KB Theatres | మూడు దశాబ్దాల తర్వాత అక్కడ తొలి సినిమా థియేటర్.. ఎన్నో విశేషాలు!-women shgs launch first movie theatre in ppp mode in komaram bheem asifabad town ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kb Theatres | మూడు దశాబ్దాల తర్వాత అక్కడ తొలి సినిమా థియేటర్.. ఎన్నో విశేషాలు!

KB Theatres | మూడు దశాబ్దాల తర్వాత అక్కడ తొలి సినిమా థియేటర్.. ఎన్నో విశేషాలు!

Manda Vikas HT Telugu
Mar 14, 2022 06:49 AM IST

కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు దాదాపు 30 ఏళ్ల తర్వాత సినిమా థియేటర్ వచ్చింది. దీనిని అక్కడి మహిళలు వారి జిల్లా సమాఖ్యతో కలిసి, ఒక ప్రైవేట్ భాగస్వామి సహాకారంతో ఏర్పాటు చేశారు.

Komaram Bheem Theatres in Asifabad District
Komaram Bheem Theatres in Asifabad District (twitter)

Kumuram Bheem Asifabad | ఉత్తర తెలంగాణలోని గిరిజన జిల్లా అయిన కొమరం భీమ్ ఆసిఫాబాద్‌లోని ప్రజలు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా సినిమా చూసేందుకు ఇతర పట్టణాలకు వెళ్లలేదు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు వారి సొంత పట్టణంలోనే ఒక సినిమా థియేటర్ ప్రారంభమైంది.

గిరిజన వీరుడు, స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీం పేరు మీదుగానే 'KB థియేటర్స్' పేరుతో ఆసిఫాబాద్‌లో సినిమా థియేటర్ ప్రారంభమైంది. విశేషమేమిటంటే.. ఈ సినిమా హాలును ఎవరో ప్రైవేట్ వ్యక్తులు ప్రారంభించింది కాదు. స్వయం సహాకార బృందాలలో భాగస్వామిగా ఉన్న సుమారు 94 వేల మంది మహిళలు కలిసి మొన్న మార్చి 8న మహిళల దినోత్సవంను పురస్కరించుకొని లాంఛనప్రాయంగా ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లా పరిపాలన- గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) చొరవచూపి, పిక్చర్ టైమ్ డిజిప్లెక్స్ అనే ఒక స్టార్టప్ సహాకారంతో జిల్లాలోని జన్కాపూర్‌ గ్రామంలో ఈ 'మొబైల్' థియేటర్ ఏర్పాటు చేశారు.

ఈ థియేటర్ ఏర్పాటుకు అయ్యే ఖర్చులో అరవై శాతం జిల్లా సమాఖ్య సమకూర్చగా, మిగిలిన 40 శాతం పిక్చర్ టైమ్ భరించింది. థియేటర్ నిర్వహణ, సినిమాలను ప్రదర్శనల బాధ్యతను పూర్తిగా మహిళా స్వయం సహకార సంఘం పర్యవేక్షిస్తుండగా, ప్రదర్శనకు సంబంధించి సాంకేతిక కార్యకలాపాల నిర్వహణ బాధ్యతను పిక్చర్ టైమ్ చూసుకుంటుంది. ఈ ప్రకారంగానే ఈ థియేటర్ ద్వారా వచ్చే ఆదాయం 60 శాతం జిల్లా సమాఖ్యకు, 40 శాతం పిక్చర్ టైంకు వెళ్తుంది.

ఈ సందర్భంగా జిల్లా సమైఖ్య అధ్యక్షురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ.. 30 ఏళ్ల కిందట ఈ ప్రాంతంలో ఒక థియేటర్ ఉండేది, కాలక్రమంలో దానిని మూసి వేశారు. ఆ తర్వాత జిల్లా నుంచి ఎవరైనా సినిమా చూడాలంటే వేరే ప్రాంతాలకు 2 గంటల సుదూర ప్రయాణం చేసి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ థియేటర్ ఏర్పాటు ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఇది మహిళల స్వయం సహకార సంఘాల ఆర్థిక పురోగతికి, జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుతం KB థియేటర్స్ లో తొలి సినిమా ప్రభాస్ నటించిన 'రాధే శ్యామ్' ప్రదర్శన అవుతోంది. నిన్న ఆదివారం అన్ని షోలు హౌజ్ ఫుల్ అవడంతో, ఐదో ఆట కూడా వేశారు.

WhatsApp channel

సంబంధిత కథనం