Japan Earthquake: దక్షిణ జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం; సునామీ హెచ్చరిక జారీ-earthquake of magnitude 7 1 hits southern japan tsunami warning issued ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Japan Earthquake: దక్షిణ జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం; సునామీ హెచ్చరిక జారీ

Japan Earthquake: దక్షిణ జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం; సునామీ హెచ్చరిక జారీ

HT Telugu Desk HT Telugu

జపాన్ ను గురువారం భారీ భూకంపం వణికించింది. జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపం క్యూషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైంది. భూకంపం కారణంగా సునామీ ఏర్పడే ముప్పు ఉందని జపాన్ హెచ్చరికలు జారీ చేసింది.

దక్షిణ జపాన్ ను కుదిపేసిన భారీ భూకంపం

Japan Earthquake: దక్షిణ జపాన్ లోని క్యూషు ద్వీపంలో గురువారం 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 6.9 గా నమోదైనట్లు జపాన్ పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ ఎన్ హెచ్ కే తెలిపింది. ప్రధాన భూకంపంతో పాటు తక్కువ తీవ్రతతో పలు మార్లు భూమి కంపించిందని, దాంతో సునామీ వచ్చే ముప్పు ఉందని జపాన్ హెచ్చరించింది.

30 కిలోమీటర్ల లోతులో..

జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపం క్యూషు తూర్పు తీరంలో సుమారు 30 కిలోమీటర్ల లోతులో 7.1 తీవ్రతతో భూకంపం (Earthquake) కేంద్రీకృతమై ఉందని జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. జపాన్ లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్న నేపథ్యంలో భూకంపాలకు ప్రతిస్పందనగా జపాన్ (japan) ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. భూకంపాలను తట్టుకునే మౌలిక వసతులను జాపాన్ ఏర్పాటు చేసినందున, ఈ భూకంపంతో పెద్దగా నష్టం వాటిల్లే సూచనలు కనిపించడం లేదని ఏజెన్సీ తెలిపింది. ప్రపంచంలోనే అత్యంత తరచుగా భూకంపాలు సంభవించే దేశాలలో ఒకటైన జపాన్ అత్యంత శక్తివంతమైన భూకంపాలను కూడా తట్టుకునేలా కట్టుదిట్టమైన నిర్మాణ ప్రమాణాలను కలిగి ఉంది.

12.6 కోట్ల జనాభా

జపాన్ లో సుమారు 12.5 కోట్ల మంది జనాభా ఉంటారు. ఈ ద్వీప సమూహ దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 1,500 వరకు భూకంపాలు చోటు చేసుకుంటాయి. అయితే, వాటిలో ఎక్కువ భాగం తేలికపాటివి, అయినప్పటికీ అవి కలిగించే నష్టం.. ఆ భూకంపం కేంద్రీకృతమైన స్థానం, ఆ భూకంపం (Earth quake) తీవ్రత.. మొదలైన వాటిని బట్టి మారుతుంది.

న్యూ ఈయర్ రోజు విధ్వంసం

2024 జనవరి 1వ తేదీన జపాన్ లో సంభవించిన భారీ భూకంపం కారణంగా కనీసం 260 మంది మరణించారు. ఈ అత్యంత తీవ్రమైన భూకంపం కారణంగా పలు భవనాలు నేలమట్టమయ్యాయి. పలు అగ్నిప్రమాదాలకు కారణమైంది. కొత్త సంవత్సరాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్న దేశ వాసులను విషాధంలో ముంచెత్తింది. 2011 మార్చిలో జపాన్ ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం సునామీకి దారితీసి 18,500 మందిని బలితీసుకుంది.

అణు రియాక్టర్ల నిలిపివేత

2011 భూకంప విపత్తు వల్ల ఫుకుషిమా అణు కర్మాగారంలో మూడు రియాక్టర్లను కూడా నిలిపివేశారు. ఇది జపాన్ కు యుద్ధానంతరం చోటు చేసుకున్న అత్యంత ఘోరమైన విపత్తుగా భావించవచ్చు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.