Zero Oil Samosa | చుక్క నూనె ఉపయోగించకుండా సమోసాలను ఇలా చేసేయొచ్చు! -prepare tasty samosa without a drop of oil recipe inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Zero Oil Samosa | చుక్క నూనె ఉపయోగించకుండా సమోసాలను ఇలా చేసేయొచ్చు!

Zero Oil Samosa | చుక్క నూనె ఉపయోగించకుండా సమోసాలను ఇలా చేసేయొచ్చు!

HT Telugu Desk HT Telugu
Jun 14, 2022 08:14 PM IST

సాధారణంగా సమోసాలను నూనెలో డీప్ ఫ్రై చేస్తారు. కానీ అసలు నూనె ఏమాత్రం ఉపయోగించకుండా అదే టేస్టుతో సమోసాలను చేయవచ్చునని మీకు తెలుసా? ఆ రెసిపీని ఇక్కడ ఇచ్చాము, మీరూ ఓ సారి ట్రయల్ వేయండి.

Zero Oil Samosa Recipe
Zero Oil Samosa Recipe (Unsplash)

సమోసా అంటే చాలా మందికి ఇష్టమైన స్నాక్స్. అయినప్పటికీ ఆయిల్ ఫుడ్ అని తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. మార్కెట్‌లో లభించే సమోసాలు అసలు తనకపోవడమే మంచిది. నూనెలో డీప్ ఫ్రై చేసినవి ఏవైనా నోటికి రుచికరంగానే అనిపిస్తాయి. కానీ ఇందులో కేలరీలు భారీగా ఉంటాయి. ఇవి తింటే అనేక అనారోగ్య సమస్యలను భరించాల్సి ఉంటుంది. ఊబకాయం వస్తుంది, బరువు పెరుగుతారు. హృదయ సంబంధ సమస్యలు తలెత్తుతాయి.

సినిమా హీరోయిన్లు , మోడల్స్, ఫిట్‌నెస్ ప్రియులు తమ ఆహార కోరికలను అదుపు చేసుకుంటారు. వారు రెండు సమోసాలు తినాలనుకుంటే అందులో ఎన్ని కేలరీలు ఉంటాయో తెలుసుకొని అందుకు తగినట్లుగా ముందుగానే కేలరీను కరిగించేలా భారీగా వ్యాయామాలు చేసి అప్పుడు తింటారు. మరి ఇంత తతంగం ఎందుకు అసలు ఏమాత్రం నూనె ఉపయోగించకుండా సమోసా తయారు చేసుకుని తింటే ఎలాంటి సమస్య ఉండదు. ఇది ఎలా అనుకుంటున్నారా? సాధారణంగా సమోసాలను డీప్ ఫ్రై చేస్తారు, కానీ మరో పద్ధతిలో తయారు చేసుకుంటే అసలు నూనె ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ రెసిపీని ఇక్కడ ఇస్తున్నాం ప్రయత్నించి చూడండి.

జీరో ఆయిల్ సమోసా తయారీకి కావలసిన పదార్థాలు

  • 1 కప్పు మైదా పిండి
  • 2-3 ఉడికించిన బంగాళదుంపలు,
  • పనీర్ (ఐచ్ఛికం)
  • 1/2 టీస్పూన్ కారం
  • 1/2 టీస్పూన్ ధనియాల పొడి
  • 1/4 టీస్పూన్ గరం మసాలా పొడి
  • 1/4 టీస్పూన్ చాట్ మసాలా
  • కొత్తిమీర
  • ఉప్పు తగినంత

తయారీ విధానం

  1. మొదటగా ఒక పెద్ద గిన్నెలో మైదాపిండి, ఉప్పు వేసి కొన్ని నీరు పోసుకొని కలపండి. పిండి పలుచగా కాకుండా, గట్టిగా కాకుండా ముద్దగా చేయండి.
  2. ఇప్పుడు సమోసాలో స్టఫ్ చేసే మిశ్రమం కొరకు మరొక ఒక గిన్నెలో ఉడికించిన బంగాళదుంపలు, కారం, చాట్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి చక్కగా కలపండి.
  3. ఇప్పుడు పిండిని చిన్న చిన్న బాల్స్‌లా చేసి అందులో ఆలుగడ్డ మిశ్రమం చుట్టి సమోసా ఆకృతిలో త్రిభుజాకారంలో మడవండి.
  4. ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్‌లో కొద్దిగా ఉప్పు వేసి అందులో జాలిలాంటి స్టాండ్ ఉంచి పది నిమిషాలు పాటు తక్కువ మంట మీద వేడిచేయండి.
  5. అప్పటి వరకు ఒక ప్లేట్‌పైన నెయ్యిని పూసి దానిపై సిద్ధం చేసుకున్న సమోసాలను ఉంచండి.
  6. ఇప్పుడు ఈ ప్లేట్‌ను కుక్కర్‌లోని మెష్ స్టాండ్‌పై ఉంచి 15 నుండి 20 నిమిషాలు పాటు తక్కువ వేడిచేయండి.

ఇప్పుడు తెరిచి చూస్తే కరకరలాడే రుచికరమైన సమోసాలు సిద్ధం అయినట్లే. వేడివేడిగా సర్వ్ చేసుకోండి. కాఫీ, టీలతో కమ్మగా ఆస్వాదించండి.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్