Crime news : షాకింగ్.. మద్యం మత్తులో పోలీసులపై పెట్రోల్ పోశాడు- నిప్పంటించేందుకు..
మహారాష్ట్ర పూణెలో షాకింగ్ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా.. ఇద్దరు పోలీసులపై పెట్రోల్ పోశాడు ఓ వ్యక్తి. చివరికి..
పూణెలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి, ఏకంగా పోలీసులపైనే పెట్రోల్ పోసి, నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. కానీ అతను చేసిన ఓ పనితో పోలీసులు తృటిలో ప్రాణాలను కాపాడుకున్నారు.
ఇదీ జరిగింది..
పూణె పరస్ఖానా ట్రాఫిక్ డివిజన్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న సంజయ్ ఫకీర సాల్వేని పోలీసులు అడ్డుకున్నారు. అతనికి ఫైన్ వేసేందుకు చలాన్ మెషీన్ బయటకు తీశారు. తనని ఆపడమే కాదు ఫైన్ వేస్తున్నారని తెలిసి సాల్వేకి కోపం వచ్చింది. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కొంతసేపటికి పెట్రోల్‌తో తిరిగి వచ్చాడు. అక్కడే ఉన్న అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ శైలజ జన్కర్తో పాటు మరో కానిస్టేబుల్‌పై పెట్రోల్ పోశాడు. వారు ఒక్క క్షణం షాక్‌కు గురయ్యారు.
ఇంతలో, పెట్రోల్ పోసిన అనంతరం లైటర్ బయటకు తీసి, దానిని వెలిగించేందుకు ప్రయత్నించాడు నిందితుడు. కానీ మద్యం మత్తులో దానిని రివర్స్ డైరెక్షన్లో పట్టుకుని వెలిగించేందుకు ప్రయత్నించాడు. అది సరైన సమయంలో వెలగలేదు. ఘటన నుంచి ఆ ఇద్దరు పోలీసులతో పాటు పక్కనే ఉన్న మరింకొందరు కానిస్టేబుళ్లు తేరుకుని, సాల్వేని పట్టుకున్నారు. నేల మీద పడేసి, అతడి నుంచి లైటర్ని తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.
ఘటనాస్థలంలో ఉన్న సమీర్ ప్రకాశ్ సావంత్ అనే కానిస్టేబుల్ నిందితుడిపై కేసు వేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్టు, దర్యాప్తు చేపట్టినట్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సందీప్ సింగ్ గిల్ తెలిపారు.
నిందితుడిపై నూతన క్రిమినల్ చట్టాల్లోని సెక్షన్ 109, 132 కింద కేసు నమోదైంది.
ఘటనతో బాధితురాలు ఏఎస్పీ శైలజ షాక్‌కు గురయ్యారు.
"నా మీద పెట్రోల్ పేసి, నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. షాక్‌లో ఒక గంట పాటు ఏం మాట్లాడలేకపోయాను. ఘటన నుంచి తేరుకునేందుకు చాలా సమయం పడుతుంది," అని శైలజ తెలిపారు.
ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. మద్యం మత్తులో పోలీసులపైనే పెట్రోల్ పోయడం ఏంటని షాక్‌కు గురవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
టీచర్‌ను క్లాస్‌రూమ్‌లోనే కత్తితో పొడిచి చంపిన విద్యార్థి
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక మూల ఏదో క్రైమ్ జరుగుతూనే ఉంటోంది. క్లాస్‌రూమ్‌లో టీచర్ని ఓ విద్యార్థి కత్తితో పొడిచి చంపాడు.
అసోంలోని శివసాగర్ లోని కోచింగ్ సెంటర్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు ఏదో విషయంలో మందలించాడు. దాంతో, ఆ టీచర్ పై కోపం పెంచుకున్న ఆ విద్యార్థి ఆ టీచర్ ను తరగతి గదిలోనే కత్తితో పొడిచి చంపాడు. మైనర్ అయిన ఆ విద్యార్థిని శివసాగర్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఆ ఉపాధ్యాయుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం