Free bus scheme : మహిళలకు ‘ఉచిత బస్సు ప్రయాణం’ పథకాన్ని ప్రభుత్వం తొలగిస్తోందా? సీఎం సమాధానం ఇదే..
Free bus scheme for women : కర్ణాటకలో మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రభుత్వం తొలగిస్తోందని ఇటీవలి కాలంలో వార్తలు వచ్చాయి. దీనిపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్పందించారు.
2023లో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ పథకాన్ని ప్రభుత్వం తొలగిస్తున్నట్టు లేదా మార్పులు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా, డిప్యూటీ సీఎం శివకుమార్ చేసిన వ్యాఖ్యలతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. వీటికి చెక్ పెడుతూ, ఈ విషయంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తాజాగా స్పందించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని తొలగిస్తున్నారా?
కర్ణాటకలో నివసిస్తున్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించే 'శక్తి' పథకాన్ని పునఃసమీక్షించే ప్రతిపాదన ప్రభుత్వం ముందు లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం చెప్పారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ పథకాన్ని పునఃసమీక్షించాలని సూచించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.
ప్రభుత్వం ముందు అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని, కొందరు మహిళలు చెబుతున్నది మాత్రమే ఆయన (శివకుమార్) చెప్పారన్నారని సిద్ధరామయ్య అన్నారు. “నాకు తెలియదు, నేను అక్కడ లేను. ఈ విషయంపై మాట్లాడతాను,” అని డిప్యూటీ సీఎం ప్రకటనపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
దీనిపై సీఎం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వ స్థాయిలో పునఃసమీక్షించే పరిస్థితి లేదన్నారు. అలాంటి ఉద్దేశం ఏమీ లేదని, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదన్నారు.
ఇలా మొదలైంది..
పలువురు మహిళలు ట్వీట్లు చేసి రైడ్ కోసం డబ్బులు ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ తనను సంప్రదించారని, ఈ విషయంపై అందరం కూర్చొని చర్చిద్దామని శివకుమార్ బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు.
“వారు ఒక వర్గం (మహిళలు), వారు 5-10 శాతం ఉండవచ్చు. చూద్దాం, కొందరు నిజాయితీగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. రామలింగారెడ్డి (రవాణా శాఖ మంత్రి), నేను - ఏం చేయాలో ప్రభుత్వంలో చర్చిస్తాం,” అని శివకుమార్ వెల్లడించారు.
ఈ విషయం సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రభుత్వం తొలగిస్తోందని వార్తలు వెల్లువెత్తాయి.
గురువారం ఈ వ్యవహారంపై డీకే శివకుమార్ సైతం స్పందించారు. శక్తితో సహా ఐదు హామీ పథకాల్లో దేనినీ ఉపసంహరించుకోవడం లేదా పునఃసమీక్షించడం లేదని, మీడియా- ప్రతిపక్షాలు తన ప్రకటనను వక్రీకరించాయని శివకుమార్ వెల్లడించారు.
“ఐదు పథకాల్లో దేనినీ ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. ఉచిత బస్సు సర్వీసులు వద్దని ఎవరైనా చెబితే నేను మిమ్మల్ని బలవంతం చేయగలనా అని డిప్యూటీ సీఎం ప్రశ్నించారు. గ్యాస్ ఇష్యూ (ఎల్పీజీ)లో ప్రధాని స్వచ్ఛందంగా సరెండర్ (సబ్సిడీ) ఆప్షన్ ఇచ్చినట్లుగానే, మనం కూడా అదే తరహాలో ఆలోచిస్తామని చెప్పాను. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, డిప్యూటీ సీఎంగా ఐదు హామీలు ఈ ప్రభుత్వ పదవీకాలంలో కొనసాగుతాయని, ఆ తర్వాత మరో ఐదేళ్లు మళ్లీ అధికారంలోకి వస్తాము,” అని స్పష్టం చేశారు.
గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఐదు హామీ పథకాల్లో శక్తి ఒకటి.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 2023 జూన్ 11న శక్తి పథకాన్ని ప్రారంభించారు. 2024 అక్టోబర్ 18 నాటికి 311.07 కోట్ల ఉచిత ప్రయాణాల కోసం శక్తి పథకానికి ప్రభుత్వం రూ.7,507.35 కోట్లు ఖర్చు చేసింది.
సంబంధిత కథనం