Frontrunner Rishi Sunak: బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో, అందరి దృష్టి ముఖ్యంగా, భారతీయుల చూపు మరోసారి తమవాడైన రిషి సునక్ వైపు మళ్లింది. బ్రిటన్ పీఎం అయిన భారతీయ సంతతికి చెందిన తొలి నాయకుడి గా రికార్డు సృష్టించే అవకాశాన్ని నెలన్నర క్రితం కోల్పోయిన రిషి సునక్ కు అదే అవకాశం మళ్లీ వెతుక్కుంటూ వచ్చింది.
దాదాపు ఆరు వారాల క్రితం బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ తొలి రోజు నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని తొలగించే బాధ్యతలో ఆమె విఫలమయ్యారు. ఆ విషయాన్ని ఆమే స్వయంగా అంగీకరించి, పదవికి రాజీనామా చేశారు. ఆమె చేపట్టిన ఆర్థిక నిర్ణయాలు, మిని బడ్జెట్ దేశ ఆర్థిక రంగాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. ట్రస్ రాజీనామా వార్త రాగానే, బ్రిటన్ స్టాక్ మార్కెట్లు, బ్రిటన్ కరెన్సీ కోలుకోవడం ప్రారంభించాయి.
వారం రోజుల్లో కొత్త నేత ఎంపిక పూర్తవుతుందని రాజీనామా అనంతరం లిజ్ ట్రస్ ప్రకటించారు. అయితే, తదుపరి పీఎం రేసులో ఎవరున్నారు? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. పీఎం ఎంపికకకు సంబంధించి కన్సర్వేటివ్ పార్టీలో గత ఎన్నికల సమయంలో లిజ్ ట్రస్ చేతిలో చివరి నిమిషంలో ఓటమి పాలైన రిషి సునక్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
లిజ్ ట్రస్ రాజీనామా ఖాయమని ముందే తెలియడంతో, తదుపరి పీఎం ఎవరవుతారని ఒపీనియన్ పోల్స్ కూడా జరిగాయి. వాటిలో అత్యధికులు రిషి సునక్ కే ఓటేశారు. పోల్ లో పాల్గొన్న వారిలో 55% సునక్ కు ఎక్కువగా అవకాశాలున్నాయని తెలుపగా, ఈ రేసులో రెండో స్థానంలో ఉన్న పెన్నీ మార్డంట్ కు 16% మాత్రమే మద్దతిచ్చారు. కీలక ప్రత్యర్థి, ట్రస్ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న జెరొమీ హంట్ ఈ సారి పోటీలో నిలవడం లేదని ప్రకటించాడు. ప్రస్తుతానికి ఈ రేసులో సునక్, పెన్నీ మార్డంట్, గ్రాంట్ షాప్స్, స్యూలా బ్రేవర్మన్.. తదితరులు ఉన్నారు.