Israel Hamas war : గాజాలో ప్రతి 10 నిమిషాలకు ఒక చిన్నారి హతం!
Israel Hamas war : ఇజ్రాయెల్ దాడులతో గాజాలో పరిస్థితులు.. రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. అక్కడ.. ప్రతి 10 నిమిషాలకు సగటున ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోతున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.
Israel Hamas war latest updates : ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం.. 37వ రోజుకు చేరింది. గాజాపై ఇజ్రాయెల్ దళాలు బాంబులు, వాయుదాడులతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా గాజాలోని లక్షలాది మంది ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆందోళనకర వార్తలు వెలుగులోకి వచ్చాయి.
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం అప్డేట్స్..
ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో గాజాలోని తాజా పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ) ఓ నివేదికను విడుదల చేసింది. ప్రతి 10 నిమిషాలకు సగటు ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోతున్నట్టు ఆ నివేదిక పేర్కొంది.
అక్టోబర్ 7న.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు.. గాజాలోని ఆసుపత్రులు, క్లీనిక్స్, అంబులెన్స్‌లే టార్గెట్‌గా 250కిపైగా దాడులు చేసింది ఇజ్రాయెల్. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
Israel Hamas war death toll : మరోవైపు అక్టోబర్ 7 మారణఖాండలో మరణాల సంఖ్యను తగ్గించింది ఇజ్రాయెల్. తొలుత.. 1,400 మంది మరణించినట్టు చెప్పగా.. ఇప్పుడు ఆ సంఖ్యను 1,200కి సవరించింది.
పాలస్తీనాకు మద్దతుగా ప్రపంచ దేశాల్లో చాలా మంది నిరసనలు చేస్తున్నారు. ప్రఖ్యాత ఎంఐటీ వర్సిటీలో చాలా మంది విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. వారందరినీ యూనివర్సిటీ సిబ్బంది సస్పెండ్ చేసింది.
గాజాపై దాడులను నిలిపేవేయాలని ఇజ్రాయెల్‌కు ప్రపంచ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. హమాస్ చేసిన ఉగ్రవాద చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, కానీ అమాయకులైన గాజావాసులపై ఈ తరహా దాడులు సరికాదని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ అభిప్రాయపడ్డారు.
Gaza news today : ఇజ్రాయెల్‌తో యుద్ధంలో గాజాలో ఇప్పటికే 11,078 మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయాని హమాస్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరిలో 4,508మంది చిన్నారులు.. 3,027మంది మహిళలు ఉన్నట్టు స్పష్టం చేసింది.
హమాస్ అంతు చూసేంత వరకు తాము వెనకడుగు వేయమని తేల్చిచెబుతున్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు. ఎవరు చెప్పినా వినమని, దాడులను కొనసాగిస్తామని ఆయన అంటున్న మాటలు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి.
Gaza war death toll : గాజా ఉత్తర భాగంపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండగా.. చాలా మంది దక్షిణ భాగానికి వలస వెళ్లిపోతున్నారు. అక్కడ కూడా ఏ క్షణంలోనైనా మార్పులు జరగవచ్చని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.
సంబంధిత కథనం