Crime news: తిట్టినందుకు టీచర్ ను క్లాస్ రూమ్ లోనే కత్తితో పొడిచి చంపిన విద్యార్థి
Assam Crime news: తోటి విద్యార్థుల ముందు తనను తిట్టాడన్న కోపంతో ఉపాధ్యాయుడిని కత్తితో ఒక విద్యార్థి పొడిచి చంపేశాడు. ఈ దారుణ ఘటన అస్సాంలో జరిగింది. 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Assam Crime news: అసోంలోని శివసాగర్ లోని కోచింగ్ సెంటర్ లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు ఏదో విషయంలో మందలించాడు. దాంతో, ఆ టీచర్ పై కోపం పెంచుకున్న ఆ విద్యార్థి ఆ టీచర్ ను తరగతి గదిలోనే కత్తితో పొడిచి చంపాడు. మైనర్ అయిన ఆ విద్యార్థిని శివసాగర్ లోని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అసలేం జరిగిందంటే..
అస్సాంలోని శివసాగర్ లో ఉన్న ఒక కోచింగ్ సెంటర్ లో ఈ ఘటన జరిగింది. ఈ దారుణం జరిగిన సమయంలో ఇతర ఉపాధ్యాయులెవరూ లేరు. ఇతర విద్యార్థులు తెలిపిన సమాచారం ప్రకారం.. 11వ తరగతి చదువుతున్న విద్యార్థి ని కోచింగ్ సెంటర్ లోని టీచర్ ఏదో విషయంపై మందలించాడు. దాంతో, క్లాస్ రూమ్ లో నుంచి వెళ్లి పోయిన ఆ విద్యార్థి మళ్లీ కొన్ని గంటల తరువాత తిరిగి వచ్చాడు. తరగతి గదిలో ఉన్న టీచర్ ను తనతో పాటు తెచ్చుకున్న కత్తితో విచక్షణా రహితంగా పొడిచి, కత్తిని అక్కడే పడేసి పారిపోయాడు.
ఆసుపత్రికి తరలింపు
ఆ ఉపాధ్యాయుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. ‘‘కత్తిపోట్లకు గురైనట్లు సమాచారం అందడంతో కోచింగ్ సెంటర్ కు చేరుకున్నాం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ విద్యార్థి తన టీచర్ ను కత్తితో పొడిచాడు. తరగతి గదిలో చాలా రక్తం ఉంది. కత్తి కూడా అక్కడే దొరికింది’’ అని పోలీసులు తెలిపారు. ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదని, సీసీటీవీ ఫుటేజీలను సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు.