Government employees : ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు.. ప్రకటించిన సీఎం
Government Employees special leaves : ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజుల ప్రత్యేక సెలవులను ప్రకటించింది అసోం ప్రభుత్వం. ఇందుకు ఓ కారణం ఉంది. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
అసోం ప్రభుత్వ ఉద్యోగులకు ఇక నుంచి రెండు రోజుల ప్రత్యేక క్యాజువల్ సెలవులు లభించనున్నాయి. ఉద్యోగులు తమ తల్లిదండ్రులు లేదా అత్తమామలతో సమయం గడిపేందుకు ఈ సెలవులు ఇస్తున్నట్టు అసోం ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
“నవంబర్ 6, 8 తేదీల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ సెలవులను సీఎంవో కార్యాలయం ప్రకటించింది. అయితే, తల్లిదండ్రులు లేని వ్యక్తులు సెలవులకు అర్హులు కాదు. ప్రత్యేక సెలవులను వ్యక్తిగత విశ్రాంతి కోసం ఉపయోగించకూడదు,” అని పేర్కొంది.
"ఈ సెలవు వృద్ధులైన తల్లిదండ్రులు లేదా అత్తమామలను గౌరవించడానికి, శ్రద్ధ వహించడానికి, వారితో సమయం గడపడానికి మాత్రమే ఉపయోగించాలి, వ్యక్తిగత సరదాల కోసం కాదు" అని అసోం సీఎంవో పోస్ట్ క్యాప్షన్ ఇచ్చింది.
అత్యవసర సేవల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు దశలవారీగా సెలవులు పొందవచ్చని సీఎంవో పోస్ట్ స్పష్టం చేసింది.
నవంబర్ 7న ఛత్ పూజకు సెలవు, నవంబర్ 9న రెండో శనివారం సెలవు, నవంబర్ 10న ఆదివారం సెలవులు ఉంటాయని సీఎంవో తెలిపింది.
“తల్లిదండ్రుల ఆశీస్సులు మన జీవితానికి ఎంతో అవసరం. ఆదర్శ పౌరుడిగా, మన తల్లిదండ్రుల శ్రేయస్సును చూసుకోవడం మన బాధ్యత,” అని అసోం ముఖ్యమంత్రి ఓ పోస్ట్‌లో పేర్కొన్నారు.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ 2021 లో సిఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు, అత్తమామలతో గడపడానికి రెండు ప్రత్యేక క్యాజువల్ సెలవులను ప్రకటించారు.
పనిచేసే మహిళలందరికీ 180 రోజుల చైల్డ్ అడాప్షన్ లీవ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అసోం ప్రభుత్వం నిర్ణయించింది.
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్, 1972లోని రూల్ 43-బికి అనుగుణంగా సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం తెలిపారు.
అసోం సీఎం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. ప్రస్తుతానికి ఇది అసోంలో మాత్రమే అమల్లో ఉంది. ఇతర రాష్ట్రాలు కూడా ఈ తరహా సెలవులు ప్రకటించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత కథనం