రాతపరీక్షకు హాజరవుతున్నారా? ఈ 7 టిప్స్ పాటించండి-tips for written examination to get a job ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  రాతపరీక్షకు హాజరవుతున్నారా? ఈ 7 టిప్స్ పాటించండి

రాతపరీక్షకు హాజరవుతున్నారా? ఈ 7 టిప్స్ పాటించండి

Praveen Kumar Lenkala HT Telugu
Dec 27, 2021 12:41 PM IST

చాలా ఉద్యోగాలకు మౌఖిక పరీక్షతో పాటు, రాతపరీక్ష నిర్వహించడం సర్వసాధారణమైన విషయం. చాలా మంది అన్ని నైపుణ్యాలు కలిగి ఉన్నప్పటికీ రాతపరీక్షలో వాటిని అప్లై చేయలేకపోతుంటారు. వారికి సమాధానాలు తెలిసినప్పటికీ వాటిని రాయలేకపోతారు. దీన్ని అధిగమించడంతో పాటు మంచి మార్కులు సాధించేందుకు ఈ టిప్స్ పాటించండి

రాతపరీక్ష
రాతపరీక్ష (unsplash)

ప్రశ్నపత్రంపై పూర్తి అవగాహన

ప్రశ్నపత్రం ముందుగా క్షుణ్ణంగా పరిశీలించి, దేనికి ఎన్ని మార్కులు? దేనికి ఎంత సమయం కేటాయించవచ్చు? ఏ ప్రశ్న సమర్థవంతంగా రాయగలను? వంటి అంశాలను బేరీజు వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని ఎలాంటి ఒత్తిడి లేకుండా రాయడం మొదలుపెట్టాలి.

సమర్థంగా రాసే వాటికి తొలిప్రాధాన్యత

మీరు ఏ ప్రశ్నకు సమర్థవంతంగా, సాధికారికంగా జవాబు ఇవ్వగలరో దానిని ముందుగా రాయండి. మూల్యాంకనం చేసే వారికి మీ మొదటి జవాబు అర్థవంతంగా, విశ్లేషణాత్మకంగా, సరైనదిగా తోస్తే మీపై మంచి ఇంప్రెషన్ పడుతుంది. మిగిలిన ప్రశ్నలపై ఆటోమేటిగ్గా కాస్త సానుకూల ధోరణితో చూస్తారు. మొదటి సమాధానంతోనే బ్లఫ్ చేయాలని చూస్తే ఇక మీరు రాతపరీక్ష ఫలితాన్ని మరిచిపోవాల్సిందే.

ప్రశ్నకు తగినట్టుగా సమాధానం

ప్రశ్నకు తగినట్టుగా మీ సమాధానం ఉండాలి. ప్రశ్న ఒకటి సమాధానం మరొకటి అయితే నిర్దేశించిన మార్కుల్లో సగం కూడా రావు. ఉదాహరణకు పలానా సమస్యకు పరిష్కారం ఏంటి? అని అడిగినప్పుడు పాయింట్ల వారీగా పరిష్కారం సూచించాలే తప్ప.. మీ వద్ద సమాధానం లేదని, కేవలం ఆ సమస్య ఏంటో వివరిస్తూ పోతే మార్కులు పడవు. పరిష్కార మార్గాలు రెండు మూడు సూచించినా మీకు మంచి మార్కులు పడతాయి తప్ప పరిష్కార మార్గాలు లేని ఆ సమాధానం మీరు ఎంత రాసినా వృథా ప్రయాసే అవుతుంది.

నాణ్యతే ముఖ్యం..

విశ్లేషణాత్మక సమాధానమైతే మీరు పాయింట్ల వారీగా సబ్ హెడింగ్స్‌తో మీ సమాధానం రాస్తే మంచి మార్కులు సాధిస్తారు. మూల్యాంకనం చేసే వారు క్వాలిటీ చూస్తారు తప్ప క్వాంటిటీ చూడరని గమనించాలి.

అవగాహన లేదని రాయడం సరికాదు..

మీకు కొన్ని అంశాలపై అవగాహన లేనప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం వదిలేయడం బెటర్. సమయం సరిపోలేదేమో అని భావిస్తారు. లేదంటే మీకు తెలిసిన వరకు కొంత మేర అర్థవంతంగా రాయడం మేలు చేస్తుంది. కానీ నాకు సంబంధిత అంశంపై అవగాహన లేదని రాయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీకు అన్ని అంశాలపై అవగాహన ఉండి తీరాల్సిన ఉద్యోగాలు కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు ఇంకొక నిపుణుడికి బదులుగా మీరు ఆ విభాగంలో పనిచేయాల్సి వస్తుంది. మీరు ఒక అంశంలో నిపుణులైనప్పటికీ.. మీ పనితో సంబంధం ఉన్న విభిన్న విభాగాల బేసిక్స్ తెలిసి ఉండడం మేలు. అందుకే ప్రశ్నపత్రంలో అవి ఇస్తారని గమనించాలి.

నిజాయతీగా ఉండాలి..

మీ జవాబు నిజాయతీగా ఉండాలి. మీరు పరీక్ష ఆన్‌లైన్‌లో రాయాల్సి వస్తే కాపీ కొట్టకండి. ఉదాహరణకు మిమ్మల్ని తర్జుమా చేయమని అడిగితే మీరు ట్రాన్స్‌లేషన్ టూల్స్ ఉపయోగించి చేస్తే మీరు ఇట్టే దొరికిపోతారు. మూల్యాంకనం చేసేవారు మీకంటే తెలివిగా వ్యవహరిస్తారన్న సంగతిని మరిచిపోకండి. ఈ ఒక్క కారణంతో మీరు పరీక్ష ఎంత బాగా రాసినప్పటికీ మీరు సెలెక్ట్ కారు.

సమయ పాలన

మీరు ఆన్ లైన్‌లో పరీక్ష రాసినప్పుడు కచ్చితంగా సమయ పాలన పాటించాలి. మీకు రెండు గంటల సమయం ఇచ్చినప్పుడు రెండున్నర గంటల్లో పూర్తి చేసి పంపిస్తే మొదటికే మోసం వస్తుంది. మీరు పరీక్ష ఎంత సమగ్రంగా, అర్థవంతంగా రాసినప్పటికీ, మీ వ్యక్తిత్వాన్ని, సమయపాలనను బేరీజు వేసి మూల్యంకనం చేసే అవకాశం ఉన్నందున మీరు తదుపరి మౌఖిక పరీక్షకు ఎంపిక కాకపోవచ్చు. అందువల్ల కచ్చితమైన సమయ పాలన పాటించాలి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్