Iran Israel Attack : ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు.. దేశమంతా హెచ్చరిక సైరన్ మోత.. రంగంలోకి అమెరికా-iran attacks against israel fires nearly 200 missiles after killing of hezbollah leader ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iran Israel Attack : ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు.. దేశమంతా హెచ్చరిక సైరన్ మోత.. రంగంలోకి అమెరికా

Iran Israel Attack : ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు.. దేశమంతా హెచ్చరిక సైరన్ మోత.. రంగంలోకి అమెరికా

Anand Sai HT Telugu
Oct 02, 2024 06:59 AM IST

Iran Israel attack : పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత దిగజారుతున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. దీంతో దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్ల మోతలు మోగాయి.

ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులతో విరుచుకుపడుతుంది. ఈ విషయం ఇజ్రాయెల్ అధికారులు స్వయంగా వెల్లడించారు. ఇరాన్ వేలాది మంది పౌరులను చంపే ఉద్దేశంతో ఉందని ఇజ్రాయెల్ ఆరోపించింది. తాజా పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఇరాన్ దాడితో ప్రజలంతా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్ ప్రయోగించినట్టుగా ఇరాన్ కూడా అంగీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఇజ్రాయెల్ కార్యకలాపాలకు ప్రతిస్పందనగా ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. మొదటిసారిగా ఇరాన్ దళాలు హైపర్‌సోనిక్ ఫట్టా క్షిపణులను ఉపయోగించాయి. ఇరాన్ నుండి 200కి పైగా క్షిపణులను తమ భూభాగంలోకి ప్రయోగించారని ఇజ్రాయెల్ నివేదించింది. వాటిని అడ్డగించేందుకు ఇజ్రాయెల్ వాయు రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగింది. ఇటీవలి కాలంలో లెబనాన్‌లో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా, ఇరాన్ కమాండర్‌ను హతమార్చినందుకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడి చేసింది.

మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి మీద అమెరికా స్పందించింది. ఎలాంటి ప్రత్యక్ష దాడి జరిగినా.. ఇరాన్‌కు తీవ్ర పరిణామాలు ఎదురువుతాయని వైట్‌హౌస్ నుంచి హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ను రక్షించేందుకు మద్దతు ఇస్తున్నామని అమెరికా తెలిపింది. 'దాడికి వ్యతిరేకంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇజ్రాయెల్‌తో కలిసి పని చేస్తాం.' అని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. అధ్యక్షుడు జో బిడెన్ కూడా అధికారులతో ఈ విషయమై సమావేశమయ్యారు. ఎంబసీలోని యూఎస్ ఉద్యోగులు, వారి కుటుంబాలు తదుపరి నోటీసులు వచ్చేవరకు ఆశ్రయం పొందవలసిందిగా అమెరికా ఆదేశించింది.

ఇంకోవైపు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం ఉద్యోగులకు భారత్ సూచనలు చేసింది. భారతీయ పౌరులందరు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారులు జారీ చేసిన భద్రతా ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండాలని కోరింది.

'దయచేసి జాగ్రత్తగా ఉండండి దేశంలో అనవసర ప్రయాణాలను ఆపేయండి. సెక్యురిటీ ఉండే ప్రదేశాలకు దగ్గరగా ఉండండి. ఎంబసీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోంది. భారతీయులందరి రక్షణ కోసం ఇజ్రాయెల్ అధికారులతో క్రమం తప్పకుండా టచ్‌లో ఉంటున్నాం.' అని రాయబార కార్యాలయం తెలిపింది.

ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయ పౌరుల కోసం ఎంబసీ హెల్ప్‌లైన్ నంబర్‌లను కూడా జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో దాదాపు 18,000 మంది భారతీయ పౌరులు ఉన్నారని, ప్రధానంగా వజ్రాల వ్యాపారులు, ఐటీ నిపుణులు, విద్యార్థులను ఉన్నారని ఎంబసీ వెబ్‌సైట్ పేర్కొంది.

టాపిక్