Gandhi Jayanti: గాంధీ జీవితంలో జరిగిన ఈ సంఘటనలు మనలో స్ఫూర్తిని నింపుతాయి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి
Gandhi Jayanti: స్ఫూర్తిని నింపే మహనీయుల్లో మహాత్మా గాంధీ ముందు వరుసలోనే ఉంటారు. బ్రిటిష్ పాలన నుండి మనకు స్వాతంత్ర్యం అందించిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన జయంతి సందర్భంగా మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి.
Gandhi Jayanti: గాంధీ జయంతి... గాంధీ జన్మదినోత్సవాన్ని అక్టోబర్ 2న భారతీయులంతా కచ్చితంగా పండుగ నిర్వహించుకునే రోజు. మనలో స్ఫూర్తి నింపి స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టిన మహనీయుడు గాంధీ. ఆయన నుంచి మనం ఎంతో నేర్చుకున్నాం. శాంతి, న్యాయం, సమానత్వం, అహింస, సత్యం... ఇలా మానవతా విలువలను పెంచేందుకు గాంధీ ఎంతో కృషి చేశారు. ఆయన జీవితమే మనకు ఒక పాఠం. ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి స్ఫూర్తిదాయకమైన గాంధీ జీవితంలోని సంఘటనలు ఇవన్నీ.
తప్పని తెలిస్తే చేయకూడదు
మహాత్మా గాంధీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఒకరోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ అధికారి గాంధీ చదువుతున్న స్కూల్‌కి వచ్చారు. అతను తరగతిలో కూర్చున్న విద్యార్థులకు అయిదు ఆంగ్ల పదాలను చెబుతానని వాటిని తప్పు లేకుండా ఇంగ్లీషులో రాయమని చెప్పారు. గాంధీ నాలుగు పదాలు సరిగ్గా రాశారు. కానీ ఐదవ పదం స్పెల్లింగ్ ఆయనకు తెలియలేదు. అది చూసిన టీచర్ పక్క విద్యార్థి నుంచి కాపీ చేయమని సైకిల్ ద్వారా గాంధీజీకి చెప్పారు. అది గ్రహించిన గాంధీ అలా చేయడం తప్పని 5వ పదం రాయకుండా అలానే ఉండిపోయారు. అధికారి వెళ్ళిపోయాక టీచర్ గాంధీని బాగా తిట్టారు. ‘కనీసం పక్కవారి నుంచి కాపీ కొట్టడం కూడా నీకు రాదు’ అంటూ హేళన చేశారు. విద్యార్థులు అంతా దానికి ఎంతో నవ్వారు. ఆ ఘటన జరిగాక కూడా గాంధీ బాధపడలేదు. ఇంటికి వెళ్లి తాను చేసింది తప్పు కాదని అందుకే తాను బాధపడవలసిన అవసరం లేదని అనుకున్నారు. కానీ గురువే తనను అలా మోసం చేయమని అడగడం మాత్రం అతడిని ఎంతో బాధించింది. తప్పు అని తెలిశాక అది చేయకూడదని గాంధీ నిర్ణయించుకున్నారు. ఈ సంఘటన ప్రకారం ఇంట్లో తల్లిదండ్రులు టీచర్లు, పెద్దవాళ్లు చెప్పినా కూడా తప్పుడు పనులు చేయకూడదు.
మాట మీద నిల్చోవాల్సిందే
దక్షిణాఫ్రికాలోని జోహాన్నస్‌బర్గ్‌లో గాంధీజీ న్యాయవాద వృత్తిని చేపట్టారు. అప్పుడు అతనికి 13 ఏళ్ల కొడుకు ఉన్నారు. గాంధీజీ సహోద్యోగి మిస్టర్ పోలాక్ తనకు ఒక పుస్తకం ఇంటికి ఇవ్వాలని గాంధీజీ కొడుకుని రిక్వెస్ట్ చేశారు. దానికి గాంధీజీ కొడుకు మణిలాల్ ఒప్పుకున్నాడు. కానీ సాయంత్రమయ్యాక ఆటల్లో పడి ఆ విషయాన్ని మర్చిపోయాడు. రాత్రి చీకటి పడ్డాక గాంధీజీ కొడుకుని పిలిచి పొలాక్ అడిగిన పుస్తకాన్ని ఇచ్చావా? అని ప్రశ్నించారు. దానికి మణిలాల్ ఇవ్వలేదని చెప్పారు. ఎవరికైనా మాటిస్తే దాన్ని కచ్చితంగా పాటించి తీరాలని మణిలాల్‌కు చెప్పి ఆ రాత్రి సమయంలోనే ఆ పుస్తకం ఇచ్చి రమ్మని పంపించారు. ఆ చీకటిలో చిన్నపిల్లలు వెళ్లలేరని ఎంతమంది చెప్పినా గాంధీ వినలేదు. ఇప్పటినుంచే క్రమశిక్షణ నేర్పాలన్న ఉద్దేశంతో ఆయన కొడుకుని అదే సమయంలో పుస్తకంతో పోలక్ ఇంటికి పంపించారు. ఆ చిన్న పిల్లాడు చీకట్లో ఏమవుతాడన్న భయంతో మరొక వ్యక్తి తనకు తానుగానే తోడుగా వెళ్ళాడు. మణిలాల్ ఇంటికి తిరిగి వచ్చాక తన కొడుక్కి ఒకే విషయాన్ని చెప్పాడు గాంధీజీ... ఎవరికైనా వాగ్దానం చేస్తే అది పాటించి తీరాలని, లేకుంటే ఎవరికీ మాట ఇవ్వకూడదని వివరించారు. దయగా, సౌమ్యంగా ఉండే గాంధీజీ కొన్ని సమయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కూడా కనిపిస్తారు.
ప్రేమ ఎంతో విలువైనది
గాంధీ దక్షిణాఫ్రికా నుండి బొంబాయి వచ్చాక కాంగ్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ గాంధీజీ కుర్చీల కింద, బల్లల కిందా ఏదో ఆత్రుతగా వెతకడం మిగతావారు గమనించారు. ఏమైందని అతడిని అడిగారు. దానికి గాంధీజీ నా పెన్సిల్ పోగొట్టుకున్నాను అని చెప్పారు గాంధీ. దానికి వారు ఒక పెన్సిల్ కోసం ఎందుకు వెతకడం, చాలా పెన్సిల్స్ ఉన్నాయి అని చెప్పారు. దానికి గాంధీజీ ‘లేదు, నాకు నా పెన్సిల్ కావాల్సిందే’ అని పట్టు పట్టారు. వేరే పెన్సిల్ వాడమని ఇచ్చినా కూడా వారు ఒప్పుకోలేదు. ఇక గాంధీజీ వినరని అర్థం అయ్యి అందరూ పెన్సిల్‌ను వెతకడం ప్రారంభించారు. చివరికి చిన్న మూడు సెంటీమీటర్ల పెన్సిల్ దొరికింది. ఇంత చిన్న పెన్సిల్ కోసం ఇంతగా వెతకాలి అంటూ అందరూ విమర్శించారు. దానికి గాంధీజీ ఇది పెన్సిల్ కాదు, ఒక జ్ఞాపకం, ఒకరి ప్రేమ. గాంధీజీకి ఆ పెన్సిల్ మొక్కను ఇచ్చింది మద్రాసులో ఉన్న నటేశన్ అనే వ్యక్తి కొడుకు. గాంధీజీ దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు వచ్చాక నటేశన్ ఇంట్లో కొన్ని రోజులు ఉన్నారు. అతని కొడుకు తన జ్ఞాపకంగా ఆ పెన్సిల్ ముక్కను గాంధీజీకి ఇచ్చారు. దాన్ని ఎంతో జాగ్రత్తగా ఒక గుర్తుగా దాచుకున్నారు. గాంధీ తనను ప్రేమించే వారికి అంత విలువ ఇస్తారు.
టాపిక్