Instagram ads in feed: ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్‌లో ఇక మరిన్ని యాడ్స్
ఇన్‌స్టాగ్రామ్ ఇక తన ప్లాట్‌ఫామ్‌పై మరిన్ని యాడ్స్ చూపించనుంది.
మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ ఫీడ్‌లో మరిన్ని ప్రకటనలను తీసుకురానుంది. ఈ ఇన్‌స్టంట్ ఫోటో షేరింగ్ యాప్ యూజర్స్ వారి ఫీడ్‌లో మరిన్ని ప్రకటనలను చూసేలా వ్యవస్థను రూపొందించింది. కంపెనీ బ్లాగ్ పోస్ట్ ప్రకారం ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫార్మాట్లు, యాడ్ ప్లేస్‌మెంట్ పరిచయం చేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లోని యూజర్లతో మెరుగ్గా కనెక్ట్ అయ్యేలా అడ్వర్టైజర్‌ల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు మెటా తెలిపింది. ఎక్స్‌ప్లోర్ హోమ్‌లో అడ్వర్టయిజర్లు తమ యాడ్స్ చూపించొచ్చు. యూజర్స్ సెర్చ్ ట్యాబ్‌లోకి వచ్చినప్పుడు చూసే గ్రిడ్‌లో ఇక మరిన్ని ప్రకటనలను చూస్తారు.
ప్రొఫైల్ ఫీడ్‌లో యాడ్స్ పరీక్షించడం కూడా ప్రారంభించినట్టు మెటా పేర్కొంది. దీని అర్థం వినియోగదారు ప్రొఫైల్ ఫీడ్‌లో మునుపటి కంటే ఎక్కువ ప్రకటనలు కనిపిస్తాయి. ప్రొఫైల్ ఫీడ్‌లలో ప్రకటనలు కనిపించడం ద్వారా మానిటైజేషన్ అవకాశం లభిస్తుంది. అంటే అర్హత కలిగిన క్రియేటర్స్ తమ ప్రొఫైల్ ఫీడ్‌లలో ప్రదర్శించే ప్రకటనల నుండి అదనపు ఆదాయాన్ని పొందగలుగుతారు.
ఇది ఎంపిక చేసిన యూఎస్ క్రియేటర్స్‌తో ప్రారంభమవుతుంది. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్స్ అందరికీ అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
మెటా కూడా అర్థవంతమైన ప్రకటనలను అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగిస్తోంది. “ఒక వ్యక్తి ఒక ప్రకటనతో నిమగ్నమైనప్పుడు, ఆసక్తి ఉంటుందని భావించే అలాంటి ప్రకటనలను మెషీన్ లెర్నింగ్ సహాయంతో అందిస్తాం..’ అని బ్లాగ్ పోస్ట్ వివరించింది.
మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ 'నోట్స్' అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్ 60 అక్షరాల పరిమితిని కలిగి ఉండే షార్ట్ నోట్స్‌ని క్రియేట్ చేయడానికి యూజర్స్‌ను అనుమతిస్తుంది. వారు సృష్టించిన నోట్స్ డీఎం విభాగంలోని ఫాలోవర్స్‌కు కనిపిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగానే, నోట్స్ 24 గంటల తర్వాత అదృశ్యమవుతాయి.