Sri Lanka Crisis : అర్ధరాత్రి హై టెన్షన్.. నిరసనలపై ఉక్కుపాదం!
Sri Lanka Crisis : శ్రీలంక రాజధాని కొలంబోలో నిరసనకారుల శిబిరాలను సైన్యం తొలగించేందుకు ప్రయత్నించింది. ఫలితంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Sri Lanka Crisis : శ్రీలంక సంక్షోభం వేళ రాజధాని కొలంబోలో గురువారం అర్ధరాత్రి హై టెన్షన్ నెలకొంది. కొలంబో వీధుల్లో నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలను భద్రతా సిబ్బంది తొలగించే ప్రయత్నం చేశాయి. నిరసనకారులు కొంతసేపు ప్రతిఘటించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన కొన్ని గంటల్లోనే.. నిరసనలపై రణిల్ విక్రమసింఘే ఉక్కుపాదం మోపేందుకు సిద్ధపడ్డారని వార్తలు వెలువడుతున్నాయి.
శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో ఆయుధాలు, రక్షణ కవచాలు ధరించి.. కొలంబో వీధుల్లో సైనికులు వెళుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఏప్రిల్ నెలలో నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న శిబిరాలను వారు ధ్వంసం చేశారు. నిరసనకారులు ప్రతిఘటించడంతో స్వల్ప ఘర్షణ చేటుచేసుకుంది. ఈ ఘటనలో 9మందిని పోలీసులు అరెస్ట్ చేశారు, వీరిలో ఇద్దరికి గాయాలయ్యాయి. కాగా.. తాజా ఘటనలో 50మందికిపైగా ఆందోళనకారులు గాయపడినట్టు తెలుస్తోంది.
మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సన్నిహితుడు, మాజీ ప్రధాని రణిల్ విక్రమసింఘే.. ఇటీవలే శ్రీలంక అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. నిరసనలను ఆయన అణచివేస్తారని ఆందోళనకారులు మొదటి నుంచే భావించారు. తాజాగా.. అదే నిజమైంది.
శ్రీలంక సంక్షోభం వేళ కొలంబో వీధుల్లో అర్ధరాత్రి మొదలైన కార్యకలాపాలు.. ఉదయం కూడా కొనసాగాయి. భద్రతా దళాలు కొలంబో వీధుల్లో గస్తీ కాశాయి.
సంబంధిత కథనం