Temple Attack In Canada : భారతీయుల భద్రతపై ఆందోళన చెందుతున్నాం.. కెనడాలో ఆలయ దాడి ఘటనపై భారత్
Temple Attack In Canada : కెనడాలో ఆలయంపై దాడి జరిగిన ఘటనపై తీవ్రంగా స్పందించింది. భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నట్టుగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయం వద్ద ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులు జరిపిన హింస, దాడిని భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. హింసకు పాల్పడిన వారిని వెంటనే ప్రాసిక్యూట్ చేయాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఒక ప్రకటనలో కెనడా ప్రభుత్వాన్ని కోరారు.
ఒంటారియోలోని బ్రాంప్టన్లోని హిందూ సభ ఆలయం వద్ద తీవ్రవాదులు, వేర్పాటువాదులు జరిపిన హింసను ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దాడుల నుంచి అన్ని ప్రార్థనా మందిరాలకు రక్షణ కల్పించాలని కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెల్లడించారు. హింసకు పాల్పడిన వారిని కూడా శిక్షిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
కెనడాలోని భారతీయుల భద్రతపై భారత్ తీవ్ర ఆందోళన చెందుతోందని జైస్వాల్ తెలిపారు. 'కెనడాలోని భారతీయుల భద్రతపై మేం తీవ్ర ఆందోళన చెందుతున్నాం. భారతీయులు, కెనడియన్ల పౌరులకు కాన్సులర్ సేవలు కొనసాగుతున్నాయి.' అని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
ఆదివారం బ్రాంప్టన్‌లోని హిందూ సభ ఆలయం వద్ద ఖలిస్థాన్ జెండాలు చేతబట్టిన కొందరు దాడి చేశారు. ఖలిస్థాన్ జెండాలు పట్టుకున్న హిందువులు ఆలయం వెలుపల గుమిగూడిన హిందూ భక్తులతో ఘర్షణకు దిగడం, దాడి చేయడం వంటి వీడియో వైరల్‌గా మారింది.
ఈ ఘటనపై చాలా మంది విమర్శలు గుప్పించారు. ఈ ఘటన మీద కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ఈ ఘటనను ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. 'బ్రాంప్టన్లోని హిందూ సభ ఆలయంలో జరిగిన హింస ఆమోదయోగ్యం కాదు' అని ఆయన సోమవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో రాశారు. ప్రతి కెనడియన్ కు తమ మతాన్ని స్వేచ్ఛగా, సురక్షితమైన వాతావరణంలో ఆచరించే హక్కు ఉందని చెప్పారు.