Kangana Ranaut Comments : దేశానికి జాతిపితలు లేరు.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మళ్లీ దుమారం
Kangana Ranaut Comments : అక్టోబర్ 2న కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతిని పురస్కరించుకుని కంగనా ఓ పోస్ట్ ద్వారా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీకి చెందిన బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తోంది. ఆమె వ్యాఖ్యలు బీజేపీకి ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కొత్త వివాదాన్ని సృష్టించారు. కంగనా రనౌత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో 'దేశానికి జాతిపితలు ఎవరూ లేరు. కేవలం కుమారులు మాత్రమే ఉన్నారు. భారతమాతకు ఇలాంటి కుమారులు(లాల్ బహదూర్ శాస్త్రి) ఉండటం అదృష్టం.' అని పోస్ట్ చేశారు.
గతంలో రైతుల ఆందోళనలపై ఆమె చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. తాజాగా లాల్ బహదూర్ శాస్త్రి 120వ జయంతిని పురస్కరించుకుని కంగనా చేసిన పోస్ట్‌పై కూడా వివాదం నడుస్తోంది. దేశంలో పరిశుభ్రతపై మహాత్మాగాంధీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని మరో పోస్టులో కంగనా అన్నారు.
లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మాగాంధీలపై కంగనా చేసిన పోస్టులు మరో వివాదానికి దారితీశాయి. మహాత్మాగాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే మండిపడ్డారు. గాడ్సే ఆరాధకులు బాపు, శాస్త్రిల మధ్య తేడా చూపుతారని, నరేంద్ర మోదీ తన పార్టీ కొత్త గాడ్సే భక్తుడిని హృదయం నుండి క్షమిస్తారా? అంటూ ప్రశ్నించారు.
పంజాబ్ బీజేపీ సీనియర్ నేత మనోరంజన్ కాలియా కూడా కంగనా రనౌత్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. 'గాంధీ 155వ జయంతి సందర్భంగా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఆమె రాజకీయ జీవితంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అలవాటైంది. రాజకీయం తన రంగం కాదు. రాజకీయాలు చాలా సీరియస్ విషయం. మాట్లాడే ముందు ఆలోచించండి.' అని కాలియా అన్నారు. ఇలా కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.
2021లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. అయితే వీటిని తిరిగి తీసుకురావాలని కొన్ని రోజుల కిందట కంగనా సూచించారు. దీంతో విమర్శలపాలయ్యారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమం భారత్‌లో బంగ్లాదేశ్ తరహా పరిస్థితిని సృష్టిస్తోందని కంగనా ఆరోపించారు. ఆ తర్వాత కంగనా రనౌత్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు.