Encounter : తెలంగాణ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు... ఇద్దరు మావోయిస్టులు మృతి
Encounter in Kothagudem District:తెలంగాణ సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ జరిగింది. కొత్తగూడెం జిల్లా పరిధిలో ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ ను మరింత ముమ్మరం చేశాయి.
Two Maoists killed in Encounter: తెలంగాణ - ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో తుపాకుల మోత మోగింది. పోలీసులు-మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందారు. ఎర్రంపాడు పరిధి పుట్టపాడు అడవుల్లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిలో చర్ల ఎల్‌జీఎస్ కమాండర్ ఎర్రయ్య అలియాస్ రాజేశ్, చైతన్య నాట్యమండలి కమాండర్ నంద ఉన్నారు. పక్కా సమాచారంతోనే గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా... ఎదురుపడినట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలంలో పలు ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాల్పుల నేపథ్యంలో అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్‌ను ముమ్మరం చేశాయి. తాజా కాల్పుల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సరిహద్దుల్లో తనిఖీలను చేపట్టారు పోలీసులు.
హెచ్చరిస్తూ లేఖలు...!
జగిత్యాల జిల్లాలో మావోయిస్టుల పేరుతో కొన్ని లేఖలు కలకలం రేపుతున్నాయి. మొత్తంగా 25 మందికిపైగా సర్పంచ్ లు, ఎంపీటీసీలకు హెచ్చరిస్తూ లేఖలు అందినట్లు తెలుస్తోంది. మావోయిస్టు గోదావరి బెల్ట్ ఏరియా కమిటీ పేరుతో ఈ లేఖలు విడుదల అయ్యాయి. అటవీ భూములు ఆక్రమిస్తూ, అక్రమంగా పట్టాలు జారీచేస్తున్నారని లేఖల్లో ఆరోపించారు. లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని.. పంచాయితీలను పోలీసుస్టేషన్ల దాకా తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారు తమ పద్ధతులు మార్చుకోకుంటే ప్రజాకోర్టులో శిక్షించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే నిజంగానే మావోయిస్టులు లేఖలు రాశారా..? లేక కావాలనే కొందరిలా చేశారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు లేఖలపై విచారణ జరుపుతున్నాయి.