Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ కి అస్వస్థత; ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స
Amitabh Bachchan: బాలీవుడ్ నటుడు, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన కాలికి యాంజియోప్లాస్టీ నిర్వహించినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
Amitabh Bachchan: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ (81) అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, ఏ అనారోగ్య సమస్య కారణంగా అమితాబ్ బచ్చన్ ను ఆసుపత్రిలో చేర్చారనే విషయం తెలియరాలేదు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కాలిలో ఏర్పడిన సమస్య కారణంగా అమితాబ్ ను ఆసుపత్రిలో చేర్చారు. సమస్య తీవ్రమైనది కాదని, స్వల్ప చికిత్స అనంతరం అమితాబ్ ను డిశ్చార్జ్ చేయనున్నారని సమాచారం.
గుండె సమస్యతో కాదు..
అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కు కరోనరీ హార్ట్ కాకుండా పెరిఫెరల్ హార్ట్ కు చికిత్స అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా వెల్లడించింది. యాంజియోప్లాస్టీని ఆయన గుండెకు కాకుండా కాలులో గడ్డకట్టిన భాగానికి నిర్వహించినట్లు తెలుస్తోంది. తాను ఆసుపత్రిలో చేరినట్లు వార్తలు రావడానికి కొన్ని గంటల ముందు బిగ్ బి తనదైన స్టైల్ లో ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఒక పోస్ట్ పెట్టారు. సాధారణంగా, అమితాబ్ ఎక్స్ పోస్ట్ లకు నంబర్ లను కేటాయిస్తుంటారు. అలా, ఈ రోజు ఎక్స్ లో 4,950 వ పోస్ట్ పెడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఐఎస్పీఎల్ గురించి..
టి 4950 నెంబరు గల ఆ ఎక్స్ పోస్ట్ లో, "ఆంఖ్ ఖోల్కే దేఖ్ లో, కాన్ లగాకే సున్ లో, మాఝీ ముంబై కి హోగి జై జైకార్, యే బాత్ అబ్ మాన్ లో (కళ్ళు తెరుచుకుని చూడండి.. మీ చెవులతో వినండి, మాఝీ ముంబై విజయం సాధిస్తుంది). దీన్ని మీరు అంగీకరించాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని తన ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) జట్టు మాఝీ ముంబై ప్రమోషనల్ వీడియోను అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) పంచుకున్నారు. మార్చి 14న అభిషేక్ దల్హోర్ అద్భుత ప్రదర్శనతో తమిళ స్టార్ సూర్యకు చెందిన చెన్నై సింగమ్స్పై మాఝీ ముంబై 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలి ఐఎస్ పీఎల్ - టీ10 లీగ్ లో బచ్చన్ సేన ఫైనల్ కు చేరింది.
రానున్న అమితాబ్ బచ్చన్ సినిమాలు
ప్రభాస్, దిశా పటానీ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకోన్ లతో కలిసి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కనిపించనున్నారు. ఎవడే సుబ్రమణ్యం, మహానటి వంటి చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కల్కి 2898 ఏడీ' . అలాగే, టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వెట్టైయన్ చిత్రంతో తమిళంలోనూ అమితాబ్ ఆరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో రజినీకాంత్, ఫహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి తదితరులు నటిస్తున్నారు. మరోవైపు, రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం బటర్ ఫ్లై కోసం ప్లేబ్యాక్ సింగింగ్ వైపు కూడా అమితాబ్ వెళ్లాడు. ఈ చిత్రంలో పరుల్ యాదవ్, ఎల్లీ అవ్రామ్ నటించారు.