Bajaj Finance Q1 results: బజాజ్ ఫైనాన్స్ లాభం రెట్టింపు కంటే ఎక్కువ
Bajaj Finance Q1 results: బజాజ్ ఫైనాన్స్ లాభం జూన్ క్వార్టర్‌లో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగింది..
Bajaj Finance Q1 results: జూన్ త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ తన అత్యధిక ఏకీకృత త్రైమాసిక నికర లాభాన్ని బుధవారం నివేదించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.1,002 కోట్ల నికర లాభాన్ని ఆర్జించగా ఇప్పుడది రూ. 2,596 కోట్లకు పెరిగింది. రుణాల్లో వృద్ధి ఆదాయం పెరిగేందుకు దోహదపడింది.
మొత్తం ఆదాయం రూ. 6,743 కోట్ల నుంచి జూన్ త్రైమాసికంలో 38 శాతం పెరిగి రూ. 9,283 కోట్లకు చేరుకుందని బజాజ్ ఫైనాన్స్ బుధవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
కస్టమర్ల బేస్ జూన్ 30, 2022 నాటికి 6.03 కోట్లుగా ఉంది. క్రితం ఏడాదితో పోలిస్తే 20 శాతం వృద్ధిని సాధించింది. ఈ ఒక్క త్రైమాసికంలోనే 27.3 లక్షల కస్టమర్లు పెరిగారు.
గత ఏడాది జూన్ త్రైమాసికంలో వడ్డీ ఆదాయం రూ. 5,954 కోట్లతో పోలిస్తే ఈ జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో 33 శాతం పెరిగి రూ. 7,920 కోట్లకు చేరుకుంది. నిర్వహణలో ఉన్న ఆస్తులు 30 శాతం పెరిగి రూ. 2,04,018 కోట్లకు చేరుకున్నాయి.
బజాజ్ గ్రూపునకు చెందిన ఎన్‌బిఎఫ్‌సి విభాగం గత ఆర్థిక సంవత్సరం రుణ నష్టాల కోసం రూ. 1,750 కోట్లు కేటాయించగా ఈ త్రైమాసికంలో కేటాయింపులు రూ.755 కోట్లకు తగ్గాయని తెలిపింది. కంపెనీ నిరర్థక ఆస్తులు కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపింది. ఏకీకృత ఆదాయాలలో అనుబంధ సంస్థలు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీల ఫలితాలు ఉన్నాయి. బుధవారం బిఎస్‌ఇలో కంపెనీ షేరు 2.14 శాతం పెరిగి రూ.6,393.75 వద్ద ముగిసింది.