Agrigold APCID: అగ్రిగోల్డ్‌ కేసులో చట్టాలు, సెక్షన్లు తెలియని పోలీసులు, కోర్టులో అభాసుపాలు! భూ కబ్జాలో అసలు దోషులెవరు?-agrigold case police do not know the laws who is guilty in the land acquisition ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Agrigold Apcid: అగ్రిగోల్డ్‌ కేసులో చట్టాలు, సెక్షన్లు తెలియని పోలీసులు, కోర్టులో అభాసుపాలు! భూ కబ్జాలో అసలు దోషులెవరు?

Agrigold APCID: అగ్రిగోల్డ్‌ కేసులో చట్టాలు, సెక్షన్లు తెలియని పోలీసులు, కోర్టులో అభాసుపాలు! భూ కబ్జాలో అసలు దోషులెవరు?

Sarath chandra.B HT Telugu
Aug 14, 2024 11:08 AM IST

Agrigold APCID: డిపాజిటర్ల నుంచి వేల కోట్ల రుపాయలు సేకరించి వారిని నిలువునా ముంచిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. పదేళ్లుగా కొందరు అధికారుల పాలిట కామధేనువుగా మారిన అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తును అద్దం పట్టే ఘటన మంగళవారం ఏసీబీ కోర్టులో జరిగింది.

అగ్రిగోల్డ్‌ కేసులో  పోలీసుల దర్యాప్తు తీరు
అగ్రిగోల్డ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు తీరు

Agrigold APCID: అగ్రిగోల్డ్‌ కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తు తీరుకు అద్దం పట్టే ఘటన మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో జరిగింది. డిపాజిటర్ల నుంచి వేల కోట్ల రుపాయలు సేకరించి ముంచేసిన అగ్రిగోల్డ్ వ్యవహారంపై పదేళ్లుగా ఏపీ సీఐడి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితులకు రిమాండ్ పూర్తి చేసుకుని బెయిల్‌పై బయటకు కూడా వచ్చేశారు.

పదేళ్ల క్రితం మొదలైన కేసు దర్యాప్తు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. తాజాగా సీఐడీ అటాచ్‌ చేసిన భూముల్ని అక్రమంగా రిజిస్టర్ చేసుకున్న వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు రాజీవ్ మండల సర్వేయర్ రమేష్‌లను  ఏసీబీ అరెస్ట్ చేసింది.

సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్‌ భూములు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని హెచ్‌టి తెలుగు జూన్‌17న వెలుగులోకి తీసుకొచ్చింది. విజయవాడ రూరల్‌ మండలం అంబాపురం గ్రామంలో 2వేల గజాల స్థలాన్ని అక్రమంగా రిజిస్టర్ చేసి స్వాధీనంలోకి తీసుకున్న వైనాన్ని ఆధారాలతో బయటపెట్టడంతో దుమారం రేగింది.

ఈ వ్యవహారంలో విజయవాడ టూటౌన్‌ పోలీసులు నిర్లక్ష్యం, ఏపీ సీఐడీ నిర్లిప్త వైఖరి, రాజకీయ నాయకులకు కొమ్ముకాసిన రెవిన్యూ,సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల వైఖరిని బయటపెట్టడంతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఆ తర్వాత ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. అదే సమయంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు తమ భూమిని కబ్జా చేసినా పట్టంచుకోవడం లేదని ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో సిఐడి అధికారులు మేల్కొన్నారు.

సీఐడీ, ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న భూములకు అగ్రిగోల్డ్‌ యజమానులు తమదిగా క్లెయిమ్‌ చేయడంతో అప్రమత్తం అయ్యారు. అగ్రిగోల్డ్‌ ఫిర్యాదుపై కేసు నమోదు చేస్తే సాంకేతిక ఎదురయ్యే చిక్కుల్ని ఆలస్యంగా గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో అగ్రిగోల్డ్‌ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న పోలీస్ అధికారుల పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయి. భూముల కబ్జా వెనుక వారి సహకారం ఉండొచ్చనే సందేహాలు ఉన్నాయి. పోలీసులు కేసులు నమోదు చేయకుండా తాత్సారం చేయడానికి ఇదే అసలు కారణంగా తెలుస్తోంది.

ఎన్నికలతో తారుమారు…

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మొత్తం వ్యవహారం తారుమారైంది. ఎన్నికలకు ముందే గత జనవరి నాటికి అంబాపురం గ్రామంలో ఉన్న భూమిని జోగి రమేష్ కుటుంబం తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది. సర్వే నంబర్ 87లో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని సర్వే నంబర్ 88లో జోగి కుటుంబం కొనుగోలు చేసిన భూమిగా పేర్కొంటూ ఫెన్సింగ్ వేశారు. ఇదంతా పథకం ప్రకారం చేశారు. ఆ తర్వాత విజయవాడ వైసీపీ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్య రెడ్డి కుటుంబానికి చెందిన ఏడుగురికి విక్రయించినట్టు మరో రిజిస్ట్రేషన్ చేశారు. భూమి చేతులు మారినట్టు చూపించడానికే ఇలా చేశారు.

ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే ఆ భూమిలో భారీ అపార్ట్‌మెంట్‌ నిర్మించాలని ప్రణాళిక రచించారు. విజయవాడ నగర శివార్లలో ఔటర్ రింగ్‌ రోడ్డు వెంబడి ఉన్న భూమి కావడంతో వెంటనే ఫ్లాట్లను విక్రయించేసి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశారు. ఇందుకు గ్రామ సర్వేయర్ నుంచి ఎమ్మార్వో వరకు అందరిని మేనేజ్ చేశారు.

కోర్టులో నీళ్లు నమిలిన ఏసీబీ సిఐ..

2014లో అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత 2015 నుంచి పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన సిఐడి అధికారులు వేల ఎకరాల భూములు, వాటికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 2017లోనే వాటిని సిఐడి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఏపీ హోంశాఖ జీవో నంబర్ 133, జీవో నంబర్ 117 జారీచేసింది.

అంబాపురం భూముల వ్యవహారంలో మంగళవారం జోగి రాజీవ్‌ను అరెస్ట్‌ చేసిన తర్వాత సాయంత్రం ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలో అగ్రిగోల్డ్‌ భూముల అటాచ్‌మెంట్‌కు సంబంధించి కోర్టు ఉత్తర్వులు చూపాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు పోలీసుల్ని ప్రశ్నించారు. దీంతో ఏసీబీ సిఐ శివప్రసాద్ కోర్టులో తెల్లముఖం వేశారు. కోర్ట్ అటాచ్‌మెంట్‌ ఆర్డర్లు లేకుండా సిఐడి అటాచ్‌మెంట్ ఎలా జరుగుతుందనే ప్రశ్న తలెత్తడంతో దర్యాప్తు బృందం బిక్క ముఖం వేసింది. విచారణాధికారి సమాధానం చెప్పలేక మౌనంగా నిలబడ్డారు. కోర్టు హాల్లో ఉన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తడబడ్డారు.

అగ్రిగోల్డ్‌ కేసులు దర్యాప్తు చేస్తున్న అధికారులు కూడా ఏమి జరిగిందనే దానిపై వివరణ ఇవ్వలేకపోయారు. చివరకు కోర్టు హాల్లో ఉన్న న్యాయవాదులు పోలీసులకు అసలు విషయం చెప్పారు. ఏపీ డిపాజిటర్స్‌ ప్రొటెక్షన్ యాక్ట్ సెక్షన్ 3,4 ఆధారంగా ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసిందని, వాటిని గతంలోనే కోర్టు ధృవీకరించిందని చెప్పడంతో ఏసీబీ అధికారులు నాలుక కరుచుకున్నారు. అప్పటికప్పుడు ఏపీ డిపాజిటర్స్‌ యాక్ట్ పుస్తకాలను కోర్టులో సమర్పించారు. జీవో 117, 133లను జారీ చేసిన నేపథ్యం వివరించారు. ఇదంతా జరగడానికి రెండు గంటల సమయం పట్టింది.

పీసీ యాక్ట్ సెక్షన్ 7…

మాజీ మంత్రి జోగి రమేష్‌ తనయుడు జోగి రాజీవ్‌ను కోర్టులో ప్రవేశ పెట్టే సమయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. అగ్రిగోల్డ్‌ భూముల వ్యవహారంలో అవినీతి నిరోధక చట్టం సెక్షన్‌ 7 ప్రకారం అభియోగాలను నమోదు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఈ సెక్షన్లను వర్తింప చేశారు.

కోర్టు విచారణ సందర్భంగా మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జోగి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. వైసీపీ లీగల్ టీమ్‌ జోగి తరపున న్యాయ సహాయం అందించేందుకు కోర్టుకు వచ్చారు. గత ఏడాది సెప్టెంబర్‌లో పీసీ యాక్ట్‌ సెక్షన్‌ 7 ప్రకారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించాలని ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో రాజీవ్‌కు ఆ సెక్షన్లు వర్తించవని నిందితుడి తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

కేసు తీవ్రతను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం రాజీవ్‌తో పాటు మండల సర్వేయర్‌ రమేష్‌కు ఈ నెల 23వరకు రిమాండ్ విధించారు. ఈ కేసులో మిగిలిన నిందితుల్ని కూడా అరెస్ట్ చేయనున్నారు. నిందితులపై పీసీ యాక్ట్ 7,12తో పాటు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేశారు.

సంబంధిత కథనం