యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2022: ఫలితాలను శాసించే కుల రాజకీయాలు-caste and religion politics in uttar pradesh assembly elections ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2022: ఫలితాలను శాసించే కుల రాజకీయాలు

యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2022: ఫలితాలను శాసించే కుల రాజకీయాలు

Praveen Kumar Lenkala HT Telugu
Jan 24, 2022 10:03 PM IST

UP Assembly elections 2022 | ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా కులాల చుట్టే తిరుగుతాయి. మతం కూడా పెద్దఎత్తున ప్రభావం చూపిస్తుంది. కేంద్ర కేబినెట్ స్వరూపాన్నికూడా ఉత్తర ప్రదేశ్‌లోని కుల బలాలు ప్రభావం చూపిస్తాయనడంలో ఆశ్చర్యం లేదు.

<p>యూపీ అసెంబ్లీ భవనం</p>
యూపీ అసెంబ్లీ భవనం (UP Vidhan sabha )

ఉత్తర ప్రదేశ్‌లోని మొత్తం ఓటర్లలో సుమారు 42 శాతం ఓబీసీలే. మొత్తం ఓటర్లలో 9 శాతం యాదవ్ కులానికి చెందిన ఓటర్లు. వీరు సంప్రదాయంగా సమాజ్‌వాదీ పార్టీకి అండగా ఉన్నారు. ఇక మిగిలిన 33 శాతం యాదవేతర ఓబీసీల ఓట్లే ఎప్పుడూ ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేస్తూ వస్తున్నాయి.

ఈ 33 శాతం ఓటర్లలో దాదాపు 20 శాతం లోయర్ ఓబీసీ కులాలు ఉండగా, 11 నుంచి 12 శాతం యాదవేతర ఓబీసీ కులాలు ఉన్నాయి. యాదవేతర ఓబీసీల్లో కుర్మి, లోద్, గడేరియా కులాలు, కహార్లు (గంగా నది వెంట పవిత్ర కర్మలు నిర్వహించేవారు, కేవట్లు (బోట్లు నడిపేవారు) ఉన్నారు. ఇక లోయర్ ఓబీసీల్లో సుమారు 70 కులాలు ఉన్నాయి. అన్ని పార్టీల గురి యాదవేతర ఓబీసీల ఓట్లపైనే ఉంటుంది. గతంలో జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో ఇది రుజువైంది. అయితే ఆయా అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఉన్న నాటి రాజకీయ పరిస్థితులను బట్టి కులాల సమీకరణాలు మారుతూ వచ్చాయి.

బీజేపీకి ఎవరు ఎంత శాతం మద్దతు?

ఉత్తర ప్రదేశ్ ఓటర్లలో 11 శాతం బ్రాహ్మణులు ఉంటారని అంచనా. ఇందులో నాలుగింట మూడు వంతుల మంది ఓటర్లు బీజేపీ వెంటే నడుస్తారన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక మరో బలమైన కమ్యూనిటీ ఠాకూర్లు. మొత్తం ఓటర్లలో కనీసం 7 శాతం ఉంటారని అంచనా. ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఠాకూర్ కులానికి చెందిన వారు. వీరంతా యోగి వెంటే నడుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైశ్య కమ్యూనిటీ ఓటర్లు సుమారు 3 నుంచి 4 శాతం ఉంటారు. వీరిలో మెజారిటీ ఓటర్లు ఎప్పటి నుంచో బీజేపీ వెంటే ఉంటున్నారు. ఇప్పుడు కూడా ఇదే సమీకరణ కొనసాగే అవకాశాలు ఎక్కువే.

మొత్తం ఓటర్లలో షెడ్యూలు కులాలకు చెందిన వారు 21 శాతం ఉన్నారు. 13 శాతం మేర జాతవ్ కులాలకు చెందిన వారు కాగా, మిగిలిన ఎస్సీలు జాతవేతర ఎస్సీ కులాలకు చెందిన వారు. జాతవేతర కులాల్లో 6 నుంచి 7 శాతం బీజేపీ వెంటే ఉంటారని స్థానిక రాజకీయ నాయకుల అంచనా.

యాదవుల తరువాత ఓబీసీల్లో అతి పెద్ద కులం కుర్మి. సుమారుగా 5 శాతం ఓట్లు కలిగి ఉంది. మీర్జాపూర్, బరేలీ, సోన్‌భద్ర, ఉన్నావ్ తదితర జిల్లాల్లో కుర్మి ఓటర్ల ప్రభావం ఉంటుంది. బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ పార్టీకి ఈ కుర్మీ ఓటర్లు అండగా ఉంటారు. అప్నాదళ్ (ఎస్) పార్టీ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్ రెండు సార్లు కేంద్ర మంత్రి అయ్యారు. కుర్మి నేతలు బి.ఎల్.వర్మ, పంకజ్ చౌదరి కూడా ఇటీవలి కేబినెట్ విస్తరణలో స్థానం సంపాదించారు. మెజారిటీ కుర్మి ఓటర్లు బీజేపీకి మద్దతుగానే నిలిచారు. మిగిలిన వారు సమాజ్‌వాదీ పార్టీకి మొగ్గు చూపుతారు.

కుల సమీకరణలపై సమాజ్‌వాదీ దృష్టి

9 శాతంగా ఉన్న యాదవ ఓట్లు గంప గుత్తగా సమాజ్‌వాదీకే మద్దతు పలుకుతూ వస్తున్నారు. యోగి హయాంలో వీరి ప్రాబల్యం తగ్గడంతో మళ్లీ సంఘటితంగా సమాజ్‌వాదీ వెంటే నడవాలన్న అభిప్రాయం వారిలో నెలకొంది.

ఇక ఉత్తరప్రదేశ్‌ ఓటర్లలో ముస్లింలు 19 శాతంగా ఉన్నట్టు అంచనా. వీరిలో నాలుగింట మూడు వంతులు సమాజ్‌వాదీ పార్టీ వెంటే ఉంటారు. మిగిలిన ఓటర్లు విభిన్న పార్టీల వైపు మొగ్గు చూపవచ్చు.

దాదాపు నాలుగు శాతం ఓట్లు ఉన్న రాజ్‌భర్ కులస్తులు ఓట్లు అదే కులానికి చెందిన నేత ఓం ప్రకాష్ రాజ్‌భర్ స్థాపించిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్పీ) పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పార్టీ పెట్టుకునే పొత్తును బట్టి ఓట్లు వెళ్తాయి. 2017లో అధికార కూటమిలో ఉన్న ఎస్బీఎస్పీ తరువాత బీజేపీతో తెగదెంపులు చేసుకుంది. తరువాత పలు చిన్న ప్రాంతీయ పార్టీల కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటమి సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నటు్ట తెలుస్తోంది.

మత్స్యకారుల కులమైన నిషద్ కులానికి 4 శాతం ఓట్లు ఉన్నాయి. గంగా నది వెంబడి నివసించే ఈ కులస్తులు గోరఖ్‌పూర్, మహరాజ్ గంజ్, మీర్జాపూర్; ప్రయాగ్ రాజ్, వారణాసి తదితర జిల్లాల్లో గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. సంజయ్ నిషద్ నేతృత్వంలోని నిషద్ పార్టీ అధికార బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ముకేష్ సహానీ నేతృత్వంలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) బిహార్‌కు చెందినది. 

అయితే యూపీలో పూలన్ దేవీ విగ్రహాలను ఆవిష్కరించాలన్న ఈ పార్టీ ప్రయత్నాలకు యూపీ ప్రభుత్వం అడ్డుపడడంతో ఆ పార్టీ యూపీలో 50 వేల విగ్రహాలను ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ పార్టీ కూడా కుర్మిలకు ప్రాతినిథ్యం వహిస్తోంది. బందిపోటుగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన పూలన్ దేవీ నిషద్ కులానికి చెందిన వారే. నిషద్ పార్టీ కూడా పూలన్ దేవీ విగ్రహ స్థాపనకు ముందుకొచ్చింది.

ఇదంతా ఒక ఎత్తయితే తనపై సామూహిక అత్యాచారానికి ప్రతీకారంగా సుమారు 24 మంది ఠాకూర్లను చంపారన్న అభియోగం ఎదుర్కొని జైలుకు వెళ్లిన పూలన్ దేవీ.. విడుదలయ్యాక సమాజ్ వాదీ పార్టీ టికెట్‌పై పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు తిరిగి అధికారంలోకి వస్తే ఆమెకు స్మారక భవనం నిర్మిస్తామని, విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని సమాజ్‌వాదీ ప్రకటించింది. 

ఇవన్నీ పక్కనపెడితే నిషద్ కులస్తులు తమను షెడ్యూలు కులాల జాబితాలో చేర్చాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. నిషద్ పార్టీ బీజేపీతో అధికారం పంచుకున్నప్పటికీ ఇది సాకారం కాలేదు.

కుల సమీకరణల్లో ముందుండే సమాజ్ వాదీ పార్టీ.. బలహీనంగా ఉన్న పార్టీల నుంచి కుల నేతలను, ప్రభావం చూపించే నేతలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది. 

Whats_app_banner

సంబంధిత కథనం