LK Advani: ‘‘పాకిస్తాన్ లో జన్మించి.. 14 ఏళ్లకే ఆరెస్సెస్ లో చేరి..’’ - ఎల్ కే అద్వానీ రాజకీయ ప్రస్థానం-bharat ratna to lk advani politician who catapulted bjp to national reckoning ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lk Advani: ‘‘పాకిస్తాన్ లో జన్మించి.. 14 ఏళ్లకే ఆరెస్సెస్ లో చేరి..’’ - ఎల్ కే అద్వానీ రాజకీయ ప్రస్థానం

LK Advani: ‘‘పాకిస్తాన్ లో జన్మించి.. 14 ఏళ్లకే ఆరెస్సెస్ లో చేరి..’’ - ఎల్ కే అద్వానీ రాజకీయ ప్రస్థానం

Sudarshan Vaddanam HT Telugu
Feb 03, 2024 01:57 PM IST

LK Advani political journey: భారతీయ జనతా పార్టీ దిగ్గజ నాయకుడు ఎల్ కె అద్వానీకి శనివారం కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. బీజేపీని అధికారంలోకి తీసుకురావడంతో అద్వానీ అత్యంత ప్రభావశీల పాత్రను పోషించారు. 14 సంవత్సరాల వయస్సులోనే ఆరెస్సెస్ లో చేరిన అద్వానీ.. బీజేపీ వ్యవస్థాపక నాయకుల్లో ఒకరు.

రథయాత్రలో ఎల్ కే అద్వానీ (ఫైల్ ఫొటో), చిత్రంలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు.
రథయాత్రలో ఎల్ కే అద్వానీ (ఫైల్ ఫొటో), చిత్రంలో ప్రధాని మోదీ కూడా ఉన్నారు.

బీజేపీ అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి 'భారతరత్న' ఇవ్వనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రకటించారు. బీజేపీ ప్రస్తుతం ఉన్న అత్యున్నత స్థాయికి ప్రధాన కారకుల్లో ఎల్ కే అద్వానీ ఒకరు. బీజేపీలో మితవాద నాయకుడిగా ఉన్న తన సన్నిహిత మిత్రుడు వాజ్ పేయితో కలిసి ఆయన బీజేపీని దేశంలో ప్రధాన రాజకీయ శక్తిగా మలిచారు. లోక్ సభలో రెండు స్థానాలు మాత్రమే ఉన్న స్థితి నుంచి.. ఒంటరిగా ఫుల్ మెజారిటీ సాధించే స్థాయికి బీజేపీ చేరడం వెనుక అద్వానీ అచంచల కృషి చాలా ఉంది.

అద్వానీ రాజకీయ ప్రస్థానం

  • దేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు 1927 నవంబర్ 8వ తేదీన ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న సింధ్ లో ఎల్ కే అద్వానీ జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన అద్వానీ పద్నాలుగేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లో చేరారు. అక్కడే న్యాయవిద్యను కూడా అభ్యసించారు.
  • 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ స్థాపించిన జనసంఘ్ లో చేరారు. 1970లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన 1989 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1972 డిసెంబరులో భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
  • 1975 లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించిన సమయంలో అటల్ బిహారీ వాజ్ పేయితో పాటు ఎల్ కే అద్వానీ బెంగళూరులో ఉన్నారు. అక్కడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
  • 1977లో మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఉన్న జనతా పార్టీ ప్రభుత్వంలో అద్వానీ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా నియమితులయ్యారు.
  • 1980లో అటల్ బిహారీ వాజ్ పేయితో కలిసి బీజేపీని ఏర్పాటు చేశారు.
  • రథయాత్ర ద్వారా దేశ రాజకీయాల్లో బీజేపీకి స్వర్ణయుగం రావడానికి కారణమయ్యారు.
  • అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామమందిరం నిర్మించాలన్న డిమాండ్ తో సోమ్ నాథ్ నుంచి అయోధ్య వరకు రథ యాత్ర ప్రారంభించారు. ఆ యాత్రకు విశేష స్పందన లభించింది.
  • బిహార్ లో ఆ యాత్రను లాలు ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం అడ్డుకుని, అద్వానీని అరెస్ట్ చేసింది.
  • 1986-90, 1993-98, 2004-2005 మధ్య మూడు పర్యాయాలు బిజెపి జాతీయ అధ్యక్షుడిగా అద్వానీ పనిచేశారు.
  • అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో అద్వానీ నంబర్ 2 నేతగా కీలక పాత్ర పోషించారు. వాజ్ పేయి సర్కారులో ఉపప్రధానిగా, హోం మంత్రిగా సేవలందించారు.
  • అద్వానీ 1970లో రాజ్యసభకు ఎన్నికై పార్లమెంటులో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో న్యూఢిల్లీ నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలిచారు.
  • 1991లో అద్వానీ గుజరాత్ లోని గాంధీనగర్, న్యూఢిల్లీ ల నుంచి పోటీ చేసి రెండింటిలోనూ విజయం సాధించారు. చివరిసారిగా 2014లో ఆయన ప్రాతినిధ్యం వహించిన గాంధీనగర్ స్థానం నుంచి పోటీ చేశారు.
  • 2019 లో ఆయనకు ఎంపీగా పోటీ చేసే అవకాశం బీజేపీ ఇవ్వలేదు.
  • ఇటీవలి కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

IPL_Entry_Point