World Turtle Day । ఎప్పుడో భూమి పుట్టినపుడు పుట్టాయి.. తాబేలు జీవితకాలం తెలుసా?-world turtle day know interesting facts about tortoises ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Turtle Day । ఎప్పుడో భూమి పుట్టినపుడు పుట్టాయి.. తాబేలు జీవితకాలం తెలుసా?

World Turtle Day । ఎప్పుడో భూమి పుట్టినపుడు పుట్టాయి.. తాబేలు జీవితకాలం తెలుసా?

HT Telugu Desk HT Telugu
May 23, 2022 12:35 PM IST

World Turtle Day - Interesting Facts నువ్వు యూత్ ఏంట్రా తాతవి.. ఎప్పుడో భూమి పుట్టినపుడు పుట్టావు అని మనం సరదాగా అంటుంటాం. కానీ తాబేళ్ల విషయంలో అది నిజం. వీటి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి..

Turtle Day
Turtle Day (Pixabay)

తాబేలు జీవులన్నింటికీ తాత అని చెప్పాలి. డొప్ప ఆకారంలో దృఢమైన పైకప్పు కలిగిన ఈ జీవులు భూమి మీద అతి ప్రాచీన సరీసృపాలు. భూమిపై ఎక్కువ కాలంపాటు జీవించి ఉండే జీవులు కూడా ఇవే. ట్రయాసిక్ యుగం నుంచి తాబేళ్లలో ఎలాంటి మార్పు రాలేదు.

పర్యావరణ రూపకల్పనలో తాబేళ్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. భూమిపై ఈ జీవుల ప్రాముఖ్యతను గుర్తించడానికి ప్రతీ ఏడాది మే 23న 'ప్రపంచ తాబేలు దినోత్సవం' గా జరుపుకుంటారు. ‘ప్రతి ఒక్కరూ తాబేళ్లను ప్రేమించండి, రక్షించండి’ అనే థీమ్‌తో ఈ ఏడాది తాబేలు దినోత్సవాన్ని 'Shellebrate' చేసుకోండి అని పర్యావరణవేత్తలు పిలుపునిచ్చారు.

తాబేళ్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు

  • తాబేళ్లు ప్రపంచమంతటా ఎలాంటి వాతావరణంలోనైనా నివసిస్తాయి. భూమిపై పాకుతున్నట్లుగా నడుస్తాయి, నీళ్లలో ఈదుతాయి, నానుతాయి.
  • కొన్ని మిలియన్ల సంవత్సరాల నుంచి తాబేళ్ల ఉనికి ఉంది. భూమిపై అత్యంత వినాశకరమైన జురాసిక్ యుగం తర్వాత కూడా తాబేళ్లు మనుగడ సాధించాయి.
  • భూమిపైన ఉండే జీవజాతులలో అత్యధిక జీవితకాలం కలిగిన జీవి తాబేలే అని చెప్తారు. తాబేళ్లు సాధారణంగా 10 నుంచి 150 ఏళ్ల వరకు వరకు జీవించగలవు. కొన్ని భారీసైజు తాబేళ్లు 200 నుంచి 500 ఏళ్ల వరకు జీవించగలవని ఒక అంచనా మాత్రం ఉంది.
  • అతిపెద్ద తాబేళ్లు 450 కేజీల కంటే ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. సముద్ర తాబేళ్లు అంతకుమించి సుమారు 900 కేజీల వరకు బరువు తూగుతాయి. 8 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి.
  • తాబేలు పైన ఉండే డొప్ప దాని స్కెలిటన్ కాదు. అది వెన్నుపూస భాగాన్ని కప్పి ఉంచే ఒక కఠినమైన బాహ్య కవచం.
  • తాబేళ్లు మౌనంగా ఉండే జీవులు అని అందరూ భావిస్తారు. కానీ అవి కూడా కుక్కల్లాగా మొరుగుతాయి, కోడిలాగా కూయగలవు, పిల్లిలాగా శబ్దాలు చేయగలవు. అయితే శబ్దాలు మరీ బిగ్గరగా ఉండవు.
  • తాబేలు గుడ్లు మొగవా, ఆడవా అనేది వాతావరణం నిర్ణయిస్తుంది. వాతావరణ పరిస్థితులు కారణంగా కొన్ని గుడ్లు ఆడవిగా, కొన్ని గుడ్లు మగ తాబేళ్లుగా ఉద్భవిస్తాయి.

తాబేలును సంస్కృతంలో కూర్మము అంటారు. హిందూమతంలో ఉన్న ఇతిహాసాల ప్రకారం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం పాలకడలిని చిలికేటపుడు మందర పర్వతాన్ని కవ్వంలాగా ఉపయోగిస్తారు. ఈ కవ్వంను సముద్రంలో నిలిపేందుకు విష్ణుమూర్తి కూర్మావతారములో దానిని భరిస్తాడు.

WhatsApp channel

సంబంధిత కథనం