Instagram parents control feature: ఇన్‌స్టాగ్రామ్‌లో పేరెంట్స్ కంట్రోల్ ఫీచర్
Instagram parents control feature: సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై చిన్నారుల వీక్షణ, వారి డేటా దుర్వినియోగం వంటి అంశాలపై భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల చట్టసభలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్ సరికొత్త ఫీచర్ తెచ్చింది.
Instagram parents control feature: ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పిల్లల వీక్షణలను నియంత్రించేలా పేరెంట్స్ కంట్రోల్ ఫీచర్ ప్రవేశపెట్టింది.
పేరెంటల్ సూపర్‌విజన్ అని పిలిచే ఈ కొత్త సెట్టింగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేరెంట్స్ తమ పిల్లల ఇంటర్నెట్ అనుభవాలను అడ్జస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. గత ఏడాది డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్లు ప్రకటించింది. మార్చిలో అమెరికాలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది ఇన్‌స్టాగ్రామ్ 16 ఏళ్లలోపు వినియోగదారుల డేటా సేకరణ, లక్ష్యిత కంటెంట్ పంపిణీపై నియంత్రణను అందుబాటులోకి తెచ్చింది.
అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో తెచ్చిన పేరెంట్స్ కంట్రోల్ ఫీచర్ కచ్చితంగా పేరెంట్స్ ఆమోదం పొందాలన్న లక్ష్యాన్ని నెరవేర్చేలా లేదు. ఇది వారి పిల్లలు ప్రతిరోజూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంత సమయం గడపవచ్చో నియంత్రించడానికి మాత్రమే తల్లిదండ్రులను అనుమతిస్తుంది. ప్రతి రోజు, వారం మధ్య విరామం వ్యవధిని కూడా తప్పనిసరి చేస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలు ఎవరిని ఫాలో చేస్తున్నారో, పిల్లలను ఎవరు ఫాలో చేస్తున్నారో చూడొచ్చు. ఇంకా పిల్లలు ఏదైనా ఖాతాను రిపోర్ట్ చేసినప్పుడు పేరెంట్స్‌కు నోటిఫికేషన్ వస్తుంది.
కేంద్రం ప్రతిపాదించిన పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు (ప్రస్తుతం ఉపసంహరించుకుంది..) ప్రకారం 18 ఏళ్ల వయసు లోపు పిల్లలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఉపయోగించడానికి అనుమతించే ముందు సోషల్ మీడియా సంస్థలు తల్లిదండ్రుల ఆమోదం పొందవలసి ఉంటుంది. అయితే ఆయా ప్లాట్‌ఫారమ్‌లు దీనిని వ్యతిరేకించాయి. ఈ దశ చాలా కఠినంగా ఉందని, ఇది మరిన్ని డేటా సేకరణలకు దారి తీస్తుందని భావించాయి.
సోషల్ మీడియా వినియోగించకుండా పిల్లలను ఆపడానికి భారతదేశంలో నియంత్రణ చాలా తక్కువగా ఉందని సైబర్ సెక్యూరిటీ నిపుణుడు, సుప్రీంకోర్టు న్యాయవాది పవన్ దుగ్గల్ అన్నారు.
‘మనకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 67బీ ఉంది. ఇది పిల్లల అశ్లీల చిత్రాలపై కఠినంగా వ్యవహరిస్తుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, 2011లోని సెక్షన్ 6 కూడా ఉంది. అయితే ఇవి పిల్లలపై డేటా షేరింగ్, ఇంటర్నెట్ సేవల ప్రభావాన్ని కవర్ చేయవు..’ అని దుగ్గల్ చెప్పారు.
సోషల్ మీడియా వినియోగదారులకు కనీసం 13 సంవత్సరాల వయస్సు ఉండాలని తప్పనిసరి చేసినప్పటికీ, మెటా సంస్థకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో సుమారు పదేళ్ల వయస్సు గల వినియోగదారుల సంఖ్య గణనీయంగా ఉంది. ఈ విషయం గత ఏడాది జూలైలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని చట్టబద్ధమైన సంస్థ అయిన నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ జరిపిన సర్వేలో తేలింది.
దేశంలోని ప్రతి 10 ఏళ్ల వయస్సు గల ఇంటర్నెట్ వినియోగదారులలో దాదాపు ఒకరికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉందని సర్వే నివేదిక వెల్లడించింది. అటువంటి తక్కువ వయస్సు గల వినియోగదారుల కోసం సోషల్ మీడియా సేవలను పరిమితం చేయాలని పిలుపునిచ్చింది.