Medha Patkar: పరువు నష్టం కేసులో మేధా పాట్కర్ ను దోషిగా తేల్చిన ఢిల్లీ కోర్టు; రెండేళ్ల జైలు శిక్ష పడే అవకాశం
Medha Patkar: ప్రముఖ సామాజిక కార్యకర్త, నర్మద బచావో ఆందోళన్ నేత మేధా పాట్కర్ ను ఒక పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఆ క్రిమినల్ డిఫమేషన్ కేసును అహ్మదాబాద్ చెందిన ఎన్జీవో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్ కు అప్పట్లో చీఫ్ గా ఉన్న వీకే సక్సేనా వేశారు.
Medha Patkar: సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు మేధా పాట్కర్ పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసులో మేధా పట్కర్ ను కోర్టు దోషిగా తేల్చింది. సాకేత్ కోర్టు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రాఘవ్ శర్మ మేధా పాట్కర్ ను దోషిగా తేల్చారు. చట్టప్రకారం ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.
2000 నాటి కేసు..
2000 సంవత్సరంలో తనకు, నర్మదా బచావో ఆందోళన్ (Narmada Bachao Andolan)కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించినందుకు పాట్కర్ వీకే సక్సేనా పై దావా వేశారు. నాటి నుంచి వారిద్దరి మధ్య న్యాయ వివాదం కొనసాగుతోంది. వీకే సక్సేనా అప్పట్లో అహ్మదాబాద్ కు చెందిన ఎన్జీవో ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ కు చీఫ్ గా ఉన్నారు. ఓ టీవీ ఛానెల్ లో తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, పరువు నష్టం కలిగించేలా పత్రికా ప్రకటన చేసినందుకు సక్సేనా ఆమెపై రెండు కేసులు నమోదు చేశారు. 2002లో పాట్కర్ పై జరిగిన దాడి కేసుకు సంబంధించిన తదుపరి చర్యలపై మధ్యంతర స్టే విధించడం ద్వారా గుజరాత్ హైకోర్టు గత ఏడాది సక్సేనాకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. 2002లో సబర్మతి ఆశ్రమంలో మేధా పాట్కర్ పై దాడి చేశారని వీకే సక్సేనాతో పాటు మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఒక కాంగ్రెస్ నేతపై ఆరోపణలు ఉన్నాయి.
గోద్రా ఘటన అనంతరం..
గోద్రాలో రైలు బోగీ దగ్ధమై 59 మంది హిందూ ప్రయాణికులు మరణించిన తర్వాత గుజరాత్ లో మత కలహాలు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తరువాత శాంతిని పెంపొందించడానికి ఉద్దేశించిన సమావేశంలో మేధా పాట్కర్ పై దాడి జరిగింది. సక్సేనా, ఇతరులపై చట్టవిరుద్ధంగా గుమిగూడడం, దాడి, తప్పుడు సంయమనం, నేరపూరిత బెదిరింపుల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.