ICICI bank fd rates: ఎఫ్‌డీ రేట్లు పెంచిన ఐసీఐసీఐ
ICICI bank fd rates 2022: ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 2 కోట్ల రూపాయల కంటే తక్కువ ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.
ICICI bank fd rates hike: ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. రూ. 2 కోట్ల కంటే తక్కువగా ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ కాల వ్యవధులకు గాను వడ్డీ రేట్లు సవరించింది.
కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు ఆగస్టు 19, 2022 నుండి అమలులోకి వస్తాయి. ఒక సంవత్సరం నుండి పదేళ్ల వరకు మెచ్యూరిటీలతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది.
బ్యాంక్ ఇప్పుడు ఏడు రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు గల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 2.75% నుండి 5.90% వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25% నుండి 6.60% వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై నాన్-సీనియర్ సిటిజన్‌లకు 6.10%, సీనియర్ సిటిజన్‌లకు 6.60% గరిష్ట వడ్డీ రేటును ఇస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు
7 రోజుల నుండి 29 రోజుల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంక్ 2.75% వడ్డీ రేటును కొనసాగిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ 30 రోజుల నుండి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.25% వడ్డీ రేటును కొనసాగిస్తుంది.
91 రోజుల నుండి 184 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 3.75% వడ్డీని, 185 రోజుల నుంచి ఏడాది కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న టర్మ్ డిపాజిట్లపై 4.65% వడ్డీని చెల్లిస్తుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఏడాది కాలం నుంచి రెండేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్ల మేర 5.35% నుండి 5.50%కి పెంచింది.
2 సంవత్సరాల 1 రోజు నుండి 3 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ 10 బేసిస్ పాయింట్లు పెంచి 5.50% నుండి 5.60శాతంగా మార్చింది.
3 సంవత్సరాల ఒక రోజు నుండి ఐదేళ్లలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 5.70% నుండి 6.10%కి పెంచింది.
5 సంవత్సరాల 1 రోజు నుండి 10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇప్పుడు 5.90% చొప్పున వడ్డీ ఇవ్వనున్నాయి.
5 సంవత్సరాల టాక్స్ సేవింగ్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు (బిపిఎస్) పెంచింది. అంటే 5.70% నుండి 6.10%కి పెంచింది.
‘ఈ సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు.. కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్లు, ఇప్పటికే ఉన్న టర్మ్ డిపాజిట్ల రెన్యువల్స్‌పై వర్తిస్తాయి’ అని ఐసీఐసీఐ బ్యాంక్ తెలిపింది.
సీనియర్ సిటిజన్లు 7 రోజుల నుండి 5 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సాధారణ రేటు కంటే 0.50% అదనపు రేటును పొందుతారు.
ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్‌డీలో 5 సంవత్సరాల 1 రోజు నుంచి 10 సంవత్సరాల వరకు ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్‌లు ప్రస్తుతం ఉన్న అర శాతం అదనపు వడ్డీ ప్రయోజనానికి తోడుగా మరో 0.20% అదనపు వడ్డీ రేటును పొందుతారు.
వృద్ధులకు ఈ ప్రత్యేక వడ్డీ రేటు స్వల్ప కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అక్టోబర్ 7, 2022 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
‘ప్రస్తుత అనిశ్చితి, అత్యంత అస్థిరంగా మార్కెట్లు కొనసాగుతున్నందున మీరు ఎల్లప్పుడూ ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై హామీతో కూడిన రాబడి అందుకోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ సురక్షితమైన ఎఫ్‌డీలలో ఒకటి. అంతేకాకుండా ట్రిపుల్ ఏ రేటింగ్ ఉంది..’ అని ఐసీఐసీఐ బ్యాంక్ పేర్కొంది.