Gyanvapi mosque: 31 ఏళ్ల తర్వాత వారణాసి జ్ఞానవాపి మసీదులో మళ్లీ ప్రారంభమైన పూజా కార్యక్రమాలు
Gyanvapi mosque: వారణాసిలోని వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో 31 ఏళ్ల తరువాత మళ్లీ పూజలు ప్రారంభమయ్యాయి. మసీదు దక్షిణ సెల్లార్ లో హిందువులు పూజలు చేసుకోవచ్చని కోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో.. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేక పూజలు చేశారు.
puja performed at Gyanvapi mosque: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో మూడు దశాబ్దాల క్రితం నిలిపివేసిన పూజా క్రతువును తిరిగి ప్రారంభించడానికి బుధవారం కోర్టు అనుమతించింది. దాంతో, ఆ వెంటనే బుధవారం రాత్రి వారణాసిలోని జ్ఞానవాపి నిర్మాణంలోని 'వ్యాస్ తెహ్కానా' లేదా దక్షిణ సెల్లార్లో పూజలు నిర్వహించారు. ఆ తరువాత గురువారం ఉదయం కూడా మసీదు దక్షిణ సెల్లార్ లో 31 ఏళ్ల తర్వాత తొలిసారిగా తెల్లవారుజామున 3 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
31 ఏళ్ల తరువాత..
జ్ఞానవాపి మసీదులో (Gyanvapi mosque) పూజలు చేసుకునేందుకు అనుమతించాలని కోర్టును కోరిన శైలేంద్ర కుమార్ పాఠక్ వ్యాస్ తో పాటు కాశీ విశ్వనాథ్ ట్రస్టు నియమించిన పూజారిని అక్కడి ఆలయంలో పూజలు చేయడానికి ప్రాంగణంలోకి అనుమతిస్తామని వారణాసి జిల్లా జడ్జి ఏకే విశ్వేశ బుధవారం తెలిపారు. 1993 డిసెంబర్ తర్వాత తొలిసారిగా కాశీ విశ్వనాథ ఆలయానికి ఆనుకుని ఉన్న మసీదు దక్షిణ సెల్లార్లో ప్రార్థనలు తిరిగి ప్రారంభించే హక్కును వ్యాస కుటుంబానికి లభించింది.
బుధవారం రాత్రే..
బుధవారం రాత్రి 10.30 గంటలకు జ్ఞానవాపి మసీదు (Gyanvapi mosque) దక్షిణ సెల్లార్ ను తెరిచినట్లు ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు నాగేంద్ర పాండే తెలిపారు. కోర్టు ఆదేశాలను పాటించాల్సిన అవసరం ఉందని, అందుకే జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేసిందని పాండే మీడియాకు తెలిపారు. కాగా, జ్ఞానవాపి నిర్మాణంలోని 'వ్యాస్ తెహ్కానా' లేదా దక్షిణ సెల్లార్లో పూజ చేయడానికి అనుమతిస్తూ వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జ్ఞాన వాపి మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు లోనూ..
దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరుతూ అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే హైకోర్టును ఆశ్రయించాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించినట్లు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ వారికి తెలియజేశారు. అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి ట్రయల్ కోర్టు ఇప్పటికే వారం రోజుల గడువు ఇచ్చినందున అర్ధరాత్రి హడావుడిగా ఈ పనిని చేపట్టాల్సిన అవసరం లేదని మసీదు తరఫు న్యాయవాదులు వాదించారు. పిటిషనర్లతో కుమ్మక్కై అధికార యంత్రాంగం వారికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. వారణాసి జిల్లా కోర్టు ఆదేశాలను పై కోర్టుల్లో సవాలు చేసే అవకాశాలను అడ్డుకునే లక్ష్యంతో హడావుడిగా పూజలు ప్రారంభించారని విమర్శించింది.