APSRTC : కార్తీకమాసంలో ఆర్టీసీ స్పెషల్ బస్సులు.. భక్తుల కోసం 4 ప్రత్యేక ప్యాకేజీలు
APSRTC : కార్తీకమాసంలో భక్తులు ఎక్కువగా శైవ క్షేత్రాలకు వెళ్తుంటారు. దీంతో ఆయా రూట్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. రద్దీకి తగ్గట్టు ఆర్టీసి ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటిస్తోంది. ఆర్టీసీ కార్తీకమాసం సందర్భంగా భక్తుల కోసం 5 స్పెషల్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కార్తీక మాసంలో భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకొని నెల్లూరు, కడప, కర్నూలు నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయించింది. నెల్లూరు నుంచి ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చారు. కర్నూలు నుంచి పంచ శైవక్షేత్ర దర్శిని యాత్ర, కడప నుంచి శైవ క్షేత్రాల దర్శిన యాత్ర, పౌర్ణమి సందర్భంగా అరుణాచలం గిరి ప్రదక్షిణకు ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశారు.
1.శ్రీశైలం యాత్ర ప్యాకేజీ..
కార్తీక మాసం సందర్భంగా కావలి నుంచి శ్రీశైలం ఆలయానికి వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. ఈ బస్ నవంబర్ 3వ తేదీన ఆదివారం ఉదయం 10.30 గంటలకు కావలిలో బయలుదేరి సాయంత్రం శ్రీశైలం చేరుతుంది. సోమవారం తెల్లవారుజామున శ్రీభ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దర్శన అనంతరం 4వ తేదీన శ్రీశైలంలో బయలుదేరి కావలికి చేరుకుంటుంది. టిక్కెట్టు ధర ఒక్కొక్కరికి రూ.425గా నిర్ణయించారు. రద్దీ దృష్ట్యా భక్తులు తమ సీట్లను ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.
2.నెల్లూరు నుంచి..
కార్తీకమాసంలో ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు నెల్లూరు మెయిన్ బస్టాండ్ నుండి బస్సులు బయలుదేరతాయి. శైవ క్షేత్రాలైన పంచారామాలు అమరావతి (అమరేశ్వరుడు), భీమవరం (సోమేశ్వరుడు), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు), ద్రాక్షారామం (భీమేశ్వరుడు), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు) పుణ్యక్షేత్రాలను కార్తిక సోమవారం నాడు దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక సర్వీసులు ప్రతి ఆదివారం అంటే.. నవంబర్ 3, 10,17, 24 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్టు ధర ఒక్కొక్కరికి సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ.2,500గా నిర్ణయించారు. రిజర్వేషన్ టికెట్లను నెల్లూరు బస్టాండ్, ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వద్ద ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవచ్చు.
3.కర్నూలు నుంచి..
కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్ధం ఆర్టీసీ స్పెషల్ టూర్ ప్యాకేజీ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు.. కర్నూలు డిపో మేనేజర్ సర్దార్ హుసేన్ తెలిపారు. పంచ శైవక్షేత్రదర్శిని పేరుతో యాగంటి, మహానంది, ఓంకారం, భోగేశ్వరం, కాల్వబుగ్గ క్షేత్రాలను దర్శించుకునేలా.. బస్సు సర్వీసును ఏర్పాటు చేశారు. ఈ యాత్ర ప్యాకేజీ పెద్దలకు రూ.650, పిల్లలకు రూ.400 టిక్కెట్టు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 6 గంటలకు బస్సు కర్నూలు నుంచి బయలుదేరుకుంది. ఆయా ఆలయాలను సందర్శన అనంతరం తిరిగి రాత్రి కర్నూలుకు చేరుకుంటుంది. ఈ ప్యాకేజీ టూర్ సర్వీసులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం ఉంది.
4.కడప నుంచి..
కార్తీక మాసం సందర్బంగా కడప నుంచి శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. నవంబర్ 4,11,18, 25 తేదీలు (సోమవారాలు)ల్లో ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. పౌర్ణమి సందర్భంగా నవంబర్ 15న అరుణాచలానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. లంకమల, భైరవకోట, నారాయణస్వామి మఠం, సిద్ధేశ్వరమఠం, బి.మఠం పెంచలకోన, శ్రీకాళహస్తి, మహానంది, ఓంకారం, శ్రీశైలం, నాయినాప్పలకోననం, అగస్తీశ్వరకోన, పొలతల, నిత్యపూజ కోన, అల్లాడుపల్లె దేవళాలు, పుష్పగిరి, కాణిపాకం, కన్యతీర్థం, భానుకోట తదితర శైవక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ అధికారి గోపాల్‌రెడ్డి తెలిపారు. నవంబర్ 3న బెంగళూరుకు 20 ప్రత్యేక బస్సులను నడుతున్నట్లు తెలిపారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)