Gas Cylinder Tips : వంట గ్యాస్ ఎక్కువ రోజులు వచ్చేందుకు చిట్కాలు.. ఇలా చేస్తే చాలు
Gas Cylinder Saving Tips : రోజురోజుకు గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. మధ్యతరగతి వాళ్లు ఈ ధరలు చూసి వామ్మో అనుకుంటున్నారు. అందుకే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే వంట గ్యాస్ ఎక్కువ రోజులు వస్తుంది.
రోజువారీ జీవితంలో గ్యాస్ సిలిండర్ ఒక ముఖ్యమైన అంశంగా మారింది. గ్రామాల్లో కట్టెల పొయ్యిలు ఉన్నా.. గ్యాస్ వాడకమే ఎక్కువైంది. ఇక నగరాల్లో నివసించే ప్రజలు సిలిండర్లు లేకుండా తమ జీవితాన్ని ఊహించలేరు. గ్యాస్ అయిపోతే.. ఏం చేయాలో అర్థంకాక ఆందోళన చెందుతారు. రోజురోజుకు గ్యాస్ ధర పెరుగుతూనే ఉంది. అలాంటి వాతావరణంలో గ్యాస్ సిలిండర్‌ను చాలా తక్కువగా వాడాలి. మీరు దాని కోసం వంట చేయకూడదని మేం చెప్పడం లేదు. పొదుపుగా ఎలా ఉపయోగించాలో తెలుసుకోవాలి.
గ్యాస్ స్టవ్‌లోని బర్నర్‌ను ఎప్పుడూ శుభ్రంగా, మురికి లేకుండా ఉంచాలి. మురికి ఉంటే గ్యాస్ అడ్డుపడి సమస్యలను కలిగిస్తుంది. మంట చిన్నగా వస్తుంది. గ్యాస్ మాత్రం ఖాళీ అవుతూనే ఉంటుంది. బర్నర్ మురికిగా ఉంటే గ్యాస్ లీకేజీ అయ్యే అవకాశం కూడా ఉంది. దీని వల్ల సిలిండర్ కూడా త్వరగా అయిపోతుంది. గ్యాస్ స్టవ్ బర్నర్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
కొంతమంది ఉదయాన్నే త్వరగా త్వరగా పని అయిపోవాలని చూస్తారు. పాత్రలు శుభ్రం చేసిన వెంటనే వంట చేసేందుకు వస్తారు. తడి పాత్రలతో వంట చేస్తుంటారు. రాత్రి తోమేందుకు ఉంచిన పాత్రలు మరుసటి రోజు ఉదయం హడావుడిగా శుభ్రం చేసి, వంటకు ఉపయోగించండి. తడి గిన్నె ఆరేందుకు 2 నుండి 4 నిమిషాలు పట్టవచ్చు. ఇలా ఒక రోజు అయితే సర్లే అనుకోవచ్చు. కానీ రోజు ఇదే రిపీట్ అయితే మాత్రం.. చాలా గ్యాస్ వేస్ట్ అవుతుంది. ఇలా రోజూ చేస్తే సిలిండర్ ఖాళీ అవుతుంది.
వండేటప్పుడు పైన మూత పెట్టాలి. కూరగాయలు వండాలన్నా, అన్నం వండాలన్నా, మూత పెడితే త్వరగా ఉడుకుతుంది. పైన మూత తీసి మీరు ముచ్చట్లు పెట్టేందుకు వెళితే.. అది ఉడికేందుకు టైమ్ తీసుకుంటుంది. కావాలనుకుంటే కుక్కర్‌ని కూడా ఉపయోగించవచ్చు.
మనకు ఉన్న పెద్ద అలవాటు.. వంటకు కావాల్సిన సామాగ్రి అంత ఫ్రిజ్‍లో పెట్టడం. ఇలా వంటకు కావాల్సిన వస్తువులు ఫ్రిజ్ లో ఉంటే ముందుగా బయటకు తీయాలి. పూర్తిగా కూల్ పోయిన తర్వాత వంటకు ఉపయోగించవచ్చు. అవి కూల్‍గా ఉంటే వేడి అయ్యేందుకు టైమ్ తీసుకుంటుంది. ఇది కూడా గ్యాస్ అయిపోవడానికి ఓ కారణమే.
వండడానికి ముందు బియ్యం, పప్పులు నానబెట్టాలి. అలా నానబెట్టి వండితే అన్నీ చాలా త్వరగా ఉడుకుతాయి. ఇది సిలిండర్‌ను ఆదా చేస్తుంది
మీరు ఉపయోగించే పాన్ కూడా గ్యాస్ ఆదా చేస్తుంది. అది ఎలాగంటే.. ఒకవేళ మీరు ఫ్లాట్ పాన్ ఉపయోగిస్తే, గ్యాస్ సమానంగా వ్యాప్తి చెందుతుంది. వేడి అంతటా వ్యాపిస్తుంది. వండాల్సిన ఆహారం సులభంగా, త్వరగా ఉడుకుతుంది. బోలు పాత్ర అయితే దిగువ మాత్రమే కాలిపోతుంది. కింద మాత్రమే ఎక్కవగా ఉడుకుతుంది. పైకి వచ్చేందుకు టైమ్ పడుతుంది. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీ వంట గ్యాస్ సేవ్ చేసుకోవచ్చు.