ED summons Kejriwal: కేజ్రీవాల్ కు ఏడో సారి ఈడీ సమన్లు; ఈ సారైనా ఖాతరు చేస్తారా..?-enforcement directorate sends seventh summons to arvind kejriwal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ed Summons Kejriwal: కేజ్రీవాల్ కు ఏడో సారి ఈడీ సమన్లు; ఈ సారైనా ఖాతరు చేస్తారా..?

ED summons Kejriwal: కేజ్రీవాల్ కు ఏడో సారి ఈడీ సమన్లు; ఈ సారైనా ఖాతరు చేస్తారా..?

HT Telugu Desk HT Telugu
Feb 22, 2024 11:42 AM IST

Delhi excise policy case: ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లను జారీ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు జారీ చేయడం ఇది ఏడో సారి. ఈడీ పంపించిన గత ఆరు సమన్లను అరవింద్ కేజ్రీవాల్ పట్టించుకోలేదు.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (ANI)

ED summons Kejriwal: లిక్కర్ స్కామ్ (liquor scam) గా పాపులర్ అయిన ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఏడో సారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 26 న తమ ముందు హాజరుకావాలని ఆ సమన్లలో ఈడీ కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఈడీ ఇప్పటివరకు పంపిన ఆరు సమన్లను అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పట్టించుకోలేదు. ఆ సమన్లు చట్టవిరుద్ధమని, అందువల్లనే కేజ్రీవాల్ విచారణకు హాజరు కావడం లేదని ఆప్ వాదిస్తోంది. ఈడీ కూడా కేజ్రీవాల్ ను పదేపదే హాజరుకావాల్సిందిగా కోరకుండా కోర్టు నిర్ణయం కోసం వేచి చూడాలని ఆప్ వ్యాఖ్యానించింది.

కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూపు

‘‘ఈడీ నుంచి వచ్చిన సమన్లన్నింటికీ మేం సమాధానం ఇచ్చాం. చివరగా ఫిబ్రవరి 17 న సీఎం అరవింద్ కేజ్రీవాల్ వర్చువల్ గా కోర్టులోనే ఉన్నారు. తదుపరి విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది. మేము చట్టాన్ని పాటించే వ్యక్తులం. కోర్టు ఏం చెబితే అది పాటిస్తాం. ఈ కేసులో కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఈడీ వేచిచూడాల్సింది. కోర్టు తీర్పు రాకముందే, సమన్లు పంపడం కోర్టు ధిక్కారమే’’ అని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయకుండా ఉండేందుకు ఆయనను అరెస్టు చేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ యోచిస్తోందని ఆప్ ఆరోపిస్తోంది.

ఢిల్లీ కోర్టుకు ఈడీ

తాము పంపిస్తున్న సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోకపోవడంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. పీఎంఎల్ఏ సెక్షన్ 50కి అనుగుణంగా తమ ముందు కేజ్రీవాల్ హాజరు కానందుకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 190 (1)(ఎ), 200, ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 174, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 63(4) కింద ఈడీ కేసు నమోదు చేసింది. దీనిపై ఫిబ్రవరి 17న రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

బీజేపీ విమర్శలు

ఈడీ సమన్లు దాటవేయడంపై కాంగ్రెస్, బీజేపీలు కేజ్రీవాల్ పై మండిపడ్డాయి. ‘‘ఈడీ ఉద్దేశం ఏమైనప్పటికీ, మనం ఎల్లప్పుడూ న్యాయ ప్రక్రియలో భాగం కావాలి. చట్టబద్ధ సంస్థల ఆదేశాలను పాటించాలి. మీరు (అరవింద్ కేజ్రీవాల్) ఈడీ విచారణకు వెళ్లి మీ వాదనను వినిపించాలని నేను కోరుకుంటున్నాను’’ అని కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్ సూచించారు. కేజ్రీవాల్ ను పరారీలో ఉన్న నిందితుడిగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అభివర్ణించారు. ‘‘ఆయన 'భాగోడా' నంబర్ వన్ అయ్యారు. లిక్కర్ స్కామ్ సూత్రధారిగా ఆయన దాచిపెట్టిన విషయాలు చాలా ఉన్నాయి. ఈడీ జారీ చేసిన సమన్లు సరైనవేనని, మీరు వెళ్లి ఈ సమన్లకు హాజరు కావాలని కోర్టు చెబుతోంది. అయినా మీరు సమన్లను చట్టవిరుద్ధం అంటున్నారు' అని పూనావాలా విమర్శించారు. కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న ఆరోపణలపైననే ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ నెలల తరబడి జైలులో ఉన్నారు.

IPL_Entry_Point