Karnataka Election 2023: కన్నడనాట ‘కాంగ్రెస్‌’దే పైచేయి: పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే-congress may get slight majority in karnataka assembly elections 2023 people pulse pre poll survey ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Election 2023: కన్నడనాట ‘కాంగ్రెస్‌’దే పైచేయి: పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే

Karnataka Election 2023: కన్నడనాట ‘కాంగ్రెస్‌’దే పైచేయి: పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే

Chatakonda Krishna Prakash HT Telugu
May 08, 2023 12:40 PM IST

Karnataka Election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యాన్ని సాధిస్తుందని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ ఏఏ అంశాల్లో ముందుందో పేర్కొంది. ప్రజల అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది.

Karnataka Election 2023: కన్నడనాట ‘కాంగ్రెస్‌’దే పైచేయి: పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే
Karnataka Election 2023: కన్నడనాట ‘కాంగ్రెస్‌’దే పైచేయి: పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే

Karnataka Assembly Election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు స్వల్ప ఆధిక్యత కనిపిస్తోందని పీపుల్స్‌ పల్స్‌ (People Pulse) చేపట్టిన ప్రీపోల్‌ సర్వే(Pre-poll Survey)లో తేలింది. కర్ణాటకలో గత మూడున్నర దశాబ్దాల చరిత్రలో ఏ పార్టీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేజిక్కించుకోలేదు. అధికారాన్ని నిలబెట్టుకొని చరిత్రను మార్చాలని అధికార బీజేపీ ప్రయత్నిస్తుంటే, విజయం సాధించి సంప్రదాయాన్ని కొనసాగించాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. ఈ నెల 10వ తేదీన కర్ణాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. 13న ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో సౌత్‌ఫస్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ సంస్థ కర్ణాటకలో ప్రీపోల్ సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‍కే స్వల్వ ఆధిక్యత కనిపిస్తోందని ఆ సర్వే వెల్లడించింది. ఇందుకు వివిధ కారణాలను, ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. పూర్తి వివరాలివే..

ఈ అంశాల్లో ‘హస్తమే’ ముందు

Karnataka Assembly Election 2023: కర్ణాటకలోని మహిళలు, పురుషులతో పాటు అన్ని వయస్సుల వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోగా.. ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక అంశాలు, ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం ఇలా అన్ని అంశాల్లో కాంగ్రెస్‌ ఇతర పార్టీల కంటే ముందుందని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే పేర్కొంది. కోస్తా కర్ణాటకను మినహాయించి అన్ని ప్రాంతాలలో కాంగ్రెస్‌ తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కంటే ముందంజలో ఉందని వెల్లడించింది.

ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రావొచ్చు!

Karnataka Assembly Election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ 100 స్థానాలకు పైగా సాధించి స్వల్ప మెజార్టీ సాధించే అవకాశాలున్నాయని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. అధికార బీజేపీ 100 సీట్లలోపే పరిమితం కావొచ్చని అంచనా వేసింది. ఇదేసమయంలో జేడీఎస్ తనకు పట్టున్న స్థానాల్లో ఆధిపత్యం కొనసాగిస్తూ 24 స్థానాలకుపైగా సాధించవచ్చని తెలిపింది. కాంగ్రెస్‌ పార్టీ 105 నుంచి 117 స్థానాల్లో, బీజేపీ 81 నుంచి 93 స్థానాల్లో, జేడీఎస్‌ 24-29 స్థానాల్లో, ఇతరులు 1 నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది.

ఓట్ల శాతం ఇలా..

Karnataka Assembly Election 2023: పీపుల్స్‌ పల్స్‌ సర్వే ప్రకారం, 2018లో 38.14 శాతం ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ ఈసారి ఎన్నికల్లో 41.4 శాతం పొందే అవకాశాలున్నాయి. 2018లో 36.35 ఓట్ల శాతం పొందిన అధికార బీజేపీ.. ఇప్పుడు 0.3 శాతం ఓట్లను కోల్పోయి 36 శాతం ఓట్లు సాధించవచ్చని ఆ సర్వే అంచనా వేసింది. 2018లో కింగ్‌మేకర్‌ పాత్ర పోషించిన జేడీఎస్‌ ఇప్పుడు 16 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇది 2018 కంటే 2.3 శాతం తక్కువ. ఏ సర్వేలోనైనా రెండు శాతం ప్లస్‌ లేదా మైనస్‌ వ్యత్యాసాలు ఉండే అవకాశాలుంటాయని పీపుల్స్‌ పల్స్ చెప్పింది. చివరి రెండు రోజుల ప్రచారాన్ని సర్వే పరిగణనలోకి తీసుకోనందున.. చివరి నిమిషంలో ప్రధాన పార్టీలకు లభించే అనుకూల, వ్యతిరేక అంశాలను అంచనా వేయలేమని పీపుల్స్‌ పల్స్ తెలిపింది.

Karnataka Assembly Election 2023 pre-poll survey:‘‘సౌత్‌ ఫస్ట్‌’’ న్యూస్‌ వెబ్‌సైట్‌ కోసం పీపుల్స్‌ పల్స్‌ రీసెర్చ్‌ సంస్థ డైరెక్టర్‌ ఆర్‌.దిలీప్‌రెడ్డి నేతృత్వంలో మే 1 నుంచి మే 5వ తేదీ వరకు ఈ సర్వే జరిగింది. ‘ప్రాబబులిటీ ప్రొఫెషనల్‌ మెథడాలజీ’ (పీపీఎస్‌) పద్ధతి ద్వారా ఎంపిక చేసిన 56 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను పీపుల్స్‌ పల్స్ ప్రతినిధులు నిర్వహించారు. ప్రతి నియోజకవర్గంలో మూడు పోలింగ్‌ స్టేషన్లను ఎంపిక చేశారు. ప్రతీ పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో 20 శాంపిల్స్‌ సేకరించారు. ప్రాంతం, కులం, వయస్సు, పురుషులు, మహిళలు, పేదలు,`సంపన్నులు ఇలా తగు నిష్పత్తిలో ఉండేలా చూసుకుంటూ మొత్తం 3,360 శాంపిల్స్‌ తీసుకున్నారు.

కర్ణాటకలో పీపుల్స్‌ పల్స్‌ సంస్థ మొదటి ప్రీ పోల్‌ సర్వేను 2022 డిసెంబర్‌ 22వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించగా.. రెండో ప్రీ పోల్స్‌ సర్వేను ఈ ఏడాది మార్చి 25 నుంచి 10 ఏప్రిల్‌ వరకు చేపట్టింది. చివరిదైన మూడో ప్రీ పోల్‌ సర్వేను ఈ ఏడాది మే 1 నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహించింది.

పీపుల్స్‌ పల్స్‌ ప్రతినిధులు ప్రీపోల్‌ సర్వే కోసం 25 ఏప్రిల్‌ నుండి మే 5వ తేదీ వరకు రాష్ట్రంలోని ఆరు ప్రాంతాలలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రధాన పార్టీలపై ఓటర్ల నాడిని అంచనా వేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లను నేరుగా కలుసుకోవటంతో పాటు అక్కడ వివిధ వర్గాలతో చర్చించి అక్కడ ఏ పార్టీకి అనుకూలంగా ఉందో తెలుసుకున్నారు.

సీఎంగా అత్యధికులు ‘సిద్ధరామయ్య’కే జై

Karnataka Assembly Election 2023: ముఖ్యమంత్రిగా ఎవరికి ప్రాధాన్యతిస్తున్నారని ఓటర్ల అభిప్రాయాన్ని కోరగా మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య పేరును 42 శాతం మంది చెప్పారని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. ప్రస్తుత ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మైకి 24 శాతం, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి 17 శాతం, మాజీ సీఎం బి.యడియూరప్పకు 14 శాతం మంది, డి.కె.శివకుమార్‌కు 3 శాతం మంది ప్రాధాన్యతినిచ్చారని తెలిపింది.

కాంగ్రెస్‍కే మొగ్గు

Karnataka Assembly Election 2023: కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి ఏ పార్టీ మెరుగైనది అని ప్రశ్నిస్తే కాంగ్రెస్‌కు 46 శాతం ఓటర్లు, బీజేపీకి 34 శాతం మంది, జేడీఎస్‌కు 14 శాతం ప్రాధాన్యమిచ్చారని ఆ సర్వే పేర్కొంది. బీజేపీ ప్రభుత్వానికి మరో అవకాశం ఇస్తారా అని ప్రశ్నించగా 53 శాతం ఇవ్వబోమని, 41 శాతం ఇస్తామని చెప్పగా 6 శాతం మంది ఏమీ చెప్పలేమని తెలిపారని ఆ సర్వేలో తేలింది.

Karnataka Assembly Election 2023: కర్ణాటకలో ఏప్రిల్‌ నుంచి నిర్వహిస్తున్న ప్రీపోల్‌ సర్వేలో రాష్ట్ర రాజకీయాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది. వాటిని అంశాల వారిగా పేర్కొంది. “టికెట్లను ప్రకటించాక ప్రధాన మూడు పార్టీలలో అసంతృప్తి, తిరుగుబాట్లు భారీగా తలెత్తాయి. పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోల్లో అనేక వివాదాస్పద అంశాలున్నాయి. ప్రధాన పార్టీల ప్రచారంలో అధినాయకత్వంతో ప్రధాన నేతలు పాల్గొన్న సందర్భాలలో అనేక వివాదాస్పద ప్రకటనలు, అంశాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు చోటుచేసుకున్నాయి” అని పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది.

ఏ వర్గాలు.. ఏ పార్టీవైపు!

Karnataka Assembly Election 2023: పీపుల్స్‌ పల్స్‌ ప్రీ పోల్‌ సర్వే అంచనా ప్రకారం ప్రధాన పార్టీలన్నీ ఆయా సామాజిక వర్గాల్లో స్వల్ప మార్పులతో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. లింగాయత్‌, ఎస్టీ నాయక్‌, ఎస్సీ లెఫ్ట్‌ వర్గాల్లో బీజేపీ ఆధిపత్యం ఉందని ఆ సర్వే తెలిపింది. కురుబలు, ఇతర ఓబీసీలు, ఎస్సీ రైట్‌, ముస్లిం వర్గాల్లో కాంగ్రెస్‌ ఆధిపత్యం కొనసాగిస్తోందని పేర్కొంది. వొక్కలిగ సామాజిక వర్గంలో జేడీఎస్‌ ఆధిపత్యం ఉంటుందని తెలిపింది. అయితే అభ్యర్థులు, స్థానిక అంశాల ఆధారంగా ఈ సామాజిక వర్గాల నిర్ణయాలలో స్వల్పమార్పులున్నాయని పేర్కొంది. ఎస్సీలోని బోవీ వర్గం ఇంతకాలం బీజేపీ వైపుండగా, ఇప్పుడు కాంగ్రెస్‌వైపు మళ్లారని ఆ సర్వే వెల్లడించింది. అలాగే, దక్షిణ కర్ణాటకలో ముస్లింలు జేడీఎస్‌ను కాదని కాంగ్రెస్‌ వైపు సానుకూలంగా ఉన్నారని తెలిపింది.

కీలకమైన రాజకీయ అంశాలు

Karnataka Assembly Election 2023: కర్ణాటక ఎన్నికల్లో తమ దృష్టికి వచ్చిన కీలకమైన రాజకీయ అంశాలను పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది.

మతప్రాతిపదికన విభజన: కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ‘బజరంగ్‌ దళ్‌పై నిషేధం అంశం’పై బీజేపీ దృష్టి కేంద్రీకరించి మతప్రాతిపదికన విభజనకు ప్రయత్నించడంతోపాటు ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ చిత్రంపై ప్రచారం చేస్తోందని పీపుల్స్‌ పల్స్ ఈ సర్వేలో పేర్కొంది. వీటిపై బీజేపీ నేతలు ప్రధానంగా దృష్టి పెట్టి భారీగా ప్రచారం చేస్తున్నా కోస్తా కర్ణాటక మినహా ఇతర చోట్ల ప్రభావం స్వల్పమేనని చెప్పింది. అయితే ఇదేసమయంలో బజరంగ్‌దళ్‌పై నిషేధం అంశాన్ని బీజేపీ విజయవంతంగా ఓటర్ల వద్దకు చేర్చగలిగిందని ఆ సర్వే అభిప్రాయపడింది.

  • ధరల పెరుగుదల: గ్యాస్‌ సిలిండర్ల ధరల పెరుగుదల అంశం ఓటర్లపై బాగానే ప్రభావం చూపుతోందని పీపుల్స్‌ పల్స్‌ సర్వే అంచనా వేసింది.
  • నిరుద్యోగం: యువతలో నిరుద్యోగ అంశంపై ప్రాధాన్యత ఉన్నా, వారు సామాజికంగా విడిపోయారని ఈ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. లింగాయత్‌, మరాఠా, ఎస్టీ`నాయక్‌ యువత బీజేపీ పక్షాన ఉండగా, ముస్లింలు, ఎస్టీ(రైట్‌) యువత కాంగ్రెస్‌ పక్షాన, వొక్కలిగ యువత జేడీఎస్‌కు మద్దతుగా ఉండడం ఇక్కడ గమనించాల్సిన విషయమని చెప్పింది
  • అవినీతి : అవినీతి అంశాన్ని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్.. ప్రధాన అంశంగా లేవనెత్తుతోంది. రాష్ట్రంలో ‘40% కమిషన్‌ సర్కార్‌’’ అంశాన్ని హస్తం పార్టీ హైలైట్ చేస్తున్నా.. ఓటర్లు ఆ అంశం ఆధారంగా ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వడంలేదని పీపుల్స్‌ పల్స్‌ చెప్పింది.
  • వ్యవసాయ అంశాలు: పంటకు కనీస మద్దతు ధర, పంట నష్టం పరిహారం అంశాలపై ప్రభుత్వ పనితీరు పట్ల రైతులు అసంతృప్తిగా ఉన్నారని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ అంచనా వేసింది. బీజేపీ తమకేమి చేయలేదనే అసంతృప్తితో వారు కాంగ్రెస్, జేడీఎస్‌కు మద్దతుగా ఓటు వేయవచ్చని తెలిపింది.
  • కన్నడ గౌరవం : దక్షిణ కర్ణాటకలో కన్నడ గౌరవం ప్రభావం ఉండగా, ఉత్తర కర్ణాటకలో లేదని పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది. అయితే ఓటింగ్‌పై ఇది అంతగా ప్రభావం చూపకపోవచ్చని తెలిపింది.
  • పార్టీల్లో తిరుగుబాటు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల్లో తిరుగుబాటు కీలకాంశంగా ఉందని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే అభిప్రాయపడింది. పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటుతో బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలు నష్టపోనున్నాయని అంచనా వేసింది.
  • కాంగ్రెస్‌ హామీలు : ఎన్నికల్లో కాంగ్రెస్‌ హామీల ప్రభావం కనిపిస్తోందని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే చెప్పింది. గృహలక్ష్మి, గృహజ్యోతి, అన్న భాగ్య, యువ నిధి, మహిళలకు ఉచిత బస్సు సర్వీసు హామీల ప్రభావం పేదలు, మహిళలు, గ్రామీణ ప్రజలపై బాగానే ఉందని చెప్పింది.

వివిధ వర్గాలలో ఓటింగ్‌ ప్రాధాన్యతలో మార్పులు ఇలా..

Karnataka Assembly Election 2023: మహిళలు, పురుషుల ఆధారంగా ఓటింగ్‌ ప్రాధాన్యతను ప్రీ పోల్‌ సర్వేలో గమనించామని పీపుల్స్‌ పల్స్‌ పేర్కొంది. అనేక అంశాలపై వివిధ సామాజిక వర్గాల్లో, పేదల్లో, మహిళల్లో ప్రస్తుత ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నట్టు గుర్తించినట్టు తెలిపింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం ప్రధాన అంశాలుగా ఉన్నాయని వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లా కర్ణాటకలో బీజేపీ సర్కార్ సంక్షేమ పథకాలను అమలు చేయడంలో విఫలమైందని ప్రజల్లో అభిప్రాయముందని ఈ ప్రీపోల్ సర్వే పేర్కొంది. ఈ అంశాలు బీజేపీకి నష్టం చేకూరుస్తున్నాయని, ఎన్నికల ముందు చేపట్టిన చర్యలు కుమారస్వామికి మేలు చేకూర్చవచ్చని ఈ సర్వే అంచనా వేసింది. ఈ వర్గాలలో చాలా మంది కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా ఉన్నారని తెలిపింది.

పార్టీలకు ప్రాధాన్యత విషయంలో మార్పులు ఇలా..

Karnataka Assembly Election 2023: పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో సర్వేలో మూడు ప్రధాన మార్పులను ప్రజల్లో గుర్తించినట్టు పీపుల్స్‌ పల్స్‌ తెలిపింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలున్నాయని అధికంగా భావిస్తున్నా.. కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ వచ్చే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే పేర్కొంది. ఇదేసమయంలో బీజేపీ మెజార్టీ సాధించవచ్చని నమ్ముతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని తెలిపింది.

కాంగ్రెస్‌కు ఓటు వేయాలనుకునే వారి సంఖ్య కర్ణాటకలో పెరుగుతోందని. మరోవైపు బీజేపీ, జేడీఎస్‌కు ఓటు వేసే వారి సంఖ్య తగ్గుతూ వస్తోందని పీపుల్స్‌ పల్స్‌ వెల్లడించింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), గాలి జనార్థన్‌రెడ్డి నేతృత్వంలోని కేఆర్‌పీపీ వంటి చిన్న పార్టీలతో పాటు ఇతర ఇండిపెండెంట్ల ప్రభావం కర్ణాటకలో తక్కువగా ఉందని ఈ ప్రీపోల్స్ సర్వే అంచనా వేసింది. వారు 1 నుండి 3 సీట్లు మాత్రమే పొందే అవకాశాలున్నాయని పేర్కొంది.

Karnataka Assembly Election 2023: ఈ కారణాల వల్ల కాంగ్రెస్‌ ఈనెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ పొందే అవకాశాలు ఉన్నాయని పీపుల్స్‌ పల్స్ ప్రీపోల్ సర్వే వెల్లడించింది. మరోవైపు చాలా మంది హంగ్‌ అసెంబ్లీ ఏర్పడుతుందనే అభిప్రాయపడుతున్నారని తెలిపింది.

పార్టీల ప్రచార ప్రభావం ఇలా..

Karnataka Assembly Election 2023: కర్ణాటకలో ప్రస్తుత పరిస్థితి ప్రకారం కాంగ్రెస్‌ ప్రచారంలో ముందంజలో ఉందని పీపుల్స్‌ పల్స్‌ అభిప్రాయపడింది. రాష్ట్రంలో గాంధీ కుటుంబంతో సహా అగ్ర నేతలందరూ ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి లేకపోవడం, నిరుద్యోగం, ధరల పెరుగుదల అంశాలను కాంగ్రెస్‌ ప్రధానంగా ప్రచారం చేస్తోందని పీపుల్స్‌ పల్స్‌ తెలిపింది.

మరోవైపు, బీజేపీ ప్రచారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పింది. ప్రజాకర్షణ ఉన్న ప్రధాన మంత్రి ఉత్సాహంగా రికార్డు స్థాయిలో ర్యాలీల్లో పాల్గొన్నా.. ఇతర బీజేపీ అగ్రనేతలు అలిసిపోయినట్టు కనిపించారని పీపుల్స్‌ పల్స్‌ అభిప్రాయపడింది. ప్రచారంలో బీజేపీ అనేక మార్పుచేర్పులు చేసినట్టు కనిపించిందని, ఆ పార్టీ మొదట జాతీయ అంశాలకు ప్రాధాన్యతివ్వగా, ప్రజల నుండి సానుకూలత కనిపించకపోవటంతో ఆ తర్వాత స్థానిక అంశాలకు ప్రాధాన్యతిచ్చిందని తెలిపింది. తనపై దూషణలు చేస్తోందని ప్రధాన మంత్రి.. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేశారని.. చివరగా మతప్రాతిపదిక ప్రచారానికి బీజేపీ ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపింది. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని బజరంగ్‌ దళ్‌పై నిషేధంపై కమలం పార్టీ భారీగా ప్రచారం చేసిందని, ‘ది కేరళ స్టోరీ’, లవ్‌జిహాద్‌పై కూడా దృష్టి పెట్టిందని వెల్లడించింది. హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లా ఇక్కడ కూడా జాతీయ అంశాల కంటే స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశాలున్నాయని పీపుల్స్‌ పల్స్‌ వెల్లడించింది.

జేడీఎస్‌ దక్షిణ కర్ణాటకపైనే దృష్టి పెట్టి స్థానిక అంశాల ప్రచారానికే ప్రాధాన్యతిచ్చిందని, ఈ వ్యూహం పార్టీకి ప్రయోజనం చేకూర్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

Karnataka Assembly Election 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మే 10వ తేదీ జరగనుంది. మే 13వ తేదీన ఓట్లు లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉండనుంది.

Whats_app_banner