యూజ్ బై, బెస్ట్ బిఫోర్, ఎక్స్పైరీ తేదీల మధ్య తేడాలేంటి? గడువు దాటితే ఏమవుతుంది?-know all about use by best before and expiry dates on various products ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  యూజ్ బై, బెస్ట్ బిఫోర్, ఎక్స్పైరీ తేదీల మధ్య తేడాలేంటి? గడువు దాటితే ఏమవుతుంది?

యూజ్ బై, బెస్ట్ బిఫోర్, ఎక్స్పైరీ తేదీల మధ్య తేడాలేంటి? గడువు దాటితే ఏమవుతుంది?

Manda Vikas HT Telugu
Dec 28, 2021 02:45 PM IST

ప్యాక్ చేయబడిన ఆహారపదార్థాల పైన యూజ్ బై (Use by) లేదా బెస్ట్ బిఫోర్ (Best Before) అని ఉంటుంది. దాని అర్థం ఆ తేదీ దాటిన తర్వాత వాటిని వినియోగించకూడదు, ప్రమాదం అని కాదు. ఆ పదార్థం ప్యాకింగ్ చేసేటపుడు ఏదైతే తాజాగా ఉంటుందో ఆ తేదీ దాటిన తర్వాత తిరిగి అంతే ఫ్రెష్ ఉండదని అక్కడ అర్థం.

Representational Image
Representational Image (File Photo)

మార్కెట్లో మనం వివిధ రకాల కిరాణా వస్తువులను కొంటున్నప్పుడు ప్రతీ వస్తువుపై లేబులింగ్ చేసి ఉంటుంది. దానిపై ఎక్స్‌పైరీ డేట్, బెస్ట్ బీఫోర్, యూజ్ బై, సెల్ బై అని ఇలా ఒక్కో వస్తువుపై ఒక్కోలా రాసి ఉంటుంది. మరీ ఆ వస్తువుపై ఇచ్చిన డేట్ మించిపోతే ఏమవుతుంది? ఉదాహరణకు ఒక బ్రెడ్ ప్యాకెట్ పై 'బెస్ట్ బిఫోర్' అని ఒక తేదీ రాసి ఉంటుంది. అయితే సాధారణంగా ఎవరూ కూడా ఈ తేదీ ఏంటి? ఎప్పటివరకు ఉంటుంది? అంటూ చూసుకుంటూ తినరు. అది తాజాగా ఉందనిపిస్తే తీసుకుంటారు. ఇలా తీసుకున్నంత మాత్రాన ఆరోగ్యంలో ఏదైనా మార్పు ఉంటుందా అంటే.. దాదాపు ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.

ప్యాక్ చేసిన ఆహారపదార్థాలపై యూజ్ బై (Use by) లేదా బెస్ట్ బిఫోర్ (Best Before) అని ఉంటుంది. దాని అర్థం ఆ తేదీ దాటిన తర్వాత వాటిని వినియోగించకూడదు, ప్రమాదం అని కాదు. ఆ పదార్థం ప్యాకింగ్ చేసేటపుడు ఏదైతే తాజాగా ఉంటుందో ఆ తేదీ దాటిన తర్వాత తిరిగి అంతే ఫ్రెష్ ఉండదని అక్కడ అర్థం. మామూలుగా ఏవైనా పదార్థాలకు సంబంధించి వినియోగదారులకు ఏవి తాజావి, ఏవి కొత్తవి అని తెలుసుకోటానికి ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి కంపెనీలకు అలాంటి మార్గదర్శకాలు నిర్దేశిస్తారు.

మార్కెటింగ్ ట్రిక్స్.. 

అలాగే కొన్ని వస్తువులపై ఎప్పుడు తయారు చేశారు (Manufacture Date), అది ఎప్పటివరకు వాడేసేయాలి (Use by) అని ముద్రించి ఉంటుంది. అయితే ఏదైనా వస్తువు దాని కాలపరిమితి దాటిపోయింది అంటే అది పూర్తిగా పాడైపోయింది, ఇక వినియోగించకూడదు అని కాదు. అందులో కంపెనీల మార్కెటింగ్ ట్రిక్ కూడా ఉంటుంది. ఇచ్చిన తేదీ దాటిపోగానే మళ్ళీ వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు కాబట్టి వాళ్లకు సేల్స్ ఎక్కువ జరుగుతాయని కొన్ని కంపెనీలు ఇలాంటి మార్కెటింగ్ ట్రిక్‌ను అనుసరిస్తాయి. మీరు ఏదైనా సూపర్ మార్కెట్‌కు వెళ్లి గమనిస్తే కొన్ని రకాల వస్తువులపై వాటి యూజ్ బై తేదీలను సూచించే చోట పైనుంచి కొత్త స్టిక్కర్లను కొత్త తేదీలతో అతికించి ఉంచడం మీరు గమనించవచ్చు.

స్టోర్ చేసుకునే విధానమే ముఖ్యం.. 

మన ఇండ్లల్లో కూడా తాతాల కాలం నుంచే కారం, పసుపు, చింతపండు అని ఎన్నో రకాల పదార్థాలను ఒకేసారి కొనుగోలు చేసి వాటినే భద్రంగా దాచుకొని సంవత్సరాల పాటు వాడటం మనకు తెలుసు. వాస్తవానికి ఏ పదార్థమైనా, వస్తువైనా మనం భద్రపరుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఉప్పులాంటి పదార్థాలను సంవత్సరాల కొద్దీ వాడుకోవచ్చు. ఆవకాయ, డ్రైఫ్రూట్స్ లాంటివి కూడా సరిగ్గా భద్రపరిస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. దీని ప్రకారం ఇక్కడ ఎక్స్‌పైరీ డేట్ అనేది ముఖ్యం కాదు, అలా అని కాలపరిమితి మించిన వాటిని కూడ వాడేయమని కాదు. ఏదైనా వస్తువు చెడిపోయింది అంటే నిల్వచేసిన తీరు, దాని నుంచి వచ్చే వాసన, స్వభావాన్ని బట్టి మనం పసిగట్టవచ్చు.

ఔషధాలకు వర్తించదు.. 

ఇదిలా ఉంటే మెడిసిన్ పై కూడా ఎక్స్‌పైరీ తేదీ ఉంటుంది, మెడిసిన్ విషయంలో మాత్రం ఎక్స్‌పైరీ తేదీలపై ఎలాంటి ప్రయోగాలు చేయకండి. వాటితో రిస్క్ చాలా ఎక్కువ. ఆరోగ్యంతో చెలగాటం ఎందుకు? వీలైనంత వరకు ఎప్పటికప్పుడు కొత్తగా తెచ్చుకొని వాడటమే అన్ని విధాల శ్రేయస్కరం.

 

WhatsApp channel

సంబంధిత కథనం