IMD Rain Alert : ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండీ హెచ్చరిక
Weather Update : పలు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ మోస్తారు వానలు పడే అవకాశం ఉంది. అయితే దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
దేశంలోని పలు రాష్ట్రాల్లో జోరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాలలో వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది. భారతదేశంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాల గురించి హెచ్చరిక జారీ చేసింది. నేడు దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా వేయగా, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ అంతటా తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతాన్ని అంచనా వేసింది. పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, రాజస్థాన్‌లలో చెదురుమదురు జల్లులు ఉంటాయి. ఆగస్టు 20, 21 తేదీల్లో దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా.
విదర్భ, మరఠ్వాడా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య భారతదేశం ఈరోజు విస్తృత వర్షపాతాన్ని చూసేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతాల్లో స్థానికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.
దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలలో బీహార్, ఈశాన్య రాష్ట్రాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే, ఈరోజు ఒడిశా, జార్ఖండ్‌లలో భారీ వర్షాలు కురుస్తాయని, పశ్చిమ బెంగాల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది ఐఎండీ.
కేరళ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాయువ్య బంగాళాఖాతం మీదుగా బంగ్లాదేశ్‌ను అనుకొని ఉన్న ప్రాంతాల మీదుగా అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ చెప్పింది. దీనికి అనుబంధంగా ఉపరితల అవర్తనం విస్తరించి ఉందని పేర్కొంది. కొంకణ్ నుంచి ఆగ్నేయ ఆరేబియా సముద్రం ఉన్న ద్రోణి ఉందని వివరించింది. ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు మూడు రోజల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆగస్టు 21వ తేదీ వరకు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా.