Intel job cuts to affect 20% workforce: పర్సనల్ కంప్యూటర్ల(PC) మార్కెట్ దారుణంగా పడిపోయింది. అది ఆ మార్కెట్ లో ఆధిపత్యం వహిస్తున్న తైవాన్ కు చెందిన ఇంటెల్ సంస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. దాంతో, నష్టాలను తగ్గించుకునే దిశగా సంస్థ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తోంది.
నష్టాలను తగ్గించుకోవడం, నిర్వహణ ఖర్చులను అదుపు చేయడం లక్ష్యంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని ఇంటెల్ నిర్ణయించుకుందని ‘బ్లూమ్ బర్గ్ న్యూస్’ వెల్లడించింది. ‘బ్లూమ్ బర్గ్ న్యూస్’ కథనం ప్రకారం.. ముఖ్యంగా సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లోని ఉద్యోగులను పెద్ద ఎత్తున్నే తొలగించాలని ఇంటెల్ భావిస్తోంది. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లోని 20 శాతం ఉద్యోగులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపనుంది. అయితే, ఈ విషయంపై ఇంటెల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రజలు పీసీలపై లాక్ డౌన్ సమయంలో పెట్టినట్లుగా ఖర్చు పెట్టడం లేదు. ద్రవ్యోల్బణం ఊహించనంతగా పెరుగుతుండడం, ఆఫీసులు, పాఠశాలలు పున: ప్రారంభమవుతుండడంతో ఖర్చులను తగ్గించుకునే దిశగా ఆలోచిస్తున్నారు. కోవిడ్ కారణంగా చైనా మార్కెట్ దారుణంగా పడిపోయింది. మరోవైపు, ఉక్రెయిన్ సంక్షోభం అన్ని రంగాలను కుదేలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పీసీల మార్కెట్ మళ్లీ పుంజుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఇంటెల్ సంస్థ తమ సేల్స్, ప్రాఫిట్ టార్గెట్లను సవరించింది.