Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు వెళుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..
Amarnath Yatra 2022 : మరికొన్ని రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న వేళ.. యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది జమ్ముకశ్మీర్ యంత్రాంగం. ఆ వివరాలు..
Amarnath Yatra 2022 : ఈ నెల 30న అమర్నాథ్ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. యాత్రలో భద్రతాపరమైన విషయాలపై జమ్ముకశ్మీర్ యంత్రాంగం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే యాత్రికులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
- అమర్నాథ్ యాత్ర సమయంలో ఉష్ణోగ్రతలు 5డిగ్రీల కన్నా తక్కువకు పడిపోవచ్చు. అందువల్ల యాత్రికులు ఉన్నితో తయారు చేసిన దుస్తులను తెచ్చుకోవాలి.
- గొడుగు, హీటర్, రెయిన్‌కోట్, వాటర్ ప్రూఫ్ షూ తెచ్చుకోవాలి. వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం.
- దుస్తులు ఇతర నిత్యావసర వస్తువులను వాటర్ ప్రూఫ్ బ్యాగుల్లో పెట్టుకోవాలి.
- ఐడీ కార్డులు, డ్రైవింగ్ లెసెన్సు, యాత్రకు అనుమతి పత్రాలు కచ్చితంగా ఉండాలి.
ఇవి చేయకూడదు..
- అమర్నాథ్ యాత్ర వేళ.. హెచ్చరికలు ఉన్న చోట ఆగకూడదు, వాహనాలు నిలపకూడదు.
- స్లిప్పరు వేసుకోకూడదు. ట్రెక్కింగ్ షూలు మాత్రమే ధరించాలి.
- షార్ట్ కట్స్‌తో కూడిన మార్గాల కోసం ప్రయత్నించకూడదు. అది ప్రమాదకరం. అమర్నాథ్ యాత్ర కోసం నిర్దేశించిన మార్గంలోనే ప్రయాణించాలి.
- కాలుష్యం, పర్యావరణం దెబ్బతినే విధంగా ఎలాంటి పనులు చేయకూడదు.
- ప్లాస్టిక్‌ను అస్సలు వినియోగించకూడదు. చట్టం ప్రకారం కఠిన శిక్షలు పడతాయి.
భద్రతా ఏర్పాట్లు..
Amarnath yatra security : అమర్నాథ్ యాత్ర వేళ పూంచ్ జిల్లా డిప్యూటీ కమీషనర్, డిప్యూటీ ఐజీ, సీనియర్ ఎస్పీతో కూడిన సీనియర్ అధికారులతో జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రత్యేక చర్చలు జరిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఆలయ నిర్వాహణ కమిటీ, సివిల్ సొసైటీ సభ్యులు, కోఆర్డినేషన్ కమిటీ, వ్యాపారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని వారందరు వెల్లడించారు.
అమర్నాథ్ యాత్ర నేపథ్యంలో పూంచ్ జిల్లా.. భద్రతావలయంలోకి జారుకుంది. జిల్లావ్యాప్తంగా పటిష్ట భద్రతను చేపట్టారు. ఏడీజీపీ.. పూంచ్ జిల్లాలోని పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పర్యటనలు చేపడుతున్నారు.
అమర్నాథ్ యాత్రలో అలజడులు సృష్టించేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్న నిఘా వర్గాల సమాచారంతో అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు.
సంబంధిత కథనం