Bank of baroda tiranga deposit: అధిక వడ్డీతో బ్యాంక్ ఆఫ్ బరోడా తిరంగా డిపాజిట్
Bank of baroda tiranga deposit rates: బ్యాంక్ ఆఫ్ బరోడా ‘బరోడా తిరంగా’ డిపాజిట్లను ప్రారంభించింది. వీటిపై అధిక వడ్డీ ఆఫర్ చేస్తోంది.
Bank of baroda tiranga deposit rates: బ్యాంక్ ఆఫ్ బరోడా (బ్యాంక్) ఈ రోజు బరోడా తిరంగా డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది అధిక వడ్డీ రేట్లను అందించే ప్రత్యేక టర్మ్ డిపాజిట్ స్కీమ్. బరోడా తిరంగా డిపాజిట్‌లు రెండు కాల వ్యవధుల్లో లభిస్తాయి.
444 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై 5.75% వార్షిక వడ్డీ రేట్లు వర్తిస్తాయి. అలాగే బరోడా తిరంగా డిపాజిట్ 555 రోజులకు 6.00% వార్షిక వడ్డీ అందిస్తుంది. బరోడా తిరంగా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ ఆగస్టు 16న 2022 ప్రారంభమై డిసెంబర్ 31 వరకు తెరిచి ఉంటుంది. రూ. 2 కోట్ల లోపు రిటైల్ డిపాజిట్లపై వర్తిస్తుంది.
సీనియర్ సిటిజన్‌లు 0.50% మేర అదనపు వడ్డీ రేటును పొందుతారు. అయితే గడువు లోపు ఉపసంహరించుకునే అవకాశం లేని డిపాజిట్‌లకు 0.15% మేర వడ్డీ అదనంగా లభిస్తుంది.
‘భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వినియోగదారులు మరో ఉత్సవాన్ని జరుపుకోవడానికి మేం మరో కారణం అందిస్తున్నాం. బరోడా తిరంగ డిపాజిట్ స్కీమ్ అధిక వడ్డీ రేటును అందిస్తుంది. భారతదేశంలోని ప్రముఖ, అత్యంత విశ్వసనీయ బ్యాంక్‌లలో ఒకటైన బరోడా ద్వారా రెండు కాల వ్యవధులతో కూడిన ఫిక్స్‌డ్ డిపాజిట్ సౌలభ్యాన్ని అందిస్తున్నాం..’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ కె. ఖురానా అన్నారు.
దేశం 76వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌గా జరుపుకుంటున్న నేపథ్యంలో ఎస్‌బీఐ కూడా ‘ఉత్సవ్ డిపాజిట్’ అని పిలిచే ప్రత్యేక టర్మ్ డిపాజిట్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ అధిక వడ్డీ రేట్లు కలిగి ఉంటుంది. పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
ఉత్సవ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో భాగంగా ఎస్‌బీఐ 1000 రోజుల కాలవ్యవధితో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సంవత్సరానికి 6.10% వడ్డీ రేటును అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు సాధారణ రేటు కంటే 0.50% అదనపు వడ్డీ రేటును పొందేందుకు అర్హులు. ఈ రేట్లు 15 ఆగస్టు 2022 నుండి అమలులోకి వస్తాయి. పథకం 75 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది.