Monday motivation: అధైర్యంతో బలహీనపడకండి.. ఆత్మస్థైర్యంతో లక్ష్య సాధనకై పరుగులు తీయండి..
Monday motivation: మనలో ఉన్న ఆలోచనలే మనల్ని బలహీనులుగా, బలవంతులుగా మారుస్తాయి. వాటిని అర్థం చేసుకుని లక్ష్య సాధన కోసం మన ఆలోచన విధానం ఎలా ఉండాలో తెల్సుకోండి.
ఏనుగును కట్టేయడానికి మావటి వాడు పెద్ద పెద్ద ఇనుప గొలుసులు వాడడు. ఏనుగు కాలికి చిన్న తాడు కట్టి దాన్ని చెట్టుకో, స్తంబానికో ముడేస్తాడు. కానీ ఏనుగు ఆ తాడును తెంచుకునే ప్రయత్నమే చేయదు. మావటి వాడి నుంచి దూరంగా పరిగెత్తదు. దానికి కారణం ఏనుగులో స్థిరపడిన ఆలోచన. ఏనుగు చిన్న వయసులో ఉన్నప్పుడు ఒక చిన్న తాడుతో దాన్ని కట్టేస్తారు. అప్పుడది పారిపోలేదు. పెద్దయ్యాక కూడా దాంతోనే కట్టేసినా దాన్నుంచి తప్పించుకోవచ్చనే ఆలోచన ఏనుగుకు రాదు. ఆ తాడును తెంచుకుని పారిపోవడం అసాధ్యం అనే ఆలోచనలోనే ఉంటుంది.
ఏనుగు కాళ్లల్లో ఉండే బలం ముందు ఆ చిన్న తాడు ఏపాటిది. కానీ అపనమ్మకం వల్ల ఏనుగుంతటి బలశాలి కూడా చిన్న తాడును తెంచుకోలేకపోతుంది. వాటిని తాను విడదీయలేని సంకెళ్లు అని ఊహించుకుంటుంది. చిన్న అపనమ్మకం మన బలాన్ని మర్చిపోయేలా చేస్తుంది. స్వతంత్రాన్ని హరిస్తుంది. ఏనుగు లాగే మనం కూడా ఎప్పుడో ఒకసారి అపజయం పాలయ్యామని దాన్ని ప్రయత్నించడం ఆపకూడదు. ఓడిపోతామనే భయం ఏనుగు కాలికున్న తాడు లాంటిది. బలం లేని తాడుకు మీ ఆలోచన తోడై మీ ఎదుగుదలకు, విజయానికి పెద్ద ఆటంకంగా మారుతుంది.
ఒక విషయం గురించి ఏం ఆలోచిస్తే అదే జరుగుతుందట. ఒక పనిని చేయగలం అని గట్టిగా నమ్మితే దానికి కావాల్సిన శక్తి ఎలాగైనా వస్తుంది. అసాధ్యమని నమ్మితే ఉన్న శక్తి పోతుంది. చెడు జరుగుతుంది అని ముందుగానే భయపడితే చెడు మాత్రమే జరుగుతుంది. అంతా మంచే జరగాలని విశ్వసిస్తే ఆశించిన ఫలితం ఉంటుంది.
కత్తి గాయ పరచలేని, అగ్ని వేడికి దహనం కాని మనసు.. ఇతరుల మాటల వల్ల, చెడు ఆలోచనల వల్ల బలహీనంగా మారుతుంది. అందుకే మీ బలాలను నమ్మి ముందుకెళ్లండి. పరీక్షలైనా, ఆర్థిక సమస్యలైనా, ఆరోగ్య సమస్యలైనా మీ పట్టుదలతో పరిష్కరించుకోవచ్చు. గట్టి నమ్మకంతో క్యాన్సర్ వంటి రోగాల్ని కూడా జయించవచ్చు. అధైర్యపడితే కడుపునొప్పితో కూడా చనిపోవచ్చు.
అందుకే మీరనుకున్న పని సఫలం అవ్వడానికి ఎన్ని మార్గాలున్నాయో ఆలోచించండి. మీ ప్రయత్నం మీద నమ్మకంతో ఉండండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచేందుకు ధ్యానం, యోగా, వ్యాయామాలు చేయండి. వీటివల్ల శారీరకంగా కాక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీకంటూ ఏ పని చేసినా ఒక స్పష్టత ఉంటుంది. కార్య సాధనలో ఉత్సాహంగా ముందుకెళ్లగలుగుతారు. కాబట్టి మీ వెనకాలే మీ దారిలో వచ్చే అడ్డంకుల్ని చూసి భూతమనుకుని భయపడకండి. మీ నీడే అనుకుని ముందుకు కదలండి.
ఆల్ ది బెస్ట్..