India students in Canada : కెనడాలో చదువులు వద్దంటున్న భారత విద్యార్థులు.. కారణం అదేనా?
India students in Canada : భారతీయ విద్యార్థులకు కెనడా వెళ్లే ఆసక్తి తగ్గిపోతోంది! ఈ ఏడాది రెండో భాగంలో.. అప్లికేషన్స్ సంఖ్య పతనమవ్వడం ఇందుకు కారణం.
India students in Canada : ఉన్నత చదువుల కోసం చాలా మంది భారతీయులు విదేశాలకు వెళుతుంటారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియాలో మనవాళ్లు చాలా మందే ఉంటారు. ఇటీవలి కాలంలో విదేశాలకు వెళుతున్న విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే.. మన భారత విద్యార్థులకు కెనడాపై ఆసక్తి తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. గతేడాదితో పోల్చుకుంటే.. ఈ ఏడాది రెండో భాగంలో అప్లికేషన్ల సంఖ్య అనూహ్య విధంగా పతనమవ్వడమే ఇందుకు కారణం.
కారణం ఏంటి..?
2023 జులై- అక్టోబర్ మధ్య కాలంలో కెనడాకు వెళతామని 86,562 మంది భారత విద్యార్థులు అప్లికేషన్ వేశారు. కానీ గతేడాది ఇదే సమయానికి ఆ సంఖ్య 1,45,881గా ఉండేది. అంటే.. ఒకేసారి దాదాపు 40శాతం పడిపోయినట్టు!
India Canada relation : కెనడా- భారత్ బంధం ఇటీవలి కాలంలో బలహీనపడిన విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అయితే.. భారత విద్యార్థులు, కెనడావైపు మొగ్గుచూపకపోవడానికి కారణం అది కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
"కెనడాలో విద్యార్థులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. తమను దోచుకుంటున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో చదువు తర్వాత ఉద్యోగాలు కూడా పెద్దగా ఉండటం లేదని అంటున్నారు. క్వాలిటీ ఆఫ్ లివింగ్ సరిగ్గా లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు మొగ్గుచూపడం లేదు. దీనికి, భారత్- కెనడా మధ్య ఉద్రిక్తతకు సంబంధం లేదు," అని బెటర్ డ్వెల్లింగ్ అనే మీడియా సంస్థ వెల్లడించింది.
India student applications for Canada : "అఫార్డిబులిటీని పెంచేందుకు విదేశీ విద్యార్థుల ఇమ్మిగ్రేషన్ని తగ్గించాలని ప్రభుత్వం భావించింది. కానీ వాస్తవానికి.. విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని వారికి ముందే తెలుసు. డేటాను ప్రజలు చూసి ఉండరు. కానీ అధికారులకు డేటా తెలుసు. అందుకే బయటకు వచ్చి, ఇమ్మిగ్రేషన్ నెంబర్లు తగ్గించాలని మాట్లాడారు," అని బెటర్ డ్వెల్లింగ్ పేర్కొంది.
కెనడాలోని విదేశీ విద్యార్థుల్లో సగం వాటా భారతీయులదే! 2022 మొత్తం మీద భారత విద్యార్థుల నుంచి కెనడాకు మొత్తం 3,63,541 అప్లికేషన్లు అందాయి. 2021లో ఆ సంఖ్య 2,36,077గా ఉంది. ఇక 2023 అక్టోబర్ వరకు ఈ సంఖ్య 2,61,3100గా నమోదైంది. 2023 చివరికి వచ్చేసరికి అప్లికేషన్ నెంబర్ మరింత తగ్గుతుందన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదే నిజమైతే.. కొవిడ్ 19 తర్వాత, అప్లికేషన్ల సంఖ్య తగ్గడం ఇదే తొలిసారి అవుతుంది. దీనికి.. కెనడా- భారత్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే, పరిస్థితులు ఇంకా ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత కథనం