Israel Gaza war: 28 రోజులుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం; గాజాను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ సైన్యం
Israel-Gaza war Day 28: ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతోంది. నవంబర్ 3వ తేదీ నాటికి ఈ యుద్ధం 28వ రోజుకు చేరింది. గాజా ను ఇజ్రాయెల్ దళాలు చుట్టుముట్టాయి.
Israel-Gaza war Day 28: భూ, వైమానిక దాడులతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే వేలాదిగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. గురువారం కూడా ఇజ్రాయెల్ గాజా నివాస ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది.
నివాస సముదాయంపై దాడి..
ఇజ్రాయెల్ వైమానిక దాడితో గాజా లోని ఒక నివాస సముదాయం కుప్పకూలింది. దాంతో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా సిటీ శివార్లలోని ఒక శరణార్థి భవనం కూడా కుప్పకూలింది. ఇజ్రాయెల్ దాడుల్లో మరణిస్తున్న వారిలో చిన్నారులు, మహిళలే అధికంగా ఉన్నారు. మరోవైపు, మానవీయ కోణంలో కాల్పుల విరమణ ప్రకటించాలని, గాజా కు ఔషధాలు, ఇతర నిత్యావసరాలు పంపించడానికి వీలు కల్పించాలని అంతర్జాతీయ సమాజం ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెస్తోంది. గాజాలోని పాఠశాలలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు ఇజ్రాయెల్ దాడిలో మరణించారని UN ఏజెన్సీ తెలిపింది.మరోవైపు, గాజా ఆసుపత్రుల్లో క్లిష్టమైన వైద్య సామాగ్రి కొరత ఉంది. గాజాలో దాదాపు 20 వేల మందికి పైగా ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడి, చికిత్స కోసం ఎదురు చూస్తున్నారు.
ఇజ్రాయెల్ కు అమెరికా సాయం
మరోవైపు, ఇజ్రాయెల్ కు 14.3 బిలియన్ల డాలర్ల సాయం అందించడానికి ఉద్దేశించిన బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. లెబనాన్ కు చెందిన హెజ్బొల్లా పై కూడా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆ దాడిలో హెజ్బల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన నలుగురు ఫైటర్స్ చనిపోయారు. కాగా, ఇజ్రాయెల్ దాడులపై హమాస్ తీవ్రంగా స్పందించింది. గాజాలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్ సైనికులను తిరిగి శవాలుగా ఇజ్రాయెల్ కు పంపిస్తామని హెచ్చరించింది.