World War 3: ఇక మూడో ప్రపంచ యుద్ధమేనా? ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడుల పర్యవసానాలేంటి?-is this beginning of world war 3 what irans attack on israel means for region ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  World War 3: ఇక మూడో ప్రపంచ యుద్ధమేనా? ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడుల పర్యవసానాలేంటి?

World War 3: ఇక మూడో ప్రపంచ యుద్ధమేనా? ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడుల పర్యవసానాలేంటి?

Sudarshan V HT Telugu
Oct 02, 2024 02:56 PM IST

World War 3: ఇజ్రాయెల్ పై ఇరాన్ వదిలిన బాలిస్టిక్ క్షిపణుల పరంపర ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇరాన్ దుస్సాహసానికి ఒడిగట్టిందని, పర్యవసానాలకు సిద్ధంగా ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, మిత్రదేశం ఇజ్రాయెల్ కు మిలటరీ సాయం చేయడానికి అమెరికా సిద్ధమవుతోంది.

ఇజ్రాయెల్ పైకి ఇరాన్ వదిలిన బాలిస్టిక్ క్షిపణులు
ఇజ్రాయెల్ పైకి ఇరాన్ వదిలిన బాలిస్టిక్ క్షిపణులు (AP)

World War 3: ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడులతో మధ్య ప్రాచ్యం మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ పై ప్రతిదాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ప్రారంభమేనని పలువురు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో థర్డ్ వరల్డ్ వార్ (World War 3) హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ సంఘర్షణపై భారత్ సహా ప్రపంచ దేశాలు స్పందించాయి.

హెజ్బొల్లా చీఫ్ హత్య నేపథ్యంలో..

లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా చనిపోవడం ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్ ల మధ్య తాజా సంఘర్షణకు కారణమైంది. హెజ్బొల్లా నేతల హత్యలు, లెబనాన్ లో దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఇజ్రాయెల్ పై పెద్ధ ఎత్తున బాలిస్టిక్ క్షిపణుల దాడి చేయడంతో మధ్యప్రాచ్యంలో మంగళవారం రాత్రి ఘర్షణ తీవ్రంగా పెరిగింది. ఈ దాడి ఇజ్రాయెల్ అంతటా అలజడి సృష్టించింది. పౌరులు సురక్షిత బంకర్లలో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ఇరాన్ క్షిపణి దాడులతో చివరకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతాన్యాహూ కూడా బంకర్ లోకి పరుగులు తీశాడని వార్తలు వచ్చాయి.

ప్రతీకారం తప్పదు

ఈ దాడికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని, సరైన సమయంలో భారీ స్థాయిలో ప్రతి దాడి ఉంటుందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటే ఇజ్రాయెల్ పై పూర్తి స్థాయి యుద్ధం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. దాంతో, మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు మొదట ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంగా ప్రారంభమైనప్పటికీ, క్రమేణా ప్రపంచవ్యాప్తమై మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందన్న భయాలు మొదలయ్యాయి.

నష్టపోయేది ఇరానే..

ఇజ్రాయెల్ రక్షణ దళాలు (IDF) ప్రస్తుతం ఇరాన్ (iran) చేసిన క్షిపణి దాడిని అంచనా వేస్తున్నాయని, టెహ్రాన్ కు తగిన ప్రతిస్పందనను సిద్ధం చేస్తున్నాయని భారతదేశంలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ప్రతినిధి గై నిర్ తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్ తో పూర్తి స్థాయి యుద్ధాన్ని ప్రారంభించాలని భావిస్తే అది ఇరాన్ కు భారీ నష్టం చేకూరుస్తుందని అన్నారు. ఇజ్రాయెల్ పై దాడి చేయడానికి ఇరాన్ తో కలిసి వెళ్లాలని భావించే ఇతర దేశాలను నిర్ హెచ్చరించారు. ఫలితం వారికి కూడా వినాశకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఇజ్రాయెల్ కు అమెరికా సాయం

ఇజ్రాయెల్ (israel) కు చిరకాల మిత్రదేశంగా ఉన్న అమెరికా.. ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో ఆ దేశానికి సైనిక సాయం అందించడానికి సిద్ధమైంది. క్షిపణులను నాశనం చేయడానికి సహాయపడే వ్యవస్థలను ఇజ్రాయెల్ కు యూఎస్ అందించనుంది. ఇందులో ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (biden), ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్యప్రాచ్యంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వైట్ హౌస్ మంగళవారం తెలిపింది. ఇజ్రాయెల్ ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణులను కూల్చివేయాలని అధ్యక్షుడు బైడెన్ అమెరికా సైన్యాన్ని ఆదేశించినట్లు వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.

సోషల్ మీడియాలో ట్రెండింగ్

ఇదిలా ఉండగా, ప్రపంచవ్యాప్తంగా భయాలు పెరగడంతో సోషల్ మీడియా (social media) ప్లాట్ ఫామ్ లు 'మూడో ప్రపంచ యుద్ధం' ట్యాగ్ లు, పోస్టులతో నిండిపోయాయి. ‘‘ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ పై దాడి చేసే ఇరాన్ క్షిపణులను అడ్డుకోవడంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ విఫలమైంది. మూడో ప్రపంచ యుద్ధం (World War 3) వచ్చినట్లుంది’’ అని ఓ ఎక్స్ యూజర్ కామెంట్ చేశాడు. మరొకరు ఇలా అన్నారు: ‘‘మూడవ ప్రపంచ యుద్ధం ఆల్రెడీ ప్రారంభమైంది’’ అని మరో యూజర్ స్పందించాడు. ‘‘ఒక్క క్షిపణి దాడితో ఇజ్రాయెల్ ను ఓడించగలమని #Iran అనుకుంటే పొరపాటే. ప్రస్తుతం #Israel చాలా పెద్ద శక్తి అని, దాని వెనుక అమెరికా నిలబడుతోంది’’ అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ పై దాడి ద్వారా ఇరాన్ మూడో ప్రపంచ యుద్ధానికి ఆహ్వానం పలికింది. దీనికి నెతన్యాహు త్వరలోనే సమాధానం చెబుతారని, ఈ యుద్ధం మానవ నాగరికతకు ప్రాణాంతకం అవుతుందని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.