Asthma during Diwali: దీపావళి వచ్చేస్తోంది, ఆస్తమా ఉన్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే-essential precautions for asthma sufferers safeguard your lungs during diwali ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Asthma During Diwali: దీపావళి వచ్చేస్తోంది, ఆస్తమా ఉన్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

Asthma during Diwali: దీపావళి వచ్చేస్తోంది, ఆస్తమా ఉన్న వారు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

HT Telugu Desk HT Telugu
Nov 08, 2023 12:38 PM IST

Asthma during Diwali: ఉబ్బసం, ఆస్తమా తదితర శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి దీపావళి అంటే భయానకమైన రోజు. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి దీపావళి రోజున ఎన్నో ఇబ్బందులు వస్తాయి. బాణాసంచా కాల్చడం వల్ల వచ్చే పొగ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

దీపావళి బాణాసంచా పొగతో శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి
దీపావళి బాణాసంచా పొగతో శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలి

దీపాల పండుగ అంటే భారతదేశంలో ఘనంగా జరుపుకునే వేడుక. పిల్లలు, పెద్దలు ఈ పండుగ కోసం ఎంతో ఎదురు చూస్తారు. ఆ రోజున బాణాసంచా పేలుళ్లతో ఆకాశం మిరుమిట్లు గొలుపుతుంది. అయితే ఉబ్బసం రోగులకు, శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారికి మాత్రం దీపావళి అంటే భయానకమైన రోజునే చెప్పుకోవాలి. శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి దీపావళి రోజున ఎన్నో ఇబ్బందులు వస్తాయి.

బాణాసంచా కాల్చడం వల్ల వచ్చే పొగ వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఊపిరి ఆడనివ్వదు. శబ్ద కాలుష్యం కూడా ఇబ్బంది పెడుతుంది. అసలే శీతాకాలం వల్ల ఇబ్బంది పడే ఆస్తమా రోగులు ఈ దీపావళి బాణాసంచా పొగతో మరింతగా ఇబ్బంది పడతారు. దీపావళి ముగిశాక కూడా రెండు, మూడు రోజులు పాటు గాలిలో ఆ బాణాసంచా నుంచి విడుదలైన రసాయనాల ప్రభావం ఉంటుంది. అందుకే ఆస్తమా వ్యాధి ఉన్నవారు దీపావళి పండుగకు ముందుగానే సిద్ధం అవ్వాలి. ఆరోజు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

శ్వాసకోశ వ్యాధులు ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఉబ్బసం అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని ఇబ్బంది పడుతున్న దీర్ఘకాలిక శ్వాస కోశ పరిస్థితి. ఈ వ్యక్తులకు ముక్కు నుండి గాలి.. ఊపిరితిత్తులు చేరే మార్గం చాలా సున్నితంగా ఉంటుంది. కాలుష్య కారకాల వల్ల ఆ వాయు మార్గాలు ఇన్‌ఫ్లమేషన్‌కు గురై సంకోచించి ఇరుకుగా అవుతాయి. దీనివల్ల వారికి ఊపిరి ఆడనట్టు అవుతుంది. ఆస్తమా వ్యాధిగ్రస్తులు దీపావళి సమయంలో బాణ సంచాను కాల్చడం మానుకోవాలి. అలాగే మరికొన్ని జాగ్రత్తగా తీసుకోవాలి.

1. బాణాసంచా కాల్చేందుకు ఎక్కువ మంది గుమిగూడిన ప్రదేశాలకు ఆస్తమా రోగులు వెళ్లకూడదు. విశాలమైన రోడ్లలోనే ప్రయాణించాలి. గాలి కాలుష్యం అధికంగా ఉందనిపిస్తే ఇంట్లోంచి బయటికి రాకపోవడమే మంచిది.

2. దీపావళి రోజున వీలైనంతవరకు ఇంట్లోనే మీకు ఇష్టమైన వారితో గడపండి. వాయు కాలుష్యానికి దూరంగా ఉండండి. కిటికీలు తలుపులు అన్నీ మూసే ఉంచుకోండి. లేకుంటే బాణాసంచాలోని రసాయన మిశ్రమాలు మీ ఇంట్లోని గాలిలో కూడా కలిసే అవకాశం ఉంది.

3. పండుగ రోజు ఎన్95 వంటి మాస్కులను ధరించండి. అవి సూక్ష్మ కణాలు కూడా ముక్కును చేరకుండా అడ్డుకుంటాయి. కాలుష్య కారకాలను ఫిల్టర్ చేస్తాయి. ఫిల్టర్ చేయని గాలిని పీల్చుకుంటే మీకు ఆస్తమా ట్రిగ్గర్ అయ్యే అవకాశం ఉంది. మాస్క్ కాస్త తడిగా మారిందని అనిపిస్తే వెంటనే మార్చేయండి.

4. దీపావళి రోజున బయట తిరగడం పూర్తిగా మానేయండి. ఆ రోజున గాలి నాణ్యత చాలా తక్కువగా ఉంటుంది. బయట చేసుకోవాల్సిన పనులను ఉదయం 10 లోపే పూర్తి చేసుకుని ఇంటికే పరిమితం అవ్వండి. మరుసటి రోజు కూడా బయటికి వెళ్లే పనులను పెట్టుకోకండి.

దీపావళి రోజు ఇంట్లో పూజలు, పునస్కారాల పేరుతో ధూపాలు వేయడం, అగరబత్తులు వెలిగించడం చేస్తూ ఉంటారు. ఇవి కూడా ఆస్తమా రోగులకు చాలా ప్రమాదకరమైనది. వాటికి కూడా దూరంగా ఉంటే మంచిది. మీరు ఉన్న ప్రదేశంలో ఖచ్చితంగా ఎయిర్ ప్యూరిఫైయర్‌ని పక్కనే పెట్టుకోండి.

మీరు ఉండే గది కిటికీలు పూర్తిగా మూసి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. రెండు మూడు రోజుల వరకు గది కిటికీలు తీయకపోవడమే మంచిది. దోమలను తరిమేసే మస్కిటో రిపెల్లెంట్లు కూడా వాడకండి. ఇవి కూడా ఆస్తమా దాడిని ప్రేరేపించే బలమైన ట్రిగ్గర్‌లగానే చెబుతారు.

Whats_app_banner