Ticketless Travellers : టికెట్ లేకుండా రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ పండుగ సీజన్‌లో స్పెషల్ టికెట్ చెకింగ్ డ్రైవ్
Ticketless Travellers : చాలా మంది రద్దీ ఉన్న సమయంలో టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేయాలి అనుకుంటారు. పండుగ సీజన్లలో ఇలాంటివారు ఎక్కువగా కనిపిస్తారు. ఈసారి కూడా అదే ప్లాన్ చేస్తుంటే మాత్రం దొరికిపోతారు. రైల్వే ప్రత్యేకంగా డ్రైవ్ చేపడుతుంది.
పండుగ సీజన్‌లో రద్దీ ఉండటం సహజం. ఇలాంటి సమయంలో కొందరు రిజర్వేషన్ చేయించుకుని వెళ్తారు. మరికొందరేమో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తుంటారు. అయితే ఈసారి ఇలాంటి వారికోసం స్పెషల్ డ్రైవ్ చేపడుతుంది ఇండియన్ రైల్వే. టిక్కెట్ రహిత ప్రయాణాన్ని అరికట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ పండుగ సీజన్‌లో ప్రత్యేక టిక్కెట్ చెకింగ్ డ్రైవ్‌ను ప్రారంభించనుంది.
స్పెషల్ టిక్కెట్ చెకింగ్ డ్రైవ్ అక్టోబరు 1 నుంచి 15, అక్టోబర్ 25 నుంచి నవంబర్ 10 వరకు కొనసాగుతుంది. 1989 నాటి రైల్వే చట్టానికి అనుగుణంగా, ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు రైల్వే చట్టాన్ని కచ్చితంగా పాటించాలని చెబుతూ ఈ డ్రైవ్‌ను ప్రారంభించాలని మంత్రిత్వ శాఖ 17 జోన్‌ల జనరల్ మేనేజర్‌లను ఆదేశించింది.
ఇటీవలి తనిఖీల్లో ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లలోని ఏసీ కోచ్‌లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్న పోలీసు సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక అధికారి ఘజియాబాద్-కాన్పూర్ మధ్య చేసిన ఆకస్మిక చెకింగ్ గురించి వివరించాడు. అక్కడ వందలాది మంది పోలీసులు టికెట్ లేకుండా ఉన్నారు. ప్రారంభంలో వారు వాగ్వాదం పెట్టుకున్నప్పటికీ.. నిబంధనల గురించి చెప్పడంతో జరిమానాలు కట్టారు.
టిక్కెట్ లేని పోలీసులతో వ్యవహరించడం చాలా సవాలుగా ఉంటుందని ఆ అధికారి వెల్లడించారు. రైల్వే సిబ్బందిపై తప్పుడు కేసులు పెడతామని బెదిరించడం వల్ల టికెట్ తనిఖీ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇండియన్ రైల్వే టిక్కెట్ చెకింగ్ స్టాఫ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్ ఈ విషయంపై మాట్లాడారు. టికెట్ తీసుకున్న ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని గురించి ఆలోచించాలని, టికెట్ లేకుండా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
టికెట్ లేని ప్రయాణం భారతీయ రైల్వేలో నిరంతర సమస్యగా ఉంది . 2023-24 ఆర్థిక సంవత్సరంలో టిక్కెట్లు లేకుండా లేదా సరికాని టిక్కెట్లతో ప్రయాణిస్తున్న 361.045 లక్షల మంది ప్రయాణికులను అధికారులు పట్టుకున్నారు. ఫలితంగా మొత్తం కోట్లలో జరిమానా విధించారు.
టికెట్ రహిత ప్రయాణం సమస్య అయినందున, రద్దీగా ఉండే పండుగ కాలంలో ప్రయాణికుల సౌకర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది రైల్వే మంత్రిత్వ శాఖ. సీనియర్ అధికారులు డివిజనల్, జోనల్ స్థాయిలలో డ్రైవ్‌లను పర్యవేక్షిస్తారు. నవంబర్ 18, 2024 నాటికి ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సి ఉంటుంది.