‌లో ఇటీవలి నెలల్లో ఉగ్రదాడులు ఎక్కువయ్యాయి. గత నెల, దోడా జిల్లాలోని గండో, భదర్వా సెక్టార్‌లో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.