Relationship Tips। మీరు ప్రేమలో ఉన్నారా? మీది నిజమైన ప్రేమ అయితే ఇలాంటివి సహించకండి!
Relationship Tips: మీ భాగస్వామిపై మీకు అపారమైన ప్రేమ ఉన్నప్పటికీ, మీ బంధం ఎక్కువ కాలం కొనసాగాలంటే పొరపాటున కూడా మీ భాగస్వామి నుంచి కొన్ని చర్యలను స్వాగతించకూడదు నిపుణుల సలహాలు ఇక్కడ తెలుసుకోండి.
Relationship Tips: ప్రేమలో ఉన్న వ్యక్తులు ఒకరి కోసం మరొకరు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. భాగస్వామికి నచ్చిన బట్టలు వేసుకోవడం దగ్గర్నుంచీ.. ఏదైనా తినడం, తాగడం వరకు ప్రతీది వారికి నచ్చినట్లుగానే ఫాలో అవుతుంటారు. ఈ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా కొంతమందికి నచ్చదు. చిన్నచిన్న గొడవలే చిలికి చిలికి పెద్ద గొడవలుగా మారతాయి. మీకు నిద్రలేకుండా చేస్తాయి, చివరకు ఇదే బంధం విడిపోవడానికి కూడా దారితీస్తుంది. ఈరోజుల్లో భార్యభర్తల సంబంధానికే గ్యారెంటీ లేకుండా పోతుంది. ఇక పెళ్లికి ముందే ప్రేమ, సహజీవనం, డేటింగ్ అంటూ పోతే అది మీ జీవితాన్ని పూర్తిగా తలకిందులు చేయవచ్చు.
అయితే, అందరూ అలాగే ఉంటారని కాదు, అందరి పరిస్థితులు ఒకేలా ఉంటాయని కాదు. కానీ, మొదటి నుంచి ఎవరి జాగ్రత్తలో వారుండటం ఏ బంధానికైనా శ్రేయస్కరం.
మీ భాగస్వామిపై మీకు అపారమైన ప్రేమ ఉన్నప్పటికీ, మీ బంధం ఎక్కువ కాలం కొనసాగాలంటే పొరపాటున కూడా మీ భాగస్వామి నుంచి కొన్ని చర్యలను స్వాగతించకూడదు, కొన్నింటిని సహించకూడదు. నిపుణుల సలహాలు ఇక్కడ తెలుసుకోండి.
మిమ్మల్ని నియంత్రించడాన్ని సహించవద్దు
మీ భాగస్వామి మీరు వేసుకునే బట్టల దగ్గర్నించీ, మీరు ఎవరితో ఎలా ఉండాలి, ఏం తినాలి వంటి విషయాలన్నింటిని నియంత్రిస్తుంటే, మీకు సంబంధించిన విషయాలన్నింటికీ వారిదే నిర్ణయాధికారం అయితే, మీ జీవితం మీ చేతుల్లో లేనట్లే. మరో విధంగా చెప్పాలంటే, మీరు వారి ప్రేమలో ఉన్నారనడం కంటే వారి నియంత్రణలో ఉన్నారనేది నిజం. వారి ధోరణిని కొన్నాళ్ల పాటు మీరు అనుసరించినా, ఇది ఇలాగే కొనసాగితే మీరు భరించలేకపోవచ్చు. మీ మధ్య గొడవలు జరిగి విడిపోవాల్సి రావచ్చు. అప్పుడు తప్పంతా మీదే అవుతుంది. మీరు ఎలా ఉంటారో అలాగే మిమ్మల్ని స్వీకరించినపుడు అది ప్రేమ అనిపించుకుంటుంది.
వేధింపులు
మీరు మీ భాగస్వామిని ఎంతగా ప్రేమిస్తున్నప్పటికీ, వారి నుంచి ఎలాంటి వేధింపులను సహించవద్దు. మీ భాగస్వామి మిమ్మల్ని మానసికంగా, భావోద్వేగంగా, మాటలతో గానీ, చేతలతో గానీ వేధిస్తుంటే దానిని సహించకండి. వారు ఎన్నిరకాలుగ వేధించినా మీరు మౌనంగా భరిస్తూ ఉంటే, దాని వల్ల వారి ధైర్యాన్ని మరింత పెంచవచ్చు. ఇది భవిష్యత్తులో మీకు దుఃఖాన్ని కలిగించవచ్చు.
ఆంక్షలు విధించడం
మీరు మీ స్నేహితులను లేదా బంధువులను కలవకుండా మీ భాగస్వామి మిమ్మల్ని నిషేధిస్తే, లేదా వారితో మాట్లాడకుండా ఆంక్షలు విధిస్తే, వారి ఈ వైఖరిని అవలంబించకండి. మీకు మీ భాగస్వామి తప్ప వేరే ఎవరితో అవసరం లేదు అని మొదట్లో అనిపించినప్పటికీ, తర్వాత మీకంటూ ఎవరూ లేకుండా పోతారు, ఇలాంటి సంబంధంలో ఉండటం కూడా మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
జోక్‌ని తేలిగ్గా తీసుకోకండి
కొంతమంది భాగస్వామి రూపురేఖలు, ఆకారం గురించి అవహేళన చేస్తారు. ఇతరులతో పోల్చడం ప్రారంభిస్తారు. ఇది మొదట్లో సరదాగా, జోక్ చేసినట్లు అనిపించినా, అది వారు మనసులో ఉన్న మాటనే చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా విడిపోవడానికి ఇది కూడా ఒక సాకుగా వాడుకోవచ్చు, కాబట్టి శరీరాకృతి గురించి చేసే అవహేళనలను సరదాకే అయినా సహించకూడదు.
అక్రమ సంబంధం
ఒకరితో సంబంధంలో ఉంటూ మరొకరితోనూ సంబంధాన్ని కొనసాగిస్తే అది మోసం అవుతుంది. మీ భాగస్వామి మరొకరితో కూడా సంబంధాన్ని కొనసాగిస్తూ, మీతో కూడా కొనసాగించాలని చూస్తే అది సహించవద్దు.చివరగా ఒక్కమాట..
ఇక్కడ చెప్పినవన్నీ అందరికీ వర్తించవు, అందరి జీవితాలు, పరిస్థితులు ఒక్కటి కావు. మీ భాగస్వామి ఎన్ని చేసినా అది మీ మీద ప్రేమతో కూడా చేసి ఉండవచ్చు. ఇక్కడ చెప్పినట్లుగా లేక ఎవరో చెప్పినట్లుగా వెంటనే ఒక నిర్ణయానికి రావొద్దు, అనవసరంగా నిందించి మీకు ప్రియమైన వారిని దూరం చేసుకోవద్దు. ఎవరు ఇలా ఎన్ని చెప్పినా మీకంటూ ఒక అవగాహన ఉండాలి. మీ భాగస్వామి ఏంటనేది మీకు మాత్రమే తెలుసు, కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే వారితో సామరస్యంగా మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. బంధాన్ని నిలబెట్టుకోవడానికే మీ మొదటి ప్రాధాన్యతను ఇవ్వాలి.
సంబంధిత కథనం