Sri Lanka Crisis : అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు పిలుపు
Sri Lanka Crisis : సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను ఆదుకునేందుకు.. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు ఆ దేశాధ్యక్షుడు విక్రమసింఘే. సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు వివరించారు.
Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభం వేళ పార్లమెంట్ సభ్యులకు లేఖ రాశారు ఆ దేశాధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే. అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు.
శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందని, అయితే.. అన్ని పార్టీల సభ్యులు, పౌర సమాజం, విద్యాసంస్థల సహాయం లేకపోతే అది జరగదని రణిల్ విక్రమసింఘే అభిప్రాయపడ్డారు. శ్రీలంక రాజ్యాంగంలో 19వ సవరణను తిరిగి తీసుకొచ్చే విషయంపై చర్చలు జరపాలని పిలుపునిచ్చారు.
"శ్రీలంకలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషిచేస్తోంది. రాజకీయం, సమాజానికి చెందిన సమస్యలు కూడా పరిష్కారమవుతాయని భావిస్తున్నాను," అని పార్లమెంట్ సభ్యులకు శుక్రవారం రాసిన లేఖలో విక్రమసింఘే పేర్కొన్నారు.
అధ్యక్షుడి అధికారాలను తగ్గించి పార్లమెంట్‌కు అధిక పవర్‌ని ఇస్తూ.. 2015లో 19ఏ చట్టం అమల్లోకి వచ్చింది. కాగా.. 2019 ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన అనంతరం.. 19ఏని పూర్తిగా తీసేశారు గొటబాయ రాజపక్స.
శ్రీలంక సంక్షోభం వేళ విక్రమసింఘేపై ఆ దేశ ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. రాజపక్స రాజీనామాతో.. ఈనెల 20న అప్పటి ప్రధాని విక్రమసింఘేను ఎంపీలు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
సంబంధిత కథనం