Amitabh Bachchan Wealth: అమితాబ్ బచ్చన్ ఆస్తులు రూ.1578 కోట్లు.. రూ.100 కోట్ల విలువైన నగలు, 17 లగ్జరీ కార్లు
Amitabh Bachchan Wealth: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆస్తుల చిట్టా చూస్తే షాకవ్వాల్సిందే. ఆమె భార్య జయా బచ్చన్ అఫిడవిట్ ప్రకారం ఈ దంపతుల మొత్తం ఆస్తుల విలువ రూ.1578 కోట్లు కావడం విశేషం.
Amitabh Bachchan Wealth: బాలీవుడ్ ను ఐదు దశాబ్దాలకుగాపైగా ఏలుతున్న అమితాబ్ బచ్చన్ ఆస్తుల చిట్టా బయటకు వచ్చింది. అతని భార్య జయా బచ్చన్ ఐదోసారి సమాజ్‌వాదీ పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్తున్న సందర్భంగా తమ ఆస్తులను వెల్లడిస్తూ ఆమె దాఖలు చేసిన అఫిడవిట్ తో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ దంపతుల సంపద విలువ సుమారు రూ.1578 కోట్లు అంటే నమ్మగలరా?
అమితాబ్, జయ ఆస్తులు, ఆదాయం వివరాలు
ఇండియా టుడేలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. జయా బచ్చన్ సమర్పించిన అఫిడవిట్ లో ఆమె తన వ్యక్తిగత, తన భర్త ఆదాయ వివరాలను వెల్లడించింది. 2022-23 ఏడాదికిగాను జయా బచ్చన్ రూ.1.63 కోట్లు ఆర్జించగా.. ఆమె భర్త అమితాబ్ బచ్చన్ ఏకంగా రూ.273.74 కోట్లు సంపాదించడం గమనార్హం. ఈ ఇద్దరి ఆదాయం ఒక్క ఏడాదిలోనే రూ.275 కోట్లకుపైగా ఉంది.
మంగళవారం (ఫిబ్రవరి 13) జయా బచ్చన్ రాజ్యసభ కోసం తన నామినేషన్ దాఖలు చేసింది. ఆమె 2004 నుంచి ఎస్పీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉండటం విశేషం. ఇప్పుడు ఐదోసారి కూడా ఆమెను ఆ పార్టీ ఎగువ సభకు పంపిస్తోంది. జయా దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం.. ఈ దంపతుల చరాస్తుల విలువ రూ.849.11 కోట్లు కాగా.. స్థిరాస్థుల విలువ రూ.729.77 కోట్లుగా ఉంది.
బ్యాంక్ బ్యాలెన్స్, నగలు, కార్ల చిట్టా ఇదీ
జయా బచ్చన్ బ్యాంకు బ్యాలెన్స్ రూ.10.11 కోట్లుగా ఉండగా.. అమితాబ్ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.120.45 కోట్లు. ఇక జయా బచ్చన్ దగ్గర రూ.40.97 కోట్ల విలువైన నగలు ఉన్నాయి. రూ.9.82 లక్షల విలువైన కారు కూడా ఉంది. అటు అమితాబ్ బచ్చన్ దగ్గర రూ.54.77 కోట్ల విలువైన నగలు, రూ.17.66 కోట్ల విలువైన 16 కార్లు ఉండటం గమనార్హం. అమితాబ్ దగ్గర మెర్సిడీస్, రేంజ్ రోవర్ లాంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
జయా బచ్చన్ కు ఎండార్స్‌మెంట్లు, ఎంపీ జీతం, సినిమాల రెమ్యునరేషన్ ల నుంచి ఆదాయం వస్తోంది. ఇక అమితాబ్ కు సినిమాల ఆదాయంతోపాటు వడ్డీ, అద్దె, డివిడెండ్లు, సోలార్ ప్లాంట్ ద్వారా ఆదాయం వస్తున్నట్లు అఫిడవిట్ లో వెల్లడించారు. జయా బచ్చన్ ఈ మధ్యే రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీలో మూవీలో నటించింది. మరోవైపు అమితాబ్ బచ్చన్ ప్రతిష్టాత్మక కల్కి 2898 ఏడీ మూవీలో నటిస్తున్నాడు.
దివాలా తీసి మళ్లీ ఈ స్థాయికి..
అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో ఓ పెద్ద హీరోనే. కానీ కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో ఏబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి చేతులు కాల్చుకున్నాడు. తీవ్ర నష్టాలు చవిచూసి అప్పుల పాలయ్యాడు. మళ్లీ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడీ స్థాయికి రావడం నిజంగా విశేషమే. సినిమా కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ తోపాటు సోనీ ఛానెల్లో కౌన్ బనేగా క్రోర్‌పతి ప్రోగ్రామ్ ద్వారా అమితాబ్ మళ్లీ గాడిలో పడ్డాడు.
టాపిక్