Who is Shriya Reddy: సలార్‌లో నటించిన శ్రియా రెడ్డి ఓ ఇండియన్ క్రికెటర్ కూతురు అన్న విషయం తెలుసా?-who is shriya reddy acted in salaar movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Who Is Shriya Reddy: సలార్‌లో నటించిన శ్రియా రెడ్డి ఓ ఇండియన్ క్రికెటర్ కూతురు అన్న విషయం తెలుసా?

Who is Shriya Reddy: సలార్‌లో నటించిన శ్రియా రెడ్డి ఓ ఇండియన్ క్రికెటర్ కూతురు అన్న విషయం తెలుసా?

Hari Prasad S HT Telugu

Who is Shriya Reddy: సలార్‌ మూవీలో నటించిన శ్రియా రెడ్డి ఓ మాజీ ఇండియన్ క్రికెటర్ కూతురు అన్న విషయం తెలుసా? ఓ తెలుగు కుటుంబంలో జన్మించిన ఈమె గురించి ఆసక్తికర విషయాలు ఇక్కడ చూడండి.

సలార్ మూవీలో రాధా రామ మన్నార్ పాత్రలో కనిపించిన శ్రియా రెడ్డి

Who is Shriya Reddy: ప్రభాస్ నటించిన సలార్ మూవీ రాధా రామ మన్నార్ పాత్రలో కనిపించిన శ్రియా రెడ్డి ఈ మధ్య తరచూ వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె ఓ మాజీ ఇండియన్ క్రికెటర్ కూతురు అన్న విషయం చాలా మందికి తెలియదు. అంతేకాదు ఆమెది మన తెలుగు కుటుంబమే. శ్రియా రెడ్డి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు కూడా ఉన్నాయి.

సలార్ మూవీలో శ్రియా రెడ్డి.. రాధా రామ మన్నార్ పాత్రలో కనిపించింది. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన వరదరాజ మన్నార్ పాత్రకు ఇది సోదరి పాత్ర. ఇది చూసిన తర్వాత ఆమె పాత్రను చాలా మంది బాహుబలిలో శివగామి పాత్రతో పోలుస్తున్నారు. సలార్ లో తన నటనతో కట్టి పడేసిన శ్రియా రెడ్డి మాజీ ఇండియన్ క్రికెటర్ భరత్ రెడ్డి కూతురు కావడం విశేషం.

ఎవరీ శ్రియా రెడ్డి?

శ్రియా రెడ్డి ఓ టీవీ ప్రజెంటర్, వీడియో జాకీ, నటి. 41 ఏళ్ల ఈ నటి తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించింది. 2002లో వచ్చిన సమురాయ్ మూవీతో పరిచయమైంది. 2006లో శర్వానంద్ నటించిన అమ్మ చెప్పింది మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈమె భారత క్రికెట్ జట్టు మాజీ వికెట్ కీపర్ భరత్ రెడ్డి కూతురు. భరత్ రెడ్డి 1977 నుంచి 1981 మధ్య ఇండియన్ టీమ్ తరఫున 4 టెస్టులు, 3 వన్డేలు ఆడాడు.

వీళ్లది తెలుగు కుటుంబమే అయినా చెన్నైలో స్థిరపడింది. 1982లో భరత్ రెడ్డి దంపతులకు శ్రియా రెడ్డి జన్మించింది. ఆమె ఎస్ఎస్ మ్యూజిక్ లో వీడియో జాకీగా తన కెరీర్ మొదలుపెట్టింది. 2008లో నటుడు విశాల్ అన్న విక్రమ్ కృష్ణను పెళ్లి చేసుకోవడం విశేషం. తెలుగు, తమిళ సినిమాల్లో ఇప్పటి వరకూ పెద్దగా గుర్తింపు రాకపోయినా.. సలార్, పవన్ కల్యాణ్ ఓజీ సినిమాలతో శ్రియా రెడ్డి పేరు వార్తల్లో నిలుస్తోంది.

సలార్ రెండు భాగాల్లోనూ శ్రియా నటిస్తోంది. రాధా రామ మన్నార్ పాత్రకు మంచి పేరు రావడంతో మరిన్ని అవకాశాలు కూడా ఆమెకు వస్తున్నాయి. గతేడాది వరకూ అమెరికాలో ఉన్న ఆమె.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. గతేడాది అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన సుడల్ అనే వెబ్ సిరీస్ లోనూ ఆమె నటించింది.