CNG Motorcycle : ఇక పెట్రోల్ అక్కర్లేదు గురువు గారు.. మీ పాత స్కూటర్‌ను కూడా సీఎన్‌జీగా మార్చుకోవచ్చు!
CNG Motorcyle : ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ మోటార్ సైకిల్ విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. జూలై 5న బజాజ్ కంపెనీ దీన్ని లాంచ్ చేయనుంది. సీఎన్‌జీ సిలిండర్ సీటు కింద ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ సీఎన్‌జీ బైక్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం..
ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ మోటార్ సైకిల్ విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. బజాజ్ కంపెనీ తొలిసారిగా సీఎన్‌జీ బైక్‌ను జూలై 5న లాంచ్ చేయనుంది. పరిశ్రమలో అత్యధిక మైలేజ్ ఇచ్చే మోటార్ సైకిల్ గా కూడా ఇది నిలుస్తుంది. దీని ప్రారంభ ధర సుమారు 80 వేల రూపాయలు. అయితే మీ వద్ద ఇప్పటికే ద్విచక్ర వాహనం ఉండి.. మీరు దానిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఈ బైక్ తెచ్చుకుంటే ఇక మీకు పెట్రోల్ సమస్య ఉండదు. మైలేజ్ పరంగానే ఖరీదైన డీల్ కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
అయితే సీఎన్‌జీ బైక్ వాడాలి అనుకునేవారికి మరో ఆప్షన్ కూడా ఉందండోయ్.. కావాలనుకుంటే మీ పాత ద్విచక్రవాహనంలో సీఎఎన్‌జీ కిట్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పనిని మార్కెట్లో చాలా కంపెనీలు చేస్తున్నాయి.
పెట్రోల్ సమస్య ఉండదు
ద్విచక్ర వాహనంలో సీఎన్‌జీ కిట్‌ను అమర్చడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు ఖరీదైన పెట్రోల్ నుండి ఉపశమనం పొందుతారు. పెట్రోల్ కంటే సీఎన్జీ ధరలు తక్కువ. అలాగే ఇవి ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. అంటే మీ బండి తక్కువ ఖర్చుతో ఎక్కువగా నడుస్తుంది. ఉదాహరణకు ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలో రూ.75గా ఉంది. లీటర్ పెట్రోల్ ధర రూ.95 ఉండగా.. అంటే రెండింటి మధ్య 20 రూపాయల వ్యత్యాసం ఉంది. అంతేకాదు సీఎన్‌జీ ద్వారా మీకు మైలేజీ కూడా కలిసి వస్తుంది.
తక్కువ ఖర్చుతో
ఇప్పటి వరకూ ఏ కంపెనీ కూడా ఫ్యాక్టరీలో అమర్చిన సీఎన్‌జీ కిట్‌తో ద్విచక్ర వాహనాన్ని లాంచ్ చేయలేదు. మార్కెట్లో ఏ ద్విచక్రవాహనం సీఎన్‌జీతో నడుస్తున్నా అవన్నీ థర్డ్ పార్టీ ద్వారా ఇన్స్టాల్ చేసినవే. లొవాటో అనే సంస్థ ఢిల్లీలో సీఎన్‌జీ కిట్లను ఏర్పాటు చేసే పని చేస్తోంది. ఈ కిట్ ఏర్పాటుకు సుమారు రూ.15 వేలు ఖర్చవుతుంది. మీరు ఈ ఖర్చును 1 సంవత్సరం కంటే తక్కువ సమయంలో రికవరీ చేస్తారని కంపెనీ పేర్కొంది. ఎందుకు అంటే పెట్రోల్ మీకు ఆదా అవుతుంది. అయితే ఈ కిట్ ను ఇప్పటివరకు స్కూటీలలో మాత్రమే అమర్చారు. మోటార్ సైకిల్ లో పెట్టడానికి స్థలం లేదు. స్కూటర్ లో ఈ కిట్ ను బూట్ స్పేస్ దగ్గర ఫిక్స్ చేశారు.
రెండింటీతోనూ నడుస్తోంది
ఈ స్కూటర్ పెట్రోల్, సీఎన్‌జీ రెండింటితో నడుస్తుంది. స్కూటర్లో సీఎన్‌జీ కిట్‌ను ఇన్స్టాల్ చేయడానికి సుమారు 4 గంటలు పడుతుంది. ప్రత్యేకత ఏమిటంటే ఈ స్కూటర్ ను సీఎన్‌జీతోపాటుగా పెట్రోల్‌తో కూడా నడపవచ్చు. దీని కోసం కంపెనీ ఒక స్విచ్‌ను ఉంచుతుంది. తద్వారా మీరు సీఎన్‌జీ నుండి పెట్రోల్ లేదా పెట్రోల్ నుండి సీఎన్‌జీ మోడ్‌కు మారవచ్చు. కంపెనీ ముందు భాగంలో రెండు సిలిండర్లను ఉంచుతుంది, వాటిని కవర్ తో కవర్ చేస్తారు. అదే సమయంలో ఇది పనిచేసే యంత్రం సీటు దిగువ భాగంలో సరిపోతుంది. అంటే ఈ స్కూటర్ సీఎన్‌జీ, పెట్రోల్ రెండింటితో నడుస్తుంది.
త్వరలో బజాజ్ కంపెనీ బైక్
ఇక బజాజ్ కంపెనీ మెుట్టమెుదటిసారిగా సీఎన్‌జీ బైక్‌ను తీసుకొస్తుంది. జూలై 5న కార్యక్రమం ఉండనుంది. ఈ బైక్ ప్రస్తుతం ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. మల్టీ స్పోక్ అల్లోయ్ వీల్స్, లాంగ్ సింగిల్ సీట్, డిస్క్ మరియు డ్రమ్ బ్రేక్స్‌తో సింపుల్‌గా ఈ బైక్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. బజాజ్ తీసుకొస్తున్న సీఎన్‌జీ మోటర్ సైకిల్ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.