Case against DK Shivakumar: ‘డీకే శివకుమార్ పై క్రిమినల్ కేసు నమోదు చేయండి’: పోలీసులకు బెంగళూరు కోర్టు ఆదేశం
Case against DK Shivakumar: కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు, కాంగ్రెస్ పార్టీ కర్నాటక ఐటీ సెల్ చీఫ్ బీఆర్ నాయుడు పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు గురువారం పోలీసులను ఆదేశించింది.
బీజేపీ నేతలు నిరసన చేస్తున్న ఫొటోలను మార్ఫింగ్ చేసిన ఆరోపణలపై కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D K Shivakumar), కాంగ్రెస్ రాష్ట్ర ఐటీ సెల్ చీఫ్ బీఆర్ నాయుడుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు గురువారం నగర పోలీసులను ఆదేశించింది. 1992 బాబ్రీ మసీదు కూల్చివేత ఉద్యమంలో పాల్గొన్న కరసేవకుడు శ్రీకాంత్ పూజారిని ఇటీవల అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు నిరసన ప్రదర్శన చేస్తున్న ఫొటోను మార్ఫింగ్ చేసి, ఆ మార్ఫ్డ్ ఫొటోను ప్రచారం చేసినట్లు డీకే శివకుమార్, నాయుడులపై బీజేపీ నేతలు ఆరోపణలు చేశారు.
ప్లకార్డులను మార్ఫింగ్ చేసి..
'నేను కూడా కరసేవకుడినే, నన్ను కూడా అరెస్టు చేయండి' అనే ప్లకార్డులతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆ రోజు నిరసనలో పాల్గొన్నారు. అయితే, ఆ ప్లకార్డులపై ఉన్న రాతను మార్ఫింగ్ చేసి కుంభకోణాలు, ఇతర అవకతవకలను అంగీకరించే వాంగ్మూలంలా మార్చి కాంగ్రెస్ ఐటీ సెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ను కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి షేర్ చేశారు. దాంతో, ఈ తమ ఫొటోలను మార్ఫింగ్ చేసి కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా తప్పుడు పత్రాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ యోగేంద్ర హోడఘట్ట ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు. దాంతో, కేసును విచారించిన ప్రత్యేక కోర్టు సీఆర్పీసీ సెక్షన్ 156(3) కింద డీకే శివకుమార్, బీఆర్ నాయుడులపై కేసు నమోదు చేయాలని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ను ఆదేశించింది.