Thalapathy Vijay: ‘సీఏఏ’ పై తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ స్పందన; వైరల్ అయిన ‘ఎక్స్’ పోస్ట్-actor thalapathy vijay reacts to caa notification urges tamil nadu govt to ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Thalapathy Vijay: ‘సీఏఏ’ పై తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ స్పందన; వైరల్ అయిన ‘ఎక్స్’ పోస్ట్

Thalapathy Vijay: ‘సీఏఏ’ పై తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ స్పందన; వైరల్ అయిన ‘ఎక్స్’ పోస్ట్

HT Telugu Desk HT Telugu
Mar 12, 2024 05:06 PM IST

Thalapathy Vijay: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 పై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్ స్పందించారు. సీఏఏ సవరణ చట్టాన్ని మార్చి 11న కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దీనిపై విజయ్ స్పందిస్తూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్
తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం అధినేత దళపతి విజయ్

Thalapathy Vijay reacts to CAA: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019ను కేంద్రం అమలు చేయడంపై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని పార్లమెంటు నాలుగు సంవత్సరాల కిందనే ఆమోదించింది. ఈ చట్టంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

సీఏఏ పై వ్యతిరేకత ఎందుకు?

సీఏఏ (Citizenship Amendment Act, 2019- CAA) తో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారత దేశ పౌరసత్వం లభిస్తుంది. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతర వలసదారులందరికీ ఈ చట్టం వర్తిస్తుంది. 2014 డిసెంబర్ 31కి ముందు పొరుగు ముస్లిం మెజారిటీ దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ల నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు భారత పౌరసత్వం కల్పించడానికి వీలుగా.. 1955 నాటి పౌరసత్వ చట్టాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సవరించింది. తాజాగా, ఈ పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలను నోటిఫై చేసింది. దాంతో, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుంచి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు కేంద్రం ఇప్పుడు భారత పౌరసత్వం ఇవ్వడం ప్రారంభించనుంది.

దళపతి విజయ్ ఆగ్రహం

సీఏఏ (Citizenship Amendment Act, 2019- CAA) నిబంధనలను నోటిఫై చేస్తూ, ఈ వివాదాస్పద చట్టాన్ని అమలులోకి తీసుకురావడంపై తమిళ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత దళపతి విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో భారత పౌరసత్వ సవరణ చట్టం 2019 (సీఏఏ) వంటి చట్టాన్ని అమలు చేయడం ఆమోదయోగ్యం కాదని తమిళంలో ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను విజయ్ తన ట్విటర్ అకౌంట్ లోనూ పోస్ట్ చేశారు.

అమలు చేయొద్దు..

తమిళనాడులో ఈ చట్టం (Citizenship Amendment Act, 2019- CAA) అమలు కాకుండా చూడాలని దళపతి విజయ్ (Thalapathy Vijay) తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వాన్ని కోరారు. ఈ చట్టం తమిళనాడులో అమలు కాకుండా ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా సహకరించాలన్నారు.

పార్టీ పెట్టిన తరువాత..

దళపతి విజయ్ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ఆయన చేస్తున్న తొలి రాజకీయ ప్రకటన ఇదే కావడం గమనార్హం. ఫిబ్రవరి 2న రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్ తన పార్టీ పేరు ‘తమిళగ వెట్రి కజగమ్ (TVK)’ గా ప్రకటించారు. విజయ్ కు తమిళనాడు సహా దక్షణాది రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మోదీ చివరి ప్రయత్నం

కాగా, లోక్ సభ ఎన్నికలకు ముందు సీఏఏ (Citizenship Amendment Act, 2019- CAA) నిబంధనలను నోటిఫై చేయడం ద్వారా మునిగిపోతున్న తన నౌకను కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రయత్నిస్తున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ముస్లింలకు, శ్రీలంక తమిళులకు ద్రోహం చేసిందని, తద్వారా విభజన బీజాలు నాటిందని ఆయన విమర్శించారు. డీఎంకే వంటి ప్రజాస్వామిక శక్తుల నుండి తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ, బీజేపీ మిత్ర పక్షం అన్నాడిఎంకె మద్దతుతో CAA ను ఆమోదించారని స్టాలిన్ ఆరోపించారు. ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురవుతుందనే భయంతో బీజేపీ ఇప్పటి వరకు చట్టాన్ని కోల్డ్ స్టోరేజీలో ఉంచిందని ఆరోపించారు.

Whats_app_banner